మెట్ పల్లి సివిల్ సప్లై గోదాంలో భారీ అగ్ని ప్రమాదం

మెట్ పల్లి సివిల్ సప్లై గోదాంలో భారీ అగ్ని ప్రమాదం
  •     6 ఫైరింజన్లతో మంటలను ఆర్పిన అధికారులు 
  •     కాలినపోయిన రూ.9 లక్షల విలువైన గన్ని సంచులు  
  •     తాగుబోతుల పనేమోనని ఆఫీసర్ల అనుమానం? 
  •       గోదాంను పరిశీలించిన జగిత్యాల ఎస్పీ అశోక్ ​కుమార్

కోరుట్ల(మెట్​పల్లి),వెలుగు: జగిత్యాల జిల్లా మెట్ పల్లి లోని వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలోని  సివిల్ సప్లై గోదాంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గోదాంలో నిల్వ చేసిన గన్ని సంచులు తగలబడ్డాయి. రాత్రి 10 దాటినా కూడా మంటలు ఎగిసి పడుతూనే ఉన్నాయి. గోదాం చుట్టూ ఉన్న గోడను జేసీబీతో కూల్చివేసి లోపలికి ఫైరింజన్లతో వెళ్లి మంటలను ఆర్పుతున్నారు.  వివరాల్లోకి వెళ్తే..  సివిల్​సప్లై గోదాంలో ఆదివారం ఉదయం 9 గంటల సమయంలో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. స్థానికులు చూసి అధికారులకు, పోలీసులకు సమాచా రం అందించారు. 

 మెట్​పల్లి, జగిత్యాల, ఆర్మూర్​,భీంగల్, ఖానాపూర్​, ధర్మపురి నుంచి వచ్చిన మొత్తం 6 ఫైరింజన్లతో ఫైర్​ఆఫీసర్లు, సిబ్బంది మంటలను ఆర్పేస్తున్నారు. గోదాంలోని గన్నిసంచుల మధ్యలో మంటలు అంటుకోవడంతో దట్టమైన పొగతో కమ్ముకుంది. డీఎస్పీ రాములు , సీఐ అనిల్, ఎస్ఐ కిరణ్​ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. సాయంత్రం జగిత్యాల ఎస్పీ అశోక్​కుమార్ వెళ్లి  రాత్రి 8 వరకు ఉండి పరిస్థితిని పరిశీలించారు. 

 అగ్ని ప్రమాదం జరిగిన తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. మంటలు ఆర్పేవరకు బందోబస్తు చర్యలు తీసుకోవాలని డీఎస్పీ రాములు, సీఐ అనిల్​కుమార్​ను ఆదేశించారు. ఆర్డీవో శ్రీనివాస్​ఆధ్వర్యంలో  రెవెన్యూ, సివిల్​సప్లై అధికారులు, సిబ్బంది గోదాం వద్దే ఉండి పరిస్థితిని పరిశీలిస్తున్నారు. సోమవారం ఉదయం మంటలు అదుపులోకి వచ్చే అవకాశం ఉందని ఫైర్​, పోలీసు , రెవెన్యూ అధికారులు చెబుతున్నారు.

తాగుబోతుల పనేనా..!

సివిల్ సప్లై గోదాంలో ఒక కిటికి తెరిచి ఉండడంతో తాగుబోతుల పనా ..? లేదా ఇతర కారణాలేమన్నా  ఉన్నాయా.. అని అధికారులు అనుమానిస్తున్నారు. గోదాం ఏరియా మందుబాబులకు అడ్డాగా మారింది. ఇక్కడ నిత్యం మద్యం తాగుతుంటారు. ఎవరైనా సిగరెట్ తగేటప్పుడు అగ్గి పుల్ల పడేసి ఉండొచ్చనే అనుమానాలు వస్తున్నాయి. 

2018 నుంచి గోదాంలో సుమారు రూ.9 లక్షల విలువైన గన్ని సంచులను నిల్వ ఉంచామని, అందులో దాదాపు రూ.10 వేల వరకు పనికి వచ్చే గన్ని సంచులు ఉన్నాయని గోదాం ఇన్ చార్జ్ అధికారి సురేశ్ తెలిపారు.  ఇప్పటికైనా గోదాం ఏరియాలోకి మందుబాబులు రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.