రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం

రాష్ట్రంలో  తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం

హైదరాబాద్  : రాష్ట్రానికి మూడ్రోజుల రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణశాఖ. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని.. మరికొన్ని  చోట్ల ఉరుములు,మెరుపులతో వానలు పడొచ్చని హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో హైదరాబాద్ సహా జిల్లాలో వర్షాలు పడుతున్నాయి. 24 గంటల్లో అల్పపీడనం మరింత బలపడుతుందని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. 

నగరవ్యాప్తంగా కురుస్తున్న వర్షం..

గత రెండు రోజులు గా ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గాజుల రామారావులో 1.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా,  జీడిమెట్లలో 1.5 సెంటీమీటర్లు, షాపూర్ నగర్ లో 1.2 సెంటీమీటర్లు.. హస్తినపురంలో ఒక సెంటీమీటర్ వర్షపాతం నమోదైంది.

నిన్న గణేష్ నిమజ్జనం కూడా వర్షంలోనే కొనసాగింది. హైదరాబాద్ జంటనగరాలతో పాటు, ఉమ్మడి కరీంనగర్, నల్గొండ, వరంగల్, ఆదిలాబాద్, కామారెడ్డి జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. కొన్ని చోట్ల వాగులు ఉప్పొంగి రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.