తెలంగాణలో మూడు రోజులు వడగాడ్పులు

తెలంగాణలో మూడు రోజులు వడగాడ్పులు
  •     అన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ
  •     ఆదివారం నుంచి వర్షాలు కురిసే చాన్స్ 
  •     బుధవారం18 జిల్లాల్లో 44 డిగ్రీలకుపైనే టెంపరేచర్లు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మూడు రోజుల పాటు వడగాడ్పులు తీవ్రంగా ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్​ను జారీ చేస్తూ బుధవారం బులెటిన్ విడుదల చేసింది. గురువారం అన్ని జిల్లాలకు.. శుక్ర, శనివారాల్లో హైదరాబాద్, జనగామ, మేడ్చల్, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి మినహా రాష్ట్రమంతటికీ ఆరెంజ్ అలర్ట్​ను జారీ చేసింది. మహారాష్ట్ర, కర్నాటక మీదుగా ఒక ద్రోణి, తమిళనాడు, రాయలసీమ, దక్షిణ తెలంగాణ మీదుగా మరో ద్రోణి ఏర్పడ్డాయని.. వాటి ప్రభావంతో ఆదివారం నుంచి పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఆదివారం నుంచి రెండు మూడు రోజులపాటు టెంపరేచర్లు కొంత తగ్గే అవకాశం ఉందని తెలిపింది. హైదరాబాద్ లో శుక్రవారం నుంచి టెంపరేచర్లు తగ్గే చాన్స్ ఉందని పేర్కొంది. 

ఎండలు దంచికొట్టినయ్ 

రాష్ట్రంలో బుధవారం కూడా ఎండలు దంచి కొట్టాయి. 18 జిల్లాల్లో 44 డిగ్రీలకుపైనే టెంపరేచర్లు రికార్డ్ అయ్యాయి. 9 జిల్లాల్లో 43 నుంచి 44 డిగ్రీల మధ్య నమోదయ్యాయి. నల్గొండ జిల్లా నిడమనూరులో అత్యధికంగా 44.8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. జిల్లాలోని 27 మండలాల్లో 43 డిగ్రీలకుపైనే రికార్డ్ అయ్యాయి. మొత్తంగా రాష్ట్రంలోని 200కుపైగా మండలాల్లో ఉష్ణోగ్రతలు 43 నుంచి 44.8 డిగ్రీల మధ్య నమోదయ్యాయి. సూర్యాపేట జిల్లా మునగాల, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం, మహబూబాబాద్ జిల్లా అయ్యగారిపల్లిలో 44.7, ములుగు జిల్లా వెంకటాపురం, పెద్దపల్లి జిల్లా రంగంపల్లిలో 44.5, జయశంకర్ జిల్లా కొత్తపల్లిగోరిలో 44.4, జగిత్యాల జిల్లా వెల్గటూరులో 44.3, ఖమ్మం జిల్లా ముదిగొండ, హనుమకొండ జిల్లా నడికుడ, మంచిర్యాల జిల్లా హాజీపూర్, ఆసిఫాబాద్ ​జిల్లా కౌటాల, కామారెడ్డి జిల్లా డోంగ్లిలో 44.2, కరీంనగర్ జిల్లా జమ్మికుంట, జనగామ జిల్లా జాఫర్​గఢ్, వనపర్తి జిల్లా కన్నయ్యపల్లిలో 44.1, వరంగల్ జిల్లా రెడ్లవాడలో 43.7, ఆదిలాబాద్, యాదాద్రి భువనగిరి, జోగులాంబ గద్వాలలో 43.5, సిరిసిల్లలో 43.4, మెదక్ లో 43.3, మహబూబ్​నగర్​లో 43.2, నాగర్​కర్నూల్​లో 43, సంగారెడ్డిలో 42.7, మల్కాజిగిరిలో 42.4, వికారాబాద్, హైదరాబాద్ లో 41.8 డిగ్రీల మేర టెంపరేచర్లు నమోదయ్యాయి.