
న్యూఢిల్లీ: మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల 2024–-25 ఆర్థిక సంవత్సరానికి గాను 96.5 మిలియన్ డాలర్ల (సుమారు రూ.850 కోట్ల) సాలరీ ప్యాకేజీని అందుకున్నారు. ఆయన సీఈఓగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అందుకున్న అత్యధిక సాలరీ ప్యాకేజీ ఇదే. మైక్రోసాఫ్ట్ బోర్డు ప్రకారం, నాదెళ్ల నేతృత్వంలో కంపెనీ, ఏఐ రంగంలో ప్రపంచంలోనే టాప్ పొజిషన్‌లోకి చేరుకుంది.
నాదెళ్ల సాలరీ ప్యాకేజీలో 90శాతం మైక్రోసాఫ్ట్ షేర్ల రూపంలో ఉండగా, బేస్ సాలరీ 2.5 మిలియన్ డాలర్లు. ఆయన 2023–24లో 79.1 మిలియన్ డాలర్లు అందుకున్నారు. 2024–25 ఆర్థిక సంవత్సరానికి గాను కంపెనీ సీఎఫ్ఓ ఏమీ హుడ్ 29.5 మిలియన్ డాలర్లు, కమర్షియల్ హెడ్ జడ్సన్ అల్థోఫ్ 28.2 మిలియన్ డాలర్లు అందుకున్నారు. నాదెళ్ల నేతృత్వంలో క్లౌడ్, ఏఐపై మైక్రోసాఫ్ట్ ఫోకస్ పెంచింది. లింక్డిన్, గిట్‌హబ్, యాక్టివిజన్ బ్లిజార్డ్ వంటి కంపెనీలను కొనుగోలు చేసింది.
ప్రారంభంలో ఓపెన్‌ఏఐలో బిలియన్ డాలర్లను మైక్రోసాఫ్ట్ ఇన్వెస్ట్ చేసింది. చాట్‌జీపీటీ సక్సెస్ అవ్వడంతో కంపెనీ పెట్టిన పెట్టుబడి విలువ10 బిలియన్ డాలర్లకు చేరుకోవడం విశేషం. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ ప్రొడక్ట్‌లలో ఓపెన్‌ఏఐ ఆధారిత ఏఐ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్‌లో జన్మించిన నాదెళ్ల, మంగళూరు యూనివర్సిటీలో ఇంజినీరింగ్, విస్కాన్సిన్ మిల్వాకీలో కంప్యూటర్ సైన్స్ మాస్టర్స్ పూర్తి చేశారు. 1992లో మైక్రోసాఫ్ట్‌లో చేరి, స్టీవ్ బాల్మర్, బిల్‌గేట్స్ తర్వాత మూడో సీఈఓగా 2014లో బాధ్యతలు చేపట్టారు. అజ్యూర్ క్లౌడ్ సర్వీసెస్ విస్తరిస్తుండడంతో మైక్రోసాఫ్ట్ షేర్లు
ఈ ఏడాది 23శాతం పెరిగాయి.