మిడ్ మానేర్​కు జలకళ

మిడ్ మానేర్​కు జలకళ
  •  17 టీఎంసీలకు చేరువలో నీటి నిల్వ 

బోయినిపల్లి, వెలుగు : రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలంలోని శ్రీ రాజరాజేశ్వర ( మిడ్ మానేర్ ) ప్రాజెక్టు జలకళ సంతరించుకున్నది. కొన్ని నెలలుగా ప్రాజెక్టులోని నీటి నిల్వ డెడ్ స్టోరేజీకి చేరుకుంది. ఎగువన వర్షాలు పూర్తి స్థాయిలో కురవకపోవడంతో ప్రాజెక్టుకు వరద రాలేదు. దీంతో ప్రభుత్వం ఎల్లంపల్లి నుంచి నందిమేడారం, గాయత్రీ పంప్ హౌస్ మీదుగా వరద కాల్వ ద్వారా మిడ్ మానేరుకు నీటిని ఎత్తి పోస్తోంది.

 దీంతో ప్రాజెక్టు నిండుకుండలా కనిపిస్తోంది. కొన్ని రోజులుగా ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో వస్తుండడంతో  నీటి నిల్వ క్రమంగా పెరుగుతోంది. సోమవారం సాయంత్రానికి ప్రాజెక్టుకు గాయత్రీ పంప్ హౌస్ నుంచి 12,600 క్యూసెక్కులు, మూల, మానేరు వాగుల ద్వారా 200 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వచ్చింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటినిల్వ సామర్థ్యం 27.54 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 16.46 టీఎంసీలకు చేరుకుంది. ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో వస్తుండడం, నీటి నిల్వ పెరగడంతో అధికారులు ప్యాకేజీ10కి నీటిని విడుదల చేస్తున్నారు.  6,400 క్యూసెక్కులను అన్నపూర్ణ రిజర్వాయర్ కు,  అలాగే ‘మిషన్ భగీరథ’కు 40 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.