నిన్నటి వరకు రైతులు..నేడు కూలీలు

నిన్నటి వరకు రైతులు..నేడు కూలీలు


బోయినపల్లి, వెలుగు: మిడ్ మానేర్ ప్రాజెక్టులో భూములను పూర్తిగా కోల్పోవడంతో ముంపు గ్రామాల నిర్వాసితులకు ఉపాధి కరువై  బతుకు భారంగా మారింది. ఒకనాడు వారి భూముల్లో కైకిలికి పిలిచినవాళ్లే నేడు ఇతర గ్రామాల్లో కైకిలికి పోతున్నారంటే పరిస్థితి ఎంతగా దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. నిర్వాసిత గ్రామాలైన వరదవెల్లి, కొదురుపాక, నీలోజిపల్లి, రుద్రవరం తదితర గ్రామాలకు చెందిన 400 మంది వరకు ఆటోలు, ట్రాక్టర్లలో సుమారు 20  కి.మీ. దూరంలో ఉన్న కట్కూర్, వల్లంపట్ల, పొత్తూర్, ఇల్లంతకుంట, జవహర్ పేట, గాలిపల్లి  తదితర గ్రామాలకు వ్యవసాయ పనులకు కైకిలికి పోతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మన్వాడ వద్ద 27.5 టీఎంసీల కెపాసిటీతో 2.32 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించేందుకు  2006లో మిడ్ మానేరు ప్రాజెక్టు పనులు ప్రారంభించారు. మిడ్ మానేర్ నిర్మాణంతో బోయినపల్లితో పాటు, వేములవాడ, తంగళ్లపల్లి, ఇల్లంతకుంట మండలంలోని సీఎం కేసీఆర్ అత్తగారి గ్రామమైన కొదురుపాక, వరదవెల్లి, నీలోజిపల్లి, శభాష్ పల్లి, అనుపురం, రుద్రవరం, కోడిముంజ,  చిర్లవంచ, చింతల్ ఠాణా, గుర్రంవానిపల్లి గ్రామాలు పూర్తిగా ఆరెపల్లి, సంకెపల్లి గ్రామాలు పాక్షికంగా ముంపునకు గురవుతాయని 2008–-09లో  గెజిట్ విడుదల చేశారు. ఈ గ్రామాల్లో  11,731  కుటుంబాలు ముంపునకు గురవుతాయని పేర్కొంటూ వీరికి ఆర్అండ్ఆర్ కాలనీలను నిర్మించారు. ఒక్కో కుటుంబానికి 242 చదరపు గజాల ఇంటి స్థలం కేటాయించడంతో పాటు నిర్వాసితుని వృత్తి ఆధారంగా పరిహారం చెల్లించారు. కేటాయించిన స్థలాల్లో లబ్ధిదారులు ఇండ్లు కట్టుకున్నారు. 2019 నవంబర్ లో ప్రాజెక్టు పూర్తయింది. డిసెంబర్ 27  నాటికి ప్రాజెక్టులో 25.14 టీఎంసీల నీటిని నింపారు.  మిడ్ మానేర్ లో నీటిని నింపడంతో  ముంపు గ్రామాల ప్రజలు కొత్తగా నిర్మించిన కాలనీలలోకి వచ్చి నివాసముంటున్నారు. 

అందని రూ. 5 లక్షలు

18 జూన్ 2015న  సీఎం కేసీఆర్ వేములవాడ రాజన్న సాక్షిగా మిడ్ మానేర్ నిర్వాసితుల త్యాగం వెలకట్టలేనిదని, వీరందరికి డబుల్ బెడ్ రూం పథకం కింద రూ. 5.04  లక్షలు ఇస్తామని హామీ ఇచ్చారు. 26  సెప్టెంబర్ 2016 న మిడ్ మానేర్ కట్ట తెగింది. ఆ సమయంలో సీఎం కేసీఆర్ ముంపు గ్రామాల్లో  1 జనవరి 2015 నాటికి 18 ఏండ్లు నిండిన యువతీ యువకులకు రూ. 2 లక్షల ప్యాకేజీ అందిస్తామని ప్రకటించారు. నేటికీ సీఎం హామీలు నెరవేరలేదు. సీఎం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని మిడ్ మానేరు ముంపు గ్రామాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో నిర్వాసితులు ఎన్నో ఆందోళనలు చేశారు. అయినా ప్రయోజనం లేకపోయింది. ఈ నెల 4 న సీఎం కేసీఆర్ జిల్లా పర్యటనకు వస్తుండటంతో నిర్వాసితుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. ఇచ్చిన హామీలను ఇప్పటికైనా నెరవేర్చాలని నిర్వాసితులు కోరుతున్నారు. సరైన ఉపాధి లేక ముంపు గ్రామాల్లో చాలా కుటుంబాలు ఇప్పటికే అప్పుల పాలయ్యాయి. నిర్వాసితులను ఆదుకోవడానికి ప్రతి ముంపు గ్రామంలో కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేయాలనీ నిర్వాసితులు డిమాండ్ చేస్తున్నారు.

హామీలను సీఎం నెరవేర్చాలె

మిడ్ మానేర్ ముంపు గ్రామాల నిర్వాసితులకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలి. జిల్లాకు వస్తున్న సీఎం నిర్వాసితులకు హామీలపై స్పష్టత ఇవ్వాలి. అలాగే ప్రతి నిర్వాసిత గ్రామంలో పరిశ్రమలు స్థాపించి యువతకు ఉపాధి కల్పించాలి. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు ఆందోళనలు చేస్తూనే ఉంటాం. 
- కొండం శ్రీనివాస్ రెడ్డి, బీజేపీ మండల ఉపాధ్యక్షుడు, బోయినపల్లి 

ఏడెకరాలు పోగొట్టుకుని.. కూలీలైనం

మాకున్న 7 ఎకరాలు మిడ్ మానేర్ లో పోయింది. ఒకప్పుడు మేము మా పొలానికి కైకిలికి పిలిచినం. ఇప్పుడు మేమే కైకిలికి పోతున్నం. ఇప్పుడు పంచాయతీల పని ఉందంటే వచ్చినం. రోజుకు రూ. 300  ఇస్తుర్రు. తర్వాత వేరే ఊర్లకు పనికి పోతాం. కష్టంగా ఉంది. సర్కారు మాకు బతుకుదెరువు చూపాలి. 
- కొర్రీ శంకరవ్వ, కొదురుపాక, బోయినపల్లి 

బీడీలు చుట్టి కూతుళ్లను పోషిస్తున్న

మిడ్ మానేర్​లో మాకున్న 30 గుంటల భూమి పోయింది. అప్పులు కూడా చేయ డంతో  8  ఏండ్ల క్రితం నా భర్త శ్రీనివాస్ బతుకుదెరువుకు దుబాయ్ పోయిండు. కానీ మానసికంగా కుంగిపోయిన ఆయన మూడేండ్ల క్రితం గుండెపోటుతో దుబాయ్​లోనే చనిపోయిండు. అప్పట్నించి బీడీలు చుడుతూ ఇద్దరు కూతుళ్లను పోషిస్తున్న. బతుకు కష్టంగా ఉంది. ప్రభుత్వం ఆదుకోవాలె. 
- ఒజ్జెల రేణుక, కొదురుపాక, బోయినపల్లి మండలం