జులైలో వరదలు.. ఆగస్టులో కరువు

జులైలో వరదలు..  ఆగస్టులో కరువు
  • వానాకాలం పంటలు ఆగమాగం
  • పత్తి, వరి, మక్క, కంది సాగుపై తీవ్ర ప్రభావం
  • ఇట్లనే ఇంకో పది రోజులుంటే కష్టకాలమే.. వెలవెలబోతున్న కృష్ణా ప్రాజెక్టులు
  • ఆగస్టులో 62 శాతం లోటు వర్షపాతం.. 60 ఏండ్లలో అత్యంత తక్కువ
  • ఎల్‌‌నినో ప్రభావంతోనే అంటున్న నిపుణులు

హైదరాబాద్‌‌, వెలుగు: జులైలో ఊర్లు మునిగిపోయేంత స్థాయిలో భారీ వర్షాలు పడ్డాయి. పొలాల్లో ఇసుక మేటలు వేశాయి. కానీ ఆగస్టుకొచ్చేసరికి సీన్ రివర్స్ అయిపోయింది. అసలు చినుకు జాడ కనిపించలేదు. జులైలో పంటలు మునిగితే.. ఇప్పుడు వానల్లేక ఎండుతున్నాయి. ఈ నెలలో 62 శాతం లోటు వర్షపాతం ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. దాదాపు అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి. తొలి రెండు వారాల్లో 95 శాతం లోటు వర్షపాతం నమోదు కాగా.. మూడో వారంలో ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో కొన్ని జల్లులు పడ్డాయి. ఆయా జిల్లాల్లో మూడో వారంలో సగటున 70 శాతం సాధారణ వర్షపాతం నమోదైంది. నాలుగో వారంలో మళ్లీ డ్రై స్పెల్ కొనసాగింది. 

ఈ నెలలో సగటు వర్షపాతం 217 మి.మీ. కాగా.. కేవలం 79.7 మి.మీ. మాత్రమే కురిసింది. చివరి సారిగా 1968 ఆగస్టులో 47 మిల్లీమీటర్ల అత్యంత తక్కువ వర్షపాతం నమోదైంది. ఆ తర్వాత ఈ ఆగస్టు అత్యంత కరువు నెలగా నిలిచింది. 60 ఏండ్ల రికార్డులను తిరగరాసింది. జూన్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు 567 మిల్లీమీటర్ల వర్షపాతం కురవాల్సి ఉండగా.. 642 మిల్లీమీటర్లు నమోదైనట్టు వాతావరణ శాఖ చెప్తుండటం గమనార్హం.

నాగార్జునసాగర్‌‌లో పెద్ద వరద ఒక్కటీ రాలే

జూన్‌లో రుతుపవనాల రాక ఆలస్యమైంది. తొలి వారంలోనే కేరళను తాకాల్సిన నైరుతి.. మూడు వారాలు ఆలస్యంగా ఎంటరైంది. అనుకూల వాతావరణం లేకపోవడంతో దేశమంతా విస్తరించడానికి కాస్త టైం పట్టింది. మన రాష్ట్రంలో జులై రెండో వారం నుంచి వర్షాలు మొదలయ్యాయి. ఆ నెల చివరి వారంలో (జులై 26 నుంచి నెలాఖరు వరకు) కురిసిన వర్షాలకు ఊర్లకు ఊర్ల మునిగిపోయాయి. మోరంచపల్లి విషాదం దేశమంతా వినిపించింది. 

ఆగస్టు తొలి వారంలో ఓ రెండు మూడు రోజులు వర్షాలు బాగానే పడినా.. తర్వాతి నుంచి మొహం చాటేశాయి. జులైలో కురిసిన వర్షాలు, పైనుంచి వచ్చిన వరదలతో గోదావరి బేసిన్‌లోని శ్రీరాంసాగర్, మానేరు, ప్రాణహిత, కడెం వంటి ప్రాజెక్టులు నిండాయి. కృష్ణా బేసిన్​లోని ప్రాజెక్టులకు వరదొచ్చినా ఆలస్యంగా మొదలవడంతో పెద్దగా ఫలితం లేకుండా పోయింది. శ్రీశైలం ప్రాజెక్టులో 215.81 టీఎంసీలకుగానూ ప్రస్తుతం కేవలం 88.47 టీఎంసీల నీళ్లే ఉన్నాయి. 

నాగార్జునసాగర్​లో ఇప్పటివరకు పెద్ద వరద వచ్చిందే లేదు. ఆ ప్రాజెక్టులో 312.05 టీఎంసీలకుగానూ 153.69 టీఎంసీల నీటి నిల్వ ఉన్నది. ఈ బేసిన్​లో ఒక్క జూరాల ప్రాజెక్టులోనే నీళ్లు కొంచెం సమృద్ధిగా ఉన్నాయి. 9.66 టీఎంసీలకుగానూ.. 6.7 టీఎంసీల నిల్వ ఉన్నది. పైన ఆల్మట్టి పూర్తి స్థాయిలో నిండింది. 129 టీఎంసీలకుగానూ 123 టీఎంసీల స్టోరేజీ ఉంది. నారాయణపూర్​లో 37 టీఎంసీలకు 27.79 టీఎంసీల స్టోరేజీ ఉంది. గోదావరి బేసిన్​లోని శ్రీరాంసాగర్, ఎల్లంపల్లి రిజర్వాయర్లు పూర్తిస్థాయిలో నిండాయి.

పంటలు ఆగమైతున్నయ్

నెల రోజుల కిందట ముంపునకు గురైన పంట పొలాలు.. ఇప్పుడు నీళ్లు లేక బీటలు వారుతున్నాయి. అవసరం లేని టైంలో కుంభవృష్టితో పంటలను దెబ్బతీసిన వర్షాలు.. కురవాల్సిన సమయంలో ముఖం చాటేశాయి. తొలుత సీజన్ ప్రారంభంలో వానల్లేక నాటిన విత్తనాలు మొలకెత్తలేదు. రెండు మూడు సార్లు నాటాల్సి వచ్చింది. జూన్‌ మూడో వారం నుంచి జులై నెలంతా వర్షాలు, వరదలు బీభత్సం సృష్టించాయి. వానాకాలం సాగు చేసిన పంటలన్నీ లక్షల ఎకరాల్లో మునిగి పోగా, కొన్ని చోట్ల వరదలకు కొట్టుకు పోయి తీవ్ర నష్టం కలిగించాయి. జూన్‌లో 6 రోజులు, ఆగస్టులో ఒక్కరోజు మాత్రమే వర్షం -కురిసింది. దీంతో పత్తి, మొక్కజొన్న, జొన్న పంటల్లో ఎదుగుదల లేకుండా పోయింది. 

ఆకుమచ్చ, ఇతర తెగుళ్లు సోకి దెబ్బతింటున్నాయి. అప్పులు చేసి పెట్టుబడులు పెట్టిన రైతన్నలు తీవ్రంగా నష్టపోతున్నారు. వానాకాలం సీజన్‌లో కోటిన్నర లక్షల ఎకరాల టార్గెట్‌లో ఇప్పటి వరకు కోటి 16 లక్షల ఎకరాల్లో పంటలు వేశారు. ఇట్లనే ఇంకా పది రోజులుంటే పంట దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపనుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుత సీజన్‌లో 44.70 లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది. జూన్‌లో లోటు వర్షపాతం కారణంగా.. వేసిన పత్తి విత్తనాలు మొలకెత్తలేదు. జులై నెలలో భారీ వర్షాలతో మొలకెత్తిన పత్తి వరద ముంపునకు గురై వేళ్లు దెబ్బతిన్నాయి. ఇప్పుడు ఆగస్టులో నీటి ఎద్దడితో ఇబ్బందులు నెలకొన్నాయి. 

గులాబీ రంగు పురుగు ప్రభావం ఎక్కువగా ఉంది. ఎకరానికి  సగటున 10 నుంచి 12 క్వింటాళ్లు రావాల్సిన కాటన్‌ దిగుబడి, ఈయేడు 5 క్వింటాళ్ల వరకే వచ్చే అవకాశం ఉందని అగ్రికల్చర్‌ ఎక్స్‌పర్ట్స్‌ అంటున్నారు. 55.90 లక్షల ఎకరాల్లో వరి నాట్లు పడ్డాయి. వానల్లేక పొలాలకు నీరు అందించడానికి రైతులు కష్టాలు పడాల్సి వస్తోంది. మక్కల సాగు 5.21 లక్షల ఎకరాలకే పరిమితమైంది. కాత పూత టైమ్ లో వర్షాలు పడకపోవడంతో పంట ఎదగడం లేదని రైతులు వాపోతున్నరు. జొన్న పరిస్థితి మరింత అధ్వాన్నంగా ఉంది. 26 వేల ఎకరాల్లోనే పంట సాగైంది. కంకి దశలో నీరు లేక దిగుబడి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. 4.58 లక్షల ఎకరాల్లో కంది సాగు జరిగింది. కానీ వానల్లేకపోవడంతో రైతన్నలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.

సెప్టెంబర్ తొలి వారంలో పరిస్థితి మారొచ్చు

ఎల్‌నినో ఎఫెక్ట్ ఉండొచ్చని జులై రెండో వారంలోనే ఐఎండీ సూచనప్రాయంగా చెప్పింది. అదే ఇప్పుడు నిజమైందని వాతావరణ నిపుణులు అంటున్నారు. పశ్చిమ పసిఫిక్ సముద్రంలో ఎల్‌నినో పరిస్థితులు ఏర్పడడం వల్లే రుతుపవనాల గమనం మందకొడిగా సాగుతున్నదని చెప్తున్నారు. అయితే సెప్టెంబర్ తొలి వారం నుంచి పరిస్థితి కాస్తంత మెరుగుపడొచ్చని ఐఎండీ హైదరాబాద్ శాఖ సైంటిస్ట్ శ్రావణి తెలిపారు. ప్రస్తుతం బంగాళాఖాతంపై తుఫాను ఆవర్తనం ఏర్పడిందని చెప్పారు. 

ఈ ప్రభావంతో వర్షాలు మళ్లీ దండిగా పడే చాన్స్ ఉందని తెలిపారు. అక్టోబర్​ రెండో వారంలో రుతుపవనాలు వెళ్లిపోయేంత వరకు మంచి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 43 రోజులు వర్షాలు పడ్డాయి. ములుగు జిల్లాలో అత్యధికంగా 47 రోజులు, భద్రాద్రి జిల్లాల్లో 45 రోజుల పాటు పడ్డాయి. అత్యల్పంగా హైదరాబాద్​లో 22 రోజులే కురిశాయి. రాబోయే రెండు రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.