ఐపీఎల్‌కే ఓటేసిన న్యూజిలాండ్ క్రికెటర్లు..కివీస్ జట్టుకు కొత్త కెప్టెన్‌

ఐపీఎల్‌కే ఓటేసిన న్యూజిలాండ్ క్రికెటర్లు..కివీస్ జట్టుకు కొత్త కెప్టెన్‌

న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్లందరూ అంతర్జాతీయ క్రికెట్ ను పక్కన పెట్టి ఐపీఎల్ ఆడేందుకు సిద్ధమయ్యారు. ఏప్రిల్ 18 నుంచి పాకిస్థాన్ తో 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ కు న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్లు ఐపీఎల్ లో బిజీగా ఉండడం వలన ద్వితీయ శ్రేణి జట్టును పాకిస్థాన్ కు పంపనున్నారు. పాకిస్థాన్ పర్యటనలో భాగంగా మొత్తం 15 మందితో కూడిన కివీస్ జట్టును న్యూజీలాండ్ క్రికెట్ తాజాగా ప్రకటించింది. ఈ జట్టుకు ఆల్‌రౌండర్ మైకేల్ బ్రేస్‌వెల్ కెప్టెన్ గా ఎంపిక చేశారు.

33 ఏళ్ళ బ్రేస్‌వెల్ గాయం కారణంగా గత ఏడాది మార్చి నుంచి జట్టుకు దూరమయ్యాడు. రెండేళ్ల క్రితమే న్యూజిలాండ్ తరపున అరంగేట్రం చేసిన ఈ ఆల్ రౌండర్ ఈ ఫార్మాట్ లో మొత్తం 16 మ్యాచ్ లాడాడు. బ్యాటర్ టిమ్ రాబిన్సన్, పేసర్ విల్ ఓ'రూర్క్‌ తొలిసారిగా టీ20 జట్టులో చోటు సంపాదించారు. పూర్తి షెడ్యూల్ ప్రకటించాల్సి ఉంది. ప్రస్తుతం న్యూజిలాండ్ స్టార్ ఆటగాళ్లందరూ ఐపీఎల్ లో ఆడుతున్న సంగతి తెలిసిందే. జూన్ 1 న టీ20 వరల్డ్ కప్ ఉన్నప్పటికీ వీరు ఐపీఎల్ కమిట్ మెంట్ లకు కట్టుబడి ఉన్నారు. 

ట్రెంట్ బౌల్ట్, డెవాన్ కాన్వే, లాకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, కేన్ విలియమ్సన్ ఈ సిరీస్ కు దూరమయ్యారు. గాయం కారణంగా డెవాన్ కాన్వే దూరం కాగా..రాజస్థాన్ తరపున ట్రెంట్ బౌల్ట్, చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో రచిన్ రవీంద్ర అదరగొడుతున్నారు. లాకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్, కేన్ విలియమ్సన్ లకు తుది జట్టులో ఇంకా చోటు లభించలేదు.