
- ప్రధాన పార్టీల నుంచి ఆటోమేటెడ్ కాల్స్ ద్వారా ఓటర్లకు విజ్ఞప్తి
- పోలింగ్ కు మూడు రోజులే ఉండగా స్పీడ్ గా కొనసాగిస్తున్న ప్రచారం
- బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీల నుంచి కంటిన్యూగా ఫోన్లు
- పథకాలపై తెలుసుకుంటూ లబ్ధిదారులకు అధికార పార్టీ రిక్వెస్ట్
- ఓటు ఎందుకు వేయాలని ప్రశ్నిస్తూ.. ఆగ్రహం వ్యక్తం చేసిన ఆడియోలు వైరల్
హైదరాబాద్, వెలుగు : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తుండగా బరిలో నిలిచిన ప్రధాన పార్టీల అభ్యర్థులు ఓటర్లకు మెసేజ్ లు పంపడమే కాకుండా వాయిస్ కాల్స్ చేస్తున్నారు. ఐవీఆర్ఎస్ వాయిస్ కాల్స్, మెసేజ్ లు పంపుతూ.. “ నేను మీ నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థిని మాట్లాడుతున్నా.. తమ పార్టీకి ఓటువేసి గెలిపించాలి”.. అని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. మూడు రోజులు మాత్రమే సమయం ఉండడంతో సోషల్ మీడియాలో స్వీడ్ గా ప్రచారం కొనసాగిస్తున్నారు. సెగ్మెంట్ పరిధిలో అన్ని ప్రాంతాల్లో పర్యటించలేకపోవడంతో టెక్నాలజీని వినియోగించుకుంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. అభ్యర్థుల వాయిస్ ఒక నిమిషం నుంచి రెండు నిమిషాలలోపు రికార్డ్ చేసి సెగ్మెంట్ పరిధిలోని ఓటర్ల ఫోన్ నంబర్లకు వాయిస్ కాల్స్ పంపిస్తున్నారు. మరోవైపు ఎస్ఎంఎస్ లను కూడా పంపుతూ.. ఓటర్లను ఆకట్టుకుంటున్నారు.
దాదాపు 150 అక్షరాలతో తయారైన మెసేజ్ ను ఇంగ్లిష్, తెలుగు భాషల్లో సెండ్ చేస్తున్నారు. మొత్తంగా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అన్నిరకాలుగా అభ్యర్థులు ప్రయత్నాలు చేస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి అయితే..‘‘ తాము కాల్ సెంటర్ నుంచి మాట్లాడుతున్నామని, మీకు ప్రభుత్వ పథకం వచ్చింది కదా..’’ అంటూ.. ఈసారి బీఆర్ఎస్కు ఓటు వేయాలని డైరెక్ట్ గానే కోరుతున్నారు. మరోవైపు బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు ఈసారి తమకు చాన్స్ ఇవ్వాలని, అమూల్యమైన ఓటును తమకే వేయాలని అభ్యర్థిస్తున్నారు.
లబ్ధిదారులే టార్గెట్గా కాల్స్ చేస్తుండగా..
ప్రభుత్వ పథకాలు పొందిన లబ్ధిదారులను టార్గెట్ గా బీఆర్ఎస్నుంచి ఓటర్లకు ఫోన్లు చేస్తున్నారు. ఇందుకోసం బీఆర్ఎస్అభ్యర్థులు ప్రత్యేకంగా కాల్ సెంటర్లను ఏర్పాటు చేసుకున్నారు. ‘ మీ నియోజకవర్గంలో అభివృద్ధి ఎలా ఉంది? స్థానిక సమస్యలను పరిష్కరించడంలో ఎవరు ముందుంటారు ? ప్రస్తుత ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? ఈసారి మీ ఓటు ఎవరికి?’ అంటూ.. ఓటర్లకు ఫోన్లు చేసి సంక్షేమ పథకాలు పొందారని గుర్తు చేసి వివరిస్తున్నారు. ఆపై సదరు అభ్యర్థికే ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు.
సర్కార్ పథకం పొందిన వారి ఫోన్ నంబర్లను సేకరించి టార్గెట్ గా కాల్స్ చేస్తున్నారు. కాల్ సెంటర్ ప్రతినిధులకు కొందరు దిమ్మతిరిగే జవాబులు ఇస్తున్నారు. ప్రభుత్వం పథకం పొందితే ఓటు ఎందుకు వేయాలని ప్రశ్నిస్తున్నారు. ఘాటుగా జవాబు ఇస్తున్నారు. ఇలాంటి కొన్ని ఆడియోలు సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతున్నాయి.
కంటిన్యూ కాల్స్ తో అసహనం
గ్రేటర్ పరిధిలో 24 సెగ్మెంట్లు ఉండగా, ఇందులో కొన్నిచోట్ల మూడు పార్టీ మధ్య పోటీ ఉంది. మిగతా అన్ని చోట్ల రెండు పార్టీల మధ్య గట్టి పోటీ ఉంది. బరిలో నిలిచిన అభ్యర్థుల నుంచి వరుసగా వాయిస్ కాల్స్ వస్తున్నాయి. గెలవాలనే తపనతో అభ్యర్థులు పదే పదే వాయిస్ కాల్స్ పంపుతున్నారు. దీంతో ఓటర్లు ఇబ్బందికి గురవుతున్నారు. కొందరైతే వాయిస్ కాల్స్ ని అసలు లిఫ్ట్ చేయడంలేదు. ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నుంచి ఇలాంటి కాల్స్ వస్తున్నాయి. వీటికితోడు అధికార పార్టీ నుంచి నేరుగా కాల్స్ చేస్తుండటంతో ఈ ప్రస్టెషన్ అంతా వారిపై తీర్చుకుంటున్నారు. మొత్తానికి కంటిన్యూగా కాల్స్ వస్తుండటంతో ఓటర్లు అసహనానికి గురవుతున్నారు.