
మెట్‌పల్లి, వెలుగు : రూ.లక్ష అసలు నోట్లకు ఐదు లక్షల నకిలీ నోట్లు ఇస్తామని నమ్మిస్తారు.. తర్వాత ఓ నిర్మానుష్య ప్రదేశానికి పిలిపించుకుంటారు.. అసలు నోట్లు చేతిలో పడగానే ఆ ముఠా సభ్యులే పోలీసులం అంటూ ఎంట్రీ ఇస్తారు, అసలు నోట్లు తీసుకొచ్చిన వారిని బెదిరించి అసలు, నకిలీ నోట్లతో అక్కడి నుంచి ఉడాయిస్తారు. ఇలా పలువురిని మోసం చేసిన ఆరుగురు వ్యక్తులను జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పోలీసులు శనివారం పట్టుకున్నారు.
కేసుకు సంబంధించిన వివరాలను మెట్‌పల్లి డీఎస్పీ ఉమామహేశ్వరరావు వెల్లడించారు. జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం తాళ్లధర్మారం గ్రామానికి చెందిన సదాల సంజీవ్, జగిత్యాల పట్టణం వంజరివాడకు చెందిన అమందు శివకుమార్, నిర్మల్ జిల్లా దాసురాబాద్ మండలం భుట్టాపూర్‌కు చెందిన మగ్గిడి కిషన్, కడెం మండలం అంబరిపేట్‌కు చెందిన కలకుంట్ల గంగారాం, లక్ష్మణచందా మండలం బోరేగావ్‌కు చెందిన బొంగురాల గంగారాం, మునిమానికల అశోక్ ముఠాగా ఏర్పడ్డారు. ఈజీగా మనీ సంపాదించేందుకు నకిలీ నోట్లు చలామణి చేయాలని ప్లాన్ చేశారు.
ఇందులో భాగంగా రూ.లక్ష ఒరిజినల్ నోట్లు ఇస్తే ఐదు లక్షల నకిలీ నోట్లు ఇస్తామని, వాటిని ఎలా చలామణి చేయాలో కూడా తామే నేర్పిస్తామని పలువురిని నమ్మమించారు. తర్వాత ఒరిజినల్ నోట్లు తీసుకొని ఓ నిర్మానుష్య ప్రాంతానికి రావాలని చెబుతారు. మొదట ఇద్దరు వ్యక్తులు కారులో వచ్చి అసలు నోట్లు తీసుకొని నకిలీ నోట్లు ఇస్తారు. ఇదే టైంలో మిగతా వారు పోలీసులం అంటూ అక్కడికి వచ్చి భయభ్రాంతులకు గురిచేస్తారు.
స్టేషన్‌కు తీసుకెళ్తామని, కేసు పెడతామని బెదిరిస్తారు. బాధితులు బతిమిలాడడంతో అసలు, నకిలీ నోట్లు తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఇలా హైదరాబాద్‌లో ముగ్గురిని, ధర్మపురి, కరీంనగర్, జన్నారం, జగిత్యాలలో ఒకరి చొప్పున మోసం చేసి రూ. 10 లక్షలు తీసుకున్నారు. ఇదే తరహాలో మెట్‌పల్లి మండలంలో దాబా నిర్వహిస్తున్న రాజేశ్వరరావుపేటకు చెందిన ముంజ రాజేందర్ అనే వ్యక్తిని నమ్మించి రూ. లక్ష తీసుకొని పెద్దగుండు సమీపంలోకి రావాలని చెప్పారు. నకిలీ నోట్లు తీసుకునే క్రమంలో మరో ఇద్దరు వ్యక్తులు వచ్చి తాము పోలీసులమని చెప్పి రూ. లక్షతో తీసుకొని పారిపోయారు. మోసపోయానని గ్రహించిన రాజేందర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేశారు.
మెట్‌పల్లి పట్టణ శివారులోని ఓ దాబాలో ఆరుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి చేరుకొని అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా నకిలీ నోట్ల పేరిట మోసం చేసింది తామేనని ఒప్పుకున్నారు. వారి వద్ద నుంచి ఓ కారు, రెండు బైక్‌లు, రూ. 7 లక్షల నకిలీ నోట్లు, రూ. 5,050 అసలు నగదు, ఆరు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్న డీఎస్పీ చెప్పారు. నిందితులను పట్టుకున్న సీఐ నిరంజన్‌రెడ్డి, ఎస్సైలు, సిబ్బందిని ఎస్పీ అశోక్‌కుమార్ అభినందించారు.