MI vs DC: స్టబ్స్ పోరాటం వృథా.. బోణీ కొట్టిన ముంబై ఇండియన్స్

MI vs DC: స్టబ్స్ పోరాటం వృథా.. బోణీ కొట్టిన ముంబై ఇండియన్స్

వరుస ఓటములతో తల్లడిల్లిపోతోన్న ముంబై ఇండియన్స్ జట్టుకు ఊరట లభించింది. ఎట్టకేలకు వారు ఈ సీజన్‌లో తొలి విజయాన్ని అందుకున్నారు. ఆదివారం(ఏప్రిల్ 7) వాంఖడే వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై 29 పరుగుల తేడాతో పాండ్యా సేన విజయం సాధించింది. తొలుత ముంబై 234 పరుగుల భారీ స్కోర్ చేయగా.. ఛేదనలో ఢిల్లీ బ్యాటర్లు 205 పరుగులు చేశారు. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో ముంబైకిది తొలి విజయం. 

వార్నర్ విఫలం.. షా జోరు

235 పరుగుల భారీ ఛేదనలో ఢిల్లీకి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఆసీస్ చిచ్చరపిడుగు డేవిడ్ వార్నర్(10) స్వల్ప స్కోరుకే వెనుదిరిగాడు. ఆ సమయంలో అభిషేక్ పోరెల్(41)తో జత కలిసిన పృథ్వీ షా(66; 40 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లు) స్కోరును ముందుకు నడిపించాడు. వీరిద్దరి భాగస్వామ్యంతో ఢిల్లీ 10 ఓవర్లు ముగిసేసరికి 94 పరుగులు చేసింది. అయినప్పటికీ, లక్ష్యం పెద్దది కావడం, వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ రావడం ఢిల్లీని విజయానికి దూరం చేసింది.

ట్రిస్టన్ స్టబ్స్ ఒంటరి పోరాటం

పృథ్వీ షా ఔటయ్యాక.. స్టబ్స్ ఆ భాధ్యతను తన భజాలపై వేసుకున్నాడు. సొంతగడ్డపై ముంబై బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ బౌండరీల మోత మోగించాడు. మొత్తంగా 25 బంతులు ఎదుర్కొన్న స్టబ్స్ 3 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 71(నాటౌట్) పరుగులు చేశాడు.

రొమారియో షెఫర్డ్ వీరబాదుడు

అంతకుముందు ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 234 పరుగులు చేసింది. రోహిత్ శర్మ(49), ఇషాన్ కిషన్(42), హార్దిక్ పాండ్యా(39), టిమ్ డేవిడ్(45 నాటౌట్), రొమారియో షెఫర్డ్(39 నాటౌట్) పరుగులతో రాణించారు.