MI vs DC: కటిక పేదరికం నుంచి ఐపీఎల్ స్థాయికి.. ఎవరీ రొమారియో షెఫర్డ్?

MI vs DC: కటిక పేదరికం నుంచి ఐపీఎల్ స్థాయికి.. ఎవరీ రొమారియో షెఫర్డ్?

వెస్టిండీస్ క్రికెటర్లు.. ఈ పేరు చెప్పగానే అందరికీ గుర్తొచ్చేది వారి శరీరాకృతి. ఆరడుగుల ఎత్తు, బలీయమైన ధారుడ్యం కలిగిన విండీస్ వీరులంటే ప్రపంచ క్రికెట్‌లో ప్రత్యేక గుర్తింపు. వారి సంధించే బౌన్సర్లు, కొట్టే భారీ సిక్స్‌లు తలచుకుంటేనే ప్రత్యర్థి జట్టు బౌలర్లకు వెన్నులో వణుకు పుట్టాల్సిందే. సదరు బౌలర్ ఎంత పోటుగాడైనా, వారి చేతికి చిక్కారంటే కాళరాత్రే. అలాంటి ఘటనలు గతంలో ఎన్నో చూశాం.. ఇప్పుడు మరోసారి అలాంటి సన్నివేశాన్ని పునరావృతం చేశాడు.. విండీస్ ఆల్‪రౌండర్ రొమారియో షెఫర్డ్‌. 

ఆదివారం(ఏప్రిల్ 7) వాంఖ‌డే వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఈ విండీస్ వీరుడు వీరవిహారం చేశాడు. ప్రపంచ క్రికెట్‌లో ఓ వెలుగు వెలుగుతోన్న సఫారీ పేసర్ అన్రిచ్ నోర్ట్జేకు పీడకలను మిగిల్చాడు. నోర్ట్జే వేసిన ఆఖరి  ఓవర్‌లో 4, 6, 6, 6, 4, 6 బాదాడు. దీంతో ఆ ఓవర్‌లో ఏకంగా 32 పరుగులు వచ్చాయి. అంతేకాదు, ఈ మెరుపు ఇన్నింగ్స్‌ తో షెపర్డ్.. ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్‌ చరిత్రలోనే ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక స్ట్రైక్ రేట్‌తో ఆడిన ఆటగాడిగా షెపర్డ్ రికార్డులకెక్కాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో షెపర్డ్ 390.0 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్‌ చేశాడు. అంతకుముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్‌ కమ్మిన్స్‌(373.3) పేరిట ఉండేది. ఈ ఒక్క ఓవర్ తో అతని పేరు మార్మోగుతోంది. ఎవరీ విధ్వంసకర ఆల్‌రౌండర్ అని నెటిజన్స్ ఆరా తీస్తున్నారు.

కటిక పేదరికం

రొమారియో షెఫర్డ్‌.. 1994లో గయానాలోని బరాకరాలో జన్మించాడు. అతని తల్లిదండ్రులు కటిక పేదవారు. కాళ్లకు చెప్పులు లేకుండానే స్కూలుకు వెళ్ళేవాడినని తాను ఇప్పటికే ఎన్నో ఇంటర్వ్యూల్లో వెల్లడించాడు. తల్లిదండ్రుల ఆర్థిక స్తోమతే అతన్ని క్రికెట్ వైపు అడుగులు వేయించింది. 2019లో వెస్టిండీస్‌ తరఫున అరంగేట్రం చేసిన అతను.. తన బౌలింగ్, హిట్టింగ్ సామర్థ్యంతో ఆనతీకాలంలోనే జట్టులో కీలక సభ్యుడిగా పేరొందాడు. ఇప్పటివరకు అంతర్జాతీయ స్థాయిలో 31 వన్డేలు, 35 టీ20 మ్యాచ్‌లు ఆడాడు.

రూ. 7.75 కోట్లు

తన ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఐపీఎల్‌ ఫ్రాంఛైజీల దృష్టిని ఆకర్షించిన షెఫర్డ్‌ను 2022 వేలంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మేనేజ్మెంట్ ఏకంగా రూ. 7.75 కోట్ల భారీ ధరకు సొంతం చేసుకుంది. ఆ సీజన్‍లో అతనికి ఎక్కువ అవకాశాలు రాకపోవడం, అరకొర వచ్చినా రాణించకపోవడంతో ఎస్‌ఆర్‌హెచ్‌ వదిలేసింది. మరుసటి సీజన్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ పక్షాన చేరిన షెఫర్డ్‌.. ఐపీఎల్‌-2024కు ముందు రూ. 50 లక్షబేస్ ధరకు లక్నో నుంచి ముంబై చెంతకు ట్రేడ్‌ రూపంలో చేరాడు.