- రాష్ట్రంలో గణనీయంగా తగ్గిన ఉపాధి పనులు
- గతేడాదితో పోలిస్తే పని దొరికిన కుటుంబాల్లో 17.4% కోత
- 2020-21 తర్వాత అత్యంత కనిష్ట స్థాయికి ఉపాధి కల్పన
- ‘లిబ్టెక్ ఇండియా’ తన తాజా నివేదిక
హైదరాబాద్, వెలుగు: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిధుల కోత, సాంకేతిక కష్టాలు వెంటాడుతున్నాయి. పథకం పేరు మార్పుతో పాటు కేంద్రం తెచ్చిన కఠినమైన నిబంధనలతో కూలీలకు పని దొరకడం కష్టమవుతోంది. 2024–-25 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే.. 2025–-26లో ఉపాధి కల్పన కనిష్టస్థాయికి చేరిందని 'లిబ్టెక్ ఇండియా' తన తాజా నివేదికలో వెల్లడించింది. కేంద్రం కూలీల హాజరుకు సంబంధించి నిబంధనలు కఠినతరం చేస్తూ ఎన్ ఎంఎంఎస్ యాప్, కేవైసీని తీసుకురావడంతో క్షేత్రస్థాయిలో కూలీలకు కష్టాలు మొదలయ్యాయి.
గ్రామీణ ప్రాంతాల్లో పనిస్థలంలో రెండుసార్లు ఫొటోలతో కూడిన హాజరును యాప్‌లో నమోదు చేసేందుకు సిగ్నల్, సర్వర్ డౌన్ సమస్యలు వస్తుండడంతో కూలీలు ఇబ్బందిపడ్తున్నారు. పని చేసినా యాప్‌లో రికార్డు కాకపోవడంతో వేతనాల్లో కోతపడ్తోందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. మరోవైపు ఆధార్ ఆధారిత చెల్లింపుల కోసం కేవైసీ తప్పనిసరి చేశారు. కానీ కూలీల వేలి ముద్రలు పడకపోవడం, బ్యాంకు అకౌంట్లతో ఆధార్ లింక్ కాకపోవడం వంటి కారణాలతో వేలసంఖ్యలో కూలీల పేర్లను మస్టర్ రోల్స్ నుంచి తొలగిస్తున్నారు.
కఠిన నిబంధనల కారణంగా రాష్ట్రంలో సుమారు 4.02 లక్షల మంది కూలీలను తొలగించడం గమనార్హం. అదేవిధంగా ఉపాధిహామీ నుంచి 'వికసిత్ భారత్– గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవిక మిషన్' (వీబీ జీరామ్)కు మారుతున్న తరుణంలో క్షేత్రస్థాయిలో గందరగోళం నెలకొంది. పాత సాఫ్ట్‌వేర్ స్థానంలో కొత్త వ్యవస్థను ప్రవేశపెట్టడం.. మార్గదర్శకాల్లో స్పష్టత లేకపోవడంతో పనుల మంజూరులో జాప్యం జరుగుతోంది. కొత్త స్కీమ్ కింద రిజిస్ట్రేషన్ ప్రక్రియ సంక్లిష్టంగా ఉండటంతో నిరక్షరాస్యులైన కూలీలు ఇబ్బందులు పడుతున్నారు. పాత పథకాన్ని క్రమంగా పక్కనపెడుతూ.. కొత్తది ఇంకా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాకపోవడంతో రెంటికి చెడ్డ రేవడిలా కూలీల పరిస్థితి తయారైంది.
అందని ద్రాక్షగానే 100 రోజుల పని..
రాష్ట్రంలో ఏడాదికి కనీసం 100 రోజుల పని కల్పించాలనే లక్ష్యం నీరుగారుతోంది. 'లిబ్టెక్ ఇండియా' నివేదిక ప్రకారం.. 100 రోజులు పూర్తిచేసుకున్న కుటుంబాల సంఖ్యలో 75.3 శాతం క్షీణత కనిపించింది. రాష్ట్రంలో ఉపాధి కల్పన విషయంలో 2020–-21 ఆర్థిక సంవత్సరం తర్వాత ఇదే అత్యంత కనిష్ట పనితీరు. 100 రోజులు పూర్తిచేసుకున్న కుటుంబాలు, పనిచేసిన కుటుంబాలు, పని దినాలు వంటి కీలక సూచికల ద్వారా స్పష్టమవుతోంది. ఉపాధి పొందిన కుటుంబాలు, కార్మికుల సంఖ్యలో వరుసగా 17.4%, 20.3% గణనీయమైన తగ్గుదల నమోదు కాగా.. మొత్తం కుటుంబాల సంఖ్యలో 1.6% స్వల్ప తగ్గుదల నమోదైంది.
రాష్ట్రంలో ఉపాధి హామీ పనితీరు 2020–-21 తర్వాత అత్యంత కనిష్ట స్థాయికి పడిపోయింది. 2024–25లో 1222.11లక్షలుగా ఉన్న పనిదినాలు, 2025–26 లో కేవలం 726.08 లక్షలకు పరిమితమయ్యాయి. అంటే.. ఉపాధి కల్పనలో 40.6% కోత పడింది. అదే విధంగా రాష్ట్ర సగటు పని దినాలు 45.80 నుంచి32.93కి గణనీయంగా తగ్గాయి. రాష్ట్ర సగటు పనిదినాలు 32.93 కాగా.. జాతీయ సగటు 43.18గా ఉంది. 100 రోజులు పూర్తిచేసుకున్న కుటుంబాల్లో 75.3% భారీ తగ్గుదల కనిపించింది.
100 రోజులు పూర్తిచేసుకున్న కుటుంబాల సంఖ్య 93 వేల నుంచి 23 వేలకు పడిపోయింది. దీని ఫలితంగా 2024-25 ఆర్థిక సంవత్సరంలో 3.5% కుటుంబాలు 100 రోజులు పూర్తిచేసుకోగా.. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఈ సంఖ్య కేవలం 1శాతానికి పడిపోయింది. ఏడాది ప్రారంభంలో పనిదినాల్లో తీవ్రమైన నష్టంతో మొదలై.. నిష్పత్తి, సంఖ్యాపరంగా క్షీణత కొనసాగింది. చివరి మూడు నెలల్లో స్వల్ప మెరుగుదల నమోదైంది. అయితే, మొదటి మూడు త్రైమాసికంలో పనిదినాలు గణనీయంగా తగ్గాయి. మొదటి త్రైమాసికంలో 48.8%, రెండో త్రైమాసికంలో 27.9% , మూడో త్రైమాసికంలో 20.4% తగ్గుదలతో కొనసాగింది. అయితే నాలుగో త్రైమాసికంలో 2.1% స్వల్ప వృద్ధి నమోదైనా.. గత త్రైమాసికాల్లో జరిగిన నష్టాన్ని పూడ్చలేకపోయింది.
83 వేల జాబ్‌కార్డుల రద్దు..
రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ పనిదినాల సంఖ్య తగ్గిపోయింది. 32రూరల్ జిల్లాలకుగాను 28 జిల్లాల్లో 2024–25 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 28 జిల్లాల్లో పని దినాలు (30 నుంచి 57 శాతం మేర) తగ్గాయి. రాష్ట్రవ్యాప్తంగా 83 వేల జాబ్ కార్డులు రద్దు కాగా, 4.02 లక్షల మంది కూలీలను తొలగించారు. దీని ప్రభావం నేరుగా కూలీల ఆదాయంపై పడింది. వేతనాలు పెరిగినప్పటికీ 2025–26 ఆర్థిక సంవత్సరంలో ఉపాధి రోజులు తగ్గడంతో కుటుంబస్థాయి ఆదాయాలు, వేతనాలు గణనీయంగా తగ్గాయి. 2024–25 ఆర్థిక సంవత్సరంలో రూ.9,770గా ఉన్న సగటు గృహ ఆదాయం, 2025–26లో రూ.8,766 కోట్లకు పడిపోయింది. ఇది ఒక కుటుంబానికి సగటున రూ.1,004 నష్టాన్ని కలిగిస్తుంది.
అదే సమయంలో రోజుకు సంపాదించే సగటు వేతనం రూ.213.32 నుంచి రూ.266.19కిపెరిగింది. ఉపాధి కల్పన తగ్గడం, కార్మికులు సంపాదించిన మొత్తం వేతనాలు 2024–25లో రూ2,607.01 కోట్ల నుంచి 2025–26లో రూ.1,932.75 కోట్లకు పడిపోయింది. దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా కూలీలకు రూ.674.26 కోట్ల మేర ఆదాయం నష్టం వాటిల్లింది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో అత్యధిక భాగం ఎస్సీ, ఎస్టీ కూలీల ఆదాయం కోల్పోయారు. రాష్ట్రం ఎస్సీ, ఎస్టీ కార్మికులు 2024–25లో రూ.1,102.14 కోట్లు, 2025–26లో కేవలం రూ.846.21 కోట్లు మాత్రమే సంపాదించగలిగారు. రాష్ట్రంలో మొత్తం రూ.674.26 కోట్ల ఆదాయ నష్టంలో ఎస్సీ, ఎస్టీ కూలీల వాటానే రూ.255.93 కోట్లు (38 శాతం) ఉండటం ఆందోళనకరం..32 జిల్లాల్లోనూ ఇదే ధోరణి కొనసాగుతోంది.

