
ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ విచారణలో కీలక విషయాలు వెల్లడించారు ఐఏఎస్ అర్వింద్ కుమార్. అప్పటి మున్సిపల్ మినిస్టర్ కేటీఆర్ ఆదేశాల మేరకే FEO కంపెనీకి నిధులు ట్రాన్స్ ఫర్ చేసినట్లు చెప్పారు.
అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాలతోనే నిధులు విడుదల చేశాం. హెచ్ఎండీడబ్లూ ఖాతా నుంచి ఎఫ్ఈవో కంపెనీకి నిధులు మల్లింపుపై నా ప్రమేయం లేదు. కేటీఆర్ స్వయంగా వాట్సప్ ద్వారా FEO కి నిధులు విడుదల చేయాలని ఆదేశించారు. ఇందులో నాకు ఎలాంటి వ్యక్తి గత స్వార్థం లేదు. బిజినెస్ రూల్స్ , ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవాలని మంత్రికి చెప్పాను. FEO కంపెనీకి వెంటనే నిధులు విడుదల చేయాలి.. అవన్నీ నేను చూసుకుంటానని కేటీఆర్ చెప్పారు. 45.71 కోట్లు నగదును ఇండియన్ ఓవర్సిస్ బ్యాంక్ ద్వారా బ్రిటన్ పౌండ్స్ రూపంలో FEO కంపెనీకి చెల్లించాము అని అర్వింద్ కుమార్ విచారణలో వెల్లడించారు.
ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో జూలై 3న ఉదయం 11: 30 గంటల నుంచి ఐఏఎస్ అర్వింద్ కుమార్ ను ఏసీబీ విచారిస్తోంది. జూన్16 న కేటీఆర్ స్టేట్మెంట్ ఆధారంగా అరవింద్ కుమార్ ను ఏసీబీ విచారిస్తోంది. ఈ కేసులో A2 గా ఉన్న అరవింద్ కుమార్, A1 కేటీఆర్ ఉన్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ లో ఫార్ములా ఈ కార్ రేసింగ్ పోటీలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో అవకతవకలు జరిగాయని.. నిబంధనలకు విరుద్ధంగా నిధుల చెల్లింపు జరిగిందన్న అభియోగాలపై ఏసీబీ కేసు నమోదు చేసింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏ1, ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్ ఏ2, హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్‌ఎన్ రెడ్డిని ఏ3 నిందితులుగా చేర్చారు. ఇప్పటికే కేటీఆర్, అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డిలను ఏసీబీ విచారించింది.