విలీనం: అప్పుడు లేటైంది.. ఇప్పుడు స్పీడైంది

విలీనం: అప్పుడు లేటైంది.. ఇప్పుడు స్పీడైంది

మెజార్టీ కన్నా కాస్త ఎక్కువే బలమున్నపుడు ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకున్న టీఆర్‌ఎస్‌ రెండోసారి మంచి మెజార్టీ వచ్చినా 6 నెలల్లోనే చాల మందిని లాగేసుకుంది. 2014లో 63 సీట్లతో అధికారంలోకి వచ్చిన గులాబీ పార్టీ అప్పట్లో రెండేళ్లలో టీడీఎల్పీని విలీనం చేసుకుంటే రెండోసారి 88 సీట్లు గెలిచినప్పటికీ 6 నెలల్లోనే సీఎల్పీని కలిపేసుకుంది. అప్పట్లో టీడీపీ ఎమ్మెల్యే తలసానిని సీఎం కేసీఆర్‌ క్యాబినెట్‌లోకి తీసుకున్నారు. ఇప్పుడు సబితా ఇంద్రారెడ్డినీ తీసుకుంటారని వార్తలు వినిపిస్తున్నాయి.

2014లో టీడీపీ నుంచి 12 మంది….

2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ ఎస్ 63, కాంగ్రెస్ 22, టీడీపీ 15,  ఎంఐఎం 7, బీజేపీ 5, వైసీపీ 3, బీఎస్పీ 2, సీపీఐ 1, సీపీఎం 1 సీట్లలో విజయం సాధించాయి. ఫలితాలొచ్చిన కొద్ది రోజులకే బీఎస్పీ ఎమ్మెల్యేలు పార్టీని టీఆర్‌ఎస్‌లో విలీనం చేశారు. తరువాత టీడీపీ ఎమ్మెల్యేలు చేరడం మొదలుపెట్టారు. టీడీపీ నుంచి గెలిచిన తలసాని గులాబీ గూటికి చేరడంతో సీఎం కేసీఆర్‌ క్యాబినెట్‌లోకి తీసుకున్నారు. తరువాత వరుసగా తీగల కృష్ణారెడ్డి, చల్లా ధర్మారెడ్డి, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, మాధవరం కృష్ణారావు, సాయన్న, కేపీ వివేక్, ప్రకాష్‌గౌడ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, రాజేందర్‌రెడ్డి, అరికెపూడి గాంధీ, మాగంటి గోపినాథ్‌ చేరారు. 15 మంది ఎమ్మెల్యేల్లో 12 మంది చేరటంతో టీఆర్‌ఎస్‌లో టీడీఎల్పీని విలీనం చేయాలని అప్పటి స్పీకర్ మధుసూదనాచారికి ఎర్రబెల్లి దయాకర్‌రావు లేఖ ఇచ్చారు. 2014లో ఫలితాలొస్తే 2016 మార్చిలో టీడీఎల్పీ విలీనం జరిగింది. తరువాత వైసీపీ నుంచీ ఎమ్మెల్యేలు చేరడంతో అసెంబ్లీలో ఆ పార్టీ కూడా కనమరుగైంది.

ఈసారి గెలిచింది ఇద్దరే…

2018 డిసెంబర్‌లో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి ఇద్దరే గెలిచారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా సత్తుపల్లి నుంచి సండ్ర వెంకటవీరయ్య, అశ్వారావుపేట నుంచి మెచ్చా నాగేశ్వరావు గెలుపొందారు. సండ్ర ఈమధ్యే టీఆర్‌ఎస్‌లో చేరారు. నాగేశ్వరావూ చేరుతారని వార్తలు వినిపించగా టీడీపీని వీడేది లేదని ఆయన గురువారం స్పష్టం చేశారు.