
- ఆదాయం తక్కువ.. ఖర్చులెక్కువ
- నెలకు రూ. 120 కోట్లపై రాబట్టాలని దృష్టి
- కమర్షియల్ కనెక్షన్ల పెంపునకు అధికారుల చర్యలు
హైదరాబాద్,వెలుగు: గ్రేటర్ సిటీలో నీటి సరఫరా, మురుగునీటి వ్యవస్థను నిర్వహించే మెట్రోవాటర్‌బోర్డు ఆశించిన స్థాయిలో ఆదాయం సమకూర్చుకోలేకపోతోంది. ప్రస్తుతం బోర్డు నెలకు 85 నుంచి 90 కోట్ల రాబడి వస్తుండగా.. ఖర్చులు మాత్రం 200 కోట్ల వరకు ఉన్నాయి. సిబ్బంది జీతాలు, విద్యుత్ఖర్చులు, మెయింటెనెన్స్, ప్రాజెక్టుల నిర్వహణ వంటి వాటికి భారీగా ఖర్చు అవుతుంది. దీంతో బోర్డుకు ఎక్కువ ఆదాయం వచ్చేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశాలపైనే మేనేజింగ్ డైరెక్టర్ అశోక్‌రెడ్డి దృష్టి సారించారు. సిటీలో నెలనెలా నీటి చార్జీల వసూలు 50 నుంచి 60 శాతం మేరకే ఉంటుంది. దీంతో వంద శాతం బిల్లుల వసూలుపైనా ఫోకస్ చేశారు.
కమర్షియల్ కనెక్షన్లే కీలకం
బోర్డుకు కమర్షియల్ కనెక్షన్లు, ఇండస్ట్రియల్ కనెక్షన్ల ద్వారానే అధిక ఆదాయం వస్తుంది. నెలకు 35 నుంచి 45 కోట్ల వరకు వస్తాయి. ప్రస్తుతం వీటి సంఖ్య తక్కువ. సిటీలో 13.80 లక్షల కనెక్షన్లుఉంటే, ఇందులో కేవలం 53 వేలే కమర్షియల్ వి. అక్రమ కనెక్షన్లు మరో నాలుగైదు లక్షలు ఉండొచ్చని అధికారులు అంచనా. సిటీలో హోటళ్లు, రెస్టారెంట్స్ ను పరిశీలిస్తే దాదాపు 50 నుంచి 60వేలకు పైగానే ఉంటాయి.
బల్దియాకు ఆస్తిపన్ను వసూలు కింద 80వేల వరకు వ్యాపార సంస్థలు ఉన్నట్టు తెలుస్తుంది. వాటర్‌బోర్డులో కూడా అదేస్థాయిలో నీటి కనెక్షన్లు ఉండాలి. అపార్ట్మెంట్లకు కూడా లక్షల సంఖ్యలో ఉంటాయి. బోర్డు లెక్కల్లో వేలల్లోనే చూపిస్తుండగా బిల్లు వసూలు సక్రమంగా లేదు. కొందరు కిందిస్థాయి అధికారులు ములాఖత్ అయి కనెక్షన్లసైజులను, కేటగిరీల్లో గోల్మాల్ చేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి.
ఆదాయం పెంచుకునేందుకు ..
వాటర్‌బోర్డు ఆదాయం పెంచుకునేందుకు ప్రత్యేక దృష్టి సారించింది. త్వరలోనే ఇంటింటి సర్వే నిర్వహించాల ని భావిస్తోంది. తద్వారా ఎన్ని కనెక్షన్లు ఉన్నాయనేది స్పష్టం అవుతుంది. అక్రమ కనెక్షన్లు, కేటగిరీలు కూడా బయటపడే చాన్స్ ఉంది. ఇప్పటి వరకూ బిల్లులు చెల్లించని వారి నుంచి వసూలు చేయడం, ఫైన్లు వేసి రాబట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఆస్తిపన్ను కట్టే వారి జాబితా ప్రకారం తనిఖీలు చేస్తే వేల సంఖ్యలో అక్రమ కనెక్షన్లు బయట పడతాయని భావిస్తున్నారు. త్వరలోనే తనిఖీలకు అధికారులు చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.