ఓల్డ్ సిటీ ప్రజలకు ఎంఐఎం క్షమాపణ చెప్పాలి : నిరంజన్

ఓల్డ్ సిటీ ప్రజలకు ఎంఐఎం క్షమాపణ చెప్పాలి :  నిరంజన్

హైదరాబాద్, వెలుగు: ఓల్డ్ సిటీ ప్రజలకు ఎంఐఎం నేతలు బహిరంగ క్షమాపణ చెప్పాలని పీసీసీ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్ డిమాండ్ చేశారు. ఎంఐఎం నేతల కారణంగానే ఓల్డ్ సిటీ మెట్రో రైల్ పనులు లేట్ అవుతున్నాయని తెలిపారు. దీంతో ప్రాజెక్ట్ కాస్ట్ రూ.2 వేల కోట్లు పెరిగిందని ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో చెప్పారు. ఎంఐఎం అభ్యంతరాలతో మళ్లీ ఏడేండ్ల తర్వాత పనులు ప్రారంభం అవుతున్నాయని పేర్కొన్నారు. ఈ నెల 7న ఫలక్​నుమా వద్ద పాతబస్తీ మెట్రో పనులు ప్రారంభించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించినట్టు తెలిపారు. దీనిపై ఓల్డ్ సిటీ ప్రజలు, కాంగ్రెస్ లీడర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. 

నగరంలో మెట్రో పనులు 2017లోనే స్టార్ట్ అయినా.. ఎంఐఎం  అభ్యంతరాలతో ఎంజీబీఎస్ వద్దే ఆగిపోయాయని గుర్తు చేశారు. ఎంఐఎం సూచించిన ప్రత్యామ్నాయ రూట్ కు ఎల్ అండ్ టీ కంపెనీ ఒప్పుకోకపోవడం, అప్పటి కాంట్రాక్ట్ గడువు ముగియడంతో ప్రాజెక్టు కాస్ట్ భారీగా పెరిగిందని నిరంజన్ గుర్తు చేశారు. అప్పటి ప్రభుత్వం 2014, డిసెంబర్ 9న ఏర్పాటు చేసిన ఆల్ పార్టీ మీటింగ్ లో మజ్లిస్ ఎమ్మెల్యేలు పాతబస్తీ మెట్రో ఒరిజినల్ ప్రపోజల్ ను అడ్డుకున్నారని తెలిపారు. కాంగ్రెస్ తో పాటు ఇతర విపక్షాలు,  ప్రజా సంఘాలు పాత బస్తీకి మెట్రో రైలు సౌకర్యం కల్పించాలని అనేక ఆందోళనలు చేశారని పేర్కొన్నారు. ఈ పనులకు అవసరమైన నిధులను విడుదల చేయాలని రేవంత్​ను కోరారు.