సీఎం మాటలన్నీ ఒట్టివాయె!

సీఎం మాటలన్నీ ఒట్టివాయె!
  • మిడ్ మానేరును టూరిజం స్పాట్ గా చేస్తానన్న కేసీఆర్​
  • అధికారులతో పలుమార్లు సమీక్షించిన కేటీఆర్ 
  • రెండేళ్లు కావొస్తున్నా కాగితాలకే పరిమితమైన ప్రతిపాదనలు

రాజన్న సిరిసిల్ల, వెలుగు: ‘సిరిసిల్ల మానేరు బ్యాక్ వాటర్ వద్ద నిర్మించిన కరకట్ట నుంచి రామప్ప గుట్టల మధ్య ఉన్న మిడ్​ మానేరు వరకు గొప్ప రమణీయ ప్రాంతం ఉంది. అనంతగిరి గ్రామం దగ్గర ఉన్న అన్నపూర్ణ ప్రాజెక్ట్ వద్ద 240 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంది. ఇక్కడే  40 ఎకరాల్లో ఐలాండ్ ఉంది. దీనికి రూ.400 కోట్లు మంజూరు చేసి కొండలు, గుట్టల మధ్య ప్రాంతాన్ని టూరిజం స్పాట్ గా డెవలప్ చేస్తా’. అని సీఎం కేసీఆర్ 2021 జూలై 4న సిరిసిల్ల కలెక్టరేట్ ఓపెనింగ్ సందర్భంగా చెప్పిన మాటలు చేతలకు నోచుకోలేదు. ఇప్పటి వరకు ఒక్క పని కూడా ప్రారంభం కాలేదు. సీఎం ప్రకటించిన తర్వాత మినిస్టర్ ​కేటీఆర్​అధికారులతో పలుమార్లు సమావేశమయ్యారు. మంత్రి సూచనలతో 2021లో అప్పటి సిరిసిల్ల కలెక్టర్ కృష్ణ భాస్కర్, అధికారులు రూ.400 కోట్లతో ప్రతిపాదనలు రెడీ చేశారు. సిరిసిల్ల కరకట్ట నుంచి రామప్ప గుట్టల మధ్య లాంచీ నడిపించేందుకు ప్రతిపాదించారు. సంవత్సరం క్రితం ఓ లాంచీని కొని మిడ్ మానేరు కరకట్ట వద్ద ఉంచారు. అయితే ఇప్పటి వరకు లాంచీని ఉపయోగంలోకి తేకపోవడంతో అది మూలన పడింది.

ప్రతిపాదనలు వద్దే ఆగిన పనులు..

మిడ్ మానేరు బ్యాక్ వాటర్ తో సిరిసిల్ల జలకళ సంతరించుకుంది. బ్యాక్ వాటర్ సిరిసిల్ల పంట భూముల్లోకి రాకుండా  రూ.30 కోట్లతో కరకట్ట నిర్మించారు. కరకట్ట నుంచి 3 కిలో మీటర్ల దూరంలో గుట్టలు ఉన్నాయి. గుట్టల వరకు కరకట్టపై పార్క్, సుందరీకరణ, కట్ట పొడువునా ఫౌంటెన్లు, బతుకమ్మ ఘాట్, వాకింగ్, సైక్లింగ్ ట్రాక్ కోసం అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అయితే అవి కాగితాలకే పరిమితమైనాయి. అలాగే మిడ్ మానేరు నుంచి వాటర్ లిఫ్ట్ చేసి గంభీరావుపేట మండలం నర్మాల అప్పర్ మానేరులో ఎత్తిపోసే పనులను రెండు నెలల్లో పూర్తి చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. కానీ ఏండ్లుగా పనులు కొనసాగుతూనే ఉన్నాయి. నర్మాల ప్రాజెక్ట్ నింపకపోవడంతో ఎకరం భూమి కూడా తడవలేదు.

ఫోర్ లైన్ రోడ్ శాంక్షన్ కాలేదు..

జిల్లాలోని సర్థాపూర్ మార్కెట్ యార్డ్ నుంచి సిరిసిల్ల వరకు డివైడర్ ఉండే ఫోర్ లైన్ ను శాంక్షన్ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్​ చెప్పారు. కానీ ఇప్పటి వరకు ఆ ఊసే లేదు. మరోవైపు సిరిసిల్లను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నామని పదేపదే చెప్పే మంత్రి కేటీఆర్ కూడా సిరిసిల్లను మర్చిపోయారని పట్టణవాసులు ఆరోపిస్తున్నారు. పర్యాటక రంగంగా అభివృద్ధి చెందేందుకు అవసరమైన అన్ని హంగులు సిరిసిల్లకు ఉన్నాయని, మినిస్టర్​ కేటీఆర్ చొరవ తీసుకుంటే జిల్లాను అన్ని రకాలుగా అభివృద్ధి చేయొచ్చని జిల్లావాసులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.