మెట్రో ఆఫర్లు మరో 6 నెలలు పొడిగింపు

మెట్రో ఆఫర్లు మరో 6 నెలలు పొడిగింపు

హైదరాబాద్, వెలుగు: ఉగాది సందర్భంగా  హైదరాబాద్ మెట్రో కీలక నిర్ణయం తీసుకుంది. ప్యాసింజర్ల నుంచి వచ్చిన రిక్వెస్టుల దృష్ట్యా సూపర్​ సేవర్​మెట్రో హాలీడే కార్డ్, మెట్రో స్టూడెంట్​పాస్, సూపర్​ ఆఫ్​ పీక్ అవర్ కార్డ్ ఆఫర్లను మరో ఆరు నెలలు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఆఫర్లు సోమవారం నుంచే ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చాయి. ఇటీవలే ఆఫర్లను రద్దు చేయడంతో  మెట్రో ప్రయాణికుల నుంచి వ్యతిరేకత వచ్చింది.

దీంతో మెట్రో యాజమాన్యం పునరాలోచించి ఆఫర్ల గడువును పొడిగించింది. తక్కువ ధరలో ప్రజలకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడానికి హెచ్ఎంఆర్  హైదరాబాద్ కట్టుబడి ఉందని హెచ్ఎంఆర్ఎల్  మేనేజింగ్ డైరెక్టర్ ఎన్‌‌‌‌వీఎస్ రెడ్డి వెల్లడించారు. ఆఫర్లను ఆరు నెలల పాటు పొడగించి మెట్రో ప్రయాణాన్ని ప్రయాణికులకు మరింత అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు.

కాగా, మెట్రోలో సూపర్ సేవర్ మెట్రో హాలిడే కార్డుతో సెలవు రోజుల్లో రూ.59కే ప్రయాణం, రద్దీ లేని సమయాల్లో ఛార్జీల్లో 10 శాతం డిస్కౌంట్​ ఇస్తూ సూపర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ పీక్‌‌‌‌ అవర్‌‌‌‌ ఆఫర్,  స్టూడెంట్స్​ కోసం మెట్రో స్టూడెంట్‌‌‌‌ పాస్ ల సదుపాయం అమలులో ఉంది.