హైదరాబాద్, వెలుగు: ఎంబీబీఎస్ క్వాలిఫికేషన్‌తో 435 పోస్టుల భర్తీకి మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఇటీవలే నోటిఫికేషన్ ఇచ్చింది. గురువారం రాత్రితో దరఖాస్తుల స్వీకరణ గడువు ముగియగా డాక్టర్ల నుంచి మొత్తం 4,800 అప్లికేషన్లు వచ్చాయని బోర్డు అధికారులు తెలిపారు. గతంలో నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఒక్కో పోస్టుకు 5 దరఖాస్తులు మాత్రమే వచ్చాయని, ఈసారి ఏకంగా ఒక్కో పోస్టుకు 11 అప్లికేషన్లు వచ్చాయని చెప్పారు.
ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన డాక్టర్లు.. ప్రైవేటు ప్రాక్టీస్ చేయడానికి వీల్లేదన్న నిబంధన ఉన్నప్పటికీ, సర్కార్ నౌకరీ చేసేందుకే డాక్టర్లు మొగ్గు చూపుతుండడం గమనార్హం. రాష్ట్రంలో డాక్టర్ల సంఖ్య పెరగడం కూడా ఇందుకు ఓ కారణమని ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. పదేండ్ల కిందట వరకూ ఒక్కో పోస్టుకు ఒక్కో దరఖాస్తు కూడా వచ్చేది కాదని, ఇప్పుడు డాక్టర్ల సంఖ్య పెరగడం ప్రజలకు కలిసొచ్చే అంశమని వారు అభిప్రాయపడుతున్నారు.