ముంబై ఇండియన్స్ నుంచి మరో రెండు ఫ్రాంచైజీలు

ముంబై ఇండియన్స్ నుంచి మరో రెండు ఫ్రాంచైజీలు

ఐపీఎల్లో అత్యంత సక్సెస్ ఫుల్ జట్టు అంటే గుర్తుకు వచ్చేది ముంబై ఇండియన్స్. ఒకటి కాదు..రెండు కాదు..ముంబై ఇండియన్స్ ఏకంగా ఐదు సార్లు ఐపీఎల్ ట్రోఫీలను సొంతం చేసుకుంది. ఐపీఎల్లో విజయవంతమైన జట్టుగా నిలిచిన ముంబై ఇండియన్స్..విదేశీ లీగ్స్లో కూడా పాల్గొనబోతుంది. అదేంటి ముంబై ఇండియన్స్ ఐపీఎల్కే పరిమితం కదా అని అనుకుంటున్నారా..అవును..MI టీమ్ ఐపీఎల్కే పరిమితం. అయితే ముంబై ఇండియన్స్ యాజమాన్యం..యూఏఈ క్రికెట్ లీగ్, సౌతాఫ్రికా క్రికెట్ లీగ్లలో ఫ్రాంచైజీలను కొనుగోలు చేసింది. ఈ రెండు లీగ్లలో ముంబై ఇండియన్స్ టీమ్స్ ఆడబోతున్నాయి.

యూఏఈ క్రికెట్ లీగ్, సౌతాఫ్రికా క్రికెట్ లీగ్  ఫ్రాంచైజీలకు ముంబై ఇండియన్స్ యాజమాన్యం పేర్లు పెట్టింది. ముంబై ఇండియన్స్ బ్రాండ్ను అలాగే ఉంచుతూ వీటి పేర్లను నిర్ణయించింది. యూఏఈలో కొనుగోలు చేసిన ఫ్రాంచైజీకి  ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్ (MI Emirates)గా నామకరణం చేసింది.

అలాగే సౌతాఫ్రికాలో కేప్ టౌన్ ఫ్రాంచైజీని దక్కించుకున్న అంబానీ..కేప్ టౌన్ ఫ్రాంచైజీకి ముంబై ఇండియన్స్ కేప్ టౌన్ (MI Cape Town) అని పేరును పెట్టారు. అంతేకాకుండా ఆయా ఫ్రాంచైజీల ఆటగాళ్లు కూడా ముంబై ఇండియన్స్  బ్లూ, గోల్డ్తో కలిసి జెర్సీనే ధరించనున్నారు. ఈ మేరకు ట్విటర్లో  ముంబై ఇండియన్స్  వెల్లడించింది. 

ముంబై ఇండియన్స్ ఫ్యామిలీలోకి రెండు కొత్త ఫ్రాంచైజీలు రావడం సంతోషంగా ఉందని ముంబై ఇండియన్స్ ఓనర్ నీతా అంబానీ తెలిపారు. మా #Onefamilyకి  సరికొత్త  ఫ్రాంచైజీలు MI ఎమిరేట్స్ & MI కేప్ టౌన్ ను స్వాగతించడం  చాలా సంతోషాన్నిస్తున్నదని ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఈ రెండు ఫ్రాంచైజీలు MI  స్థాయిని మరింత ఉన్నత స్థితికి తీసుకెళ్తాయని ఆశిస్తున్నట్లు చెప్పారు.