ఖర్చులు తడిసి మోపెడు..అల్లాడిపోతున్న మధ్యతరగతి ప్రజలు

ఖర్చులు తడిసి మోపెడు..అల్లాడిపోతున్న మధ్యతరగతి ప్రజలు
  • నిత్యవసరాల ధరల పెరుగుదలతో అల్లాడిపోతున్న మధ్యతరగతి ప్రజలు
  • స్కూల్ ఫీజులు, ఇంటి రెంట్లు, హాస్పిటల్‌‌ ఖర్చులు అన్నీ ఎక్కువే 
  • ఖర్చుకి తగ్గట్లు పెరగని ఆదాయం.. నెల గడవకముందే అప్పులు చేయాల్సిన పరిస్థితి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పెరిగిన ధరలతో ప్రజలు బెంబేలెత్తున్నారు. సగటు మధ్యతరగతి కుటుంబ ఖర్చులు తడిసి మోపెడు అవుతున్నాయి. వచ్చే ఆదాయం సంగతి పక్కన పెడితే నెల తిరిగే సరికి అప్పులతో కుటుంబాన్ని నెట్టుకురావాల్సి వస్తుంది. స్కూల్ ఫీజుల దగ్గర నుంచి నిత్యవసరాలు, ఇంటి రెంట్లు, హాస్పిటల్‌‌ ఖర్చులు ఇలా ప్రతిదీ పిరం అయ్యాయి. దీంతో నెల జీతం సరిపోవడం లేదు. ఖర్చుకి తగినట్లు రాబడి పెరగకపోవడమే ఇందుకు కారణం అని విశ్లేషకులు చెబుతున్నారు. రాష్ట్ర సర్కార్‌‌‌‌ అంచనా ప్రకారం రాష్ట్రంలోని ప్రధాన పట్టణాల్లో నివసిస్తున్న మధ్య తరగతి కుటుంబానికి యావరేజ్‌‌గా నెల జీతం రూ.15 వేలలోపే ఉంది. రూరల్ ఏరియాలో ఇది మరింత తక్కువగా ఉన్నట్లు ఆఫీసర్లు చెబుతున్నారు. కుటుంబ ఖర్చులకు ఇది ఏ మాత్రం సరిపోవడం లేదని అంటున్నారు. ఇన్‌‌ఫ్లేషన్ (ధరల పెరుగుదల) కారణంగానే ఇంటి బడ్జెట్​ పెరిగినట్టు తాజా సర్వేలు వెల్లడిస్తున్నాయి. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలే ఈ పరిస్థితికి కారణమని సర్వేలో పాల్గొన్నవారిలో 92 శాతం కుటుంబాలు పేర్కొన్నాయి. గత మూడు నెలల్లో తమ సగటు నెలవారీ ఖర్చులు భారీగా పెరిగాయని తెలిపారు. పండుగల సీజన్లలో ఇది రెట్టింపు అవుతుందని అంటున్నారు. ఒకవైపు రాష్ట్ర తలసరి ఆదాయం   పెరిగిందని ప్రభుత్వం చెబుతున్నా.. గ్రౌండ్‌‌ లెవల్‌‌లో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. 

గుదిబండగా స్కూల్​ ఫీజులు..

పేద, మధ్య తరగతి కుటుంబాలకు స్కూల్ ఫీజులు గుదిబండగా మారాయి. ప్లే స్కూల్ నుంచి ఇంటర్మీడియేట్ వరకు స్కూల్, కాలేజీని బట్టి 30 శాతం నుంచి 40 శాతం ఫీజులు పెంచారు. ఫీజులు, పుస్తకాలు, ఇతరత్రా ఖర్చులు కలిపి ఓ మాదిరి స్కూల్లో ఏడాదికి రూ.60 వేలు, కార్పొరేట్‌‌ స్కూలైతే రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఫీజు ఉంది. నిత్యవసరాలు, పెట్రోల్, డీజిల్‌‌ రేట్లను కారణంగా చూపుతూ స్కూల్‌‌ ఫీజులను పెంచారు. పుస్తకాలు, యూనిఫామ్‌‌లకు అయ్యే ఖర్చులు అదనం కానున్నాయి. ఇంట్లో భార్యభర్తలు పనిచేస్తున్నా.. మే, జూన్, జులై నెలల సంపాదన మొత్తం పూర్తిగా పిల్లల కోసమే ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. 

నిత్యవసరాలు ఆకాశానికి..హెల్త్​కూ మస్త్​ పైసలు

పప్పులు, ఉప్పుల నుంచి వంట నూనెలు, కూరగాయల దాకా అన్ని రేట్లు మండిపోతున్నాయి. టమాటాలు కిలో రూ.150 నుంచి రూ.200 దాకా పెరిగాయి. ఇతర కూరగాయల ధరలు రూ.50 నుంచి రూ.100 వరకు ఉన్నాయి. నాన్‌‌ వెజ్ ధరలు కూడా పెరిగిపోయాయి. గతేడాది కంది పప్పు కిలో రూ.90 ఉంటే ఇప్పుడు రూ.125 నుంచి రూ.130 ఉంది. పెసర పప్పు, మినపప్పు కూడా కిలోకు రూ.20 నుంచి రూ.30 దాకా పెరిగింది. ఇంట్లో అవసరమైన ప్రతి నిత్యావసర వస్తువు ధర ఏడాదిలోనే 15 శాతం నుంచి 25 శాతం మేర పెరిగాయి. ఇంట్లో నెల అవసరాలకు యావరేజ్‌‌గా రూ.6 వేల నుంచి రూ.8 వేలు ఖర్చు అవుతున్నాయి. నిత్యావసరాల ధరలు పెరగడంతో దాని ఎఫెక్ట్ ఇంటి అద్దెల మీద కూడా పడుతోంది. పట్టణ ప్రాంతాల్లో సింగిల్ బెడ్రూమ్‌‌ ఇంటికి నెలకు రూ.5 వేల నుంచి 7 వేలు ఉండగా.. అదే హైదరాబాద్‌‌లో ఏరియాను బట్టి అంతకంటే ఎక్కువే ఉంది. వీటికి అదనంగా కరెంట్ బిల్లులు కూడా ఉన్నాయి. అనారోగ్య సమస్యలు కూడా పెద్ద మొత్తంలోనే ప్రజల జేబులకు చిల్లులు పెడుతున్నాయి. కరోనా తర్వాత హార్ట్ అటాక్‌‌, ఇతర అనారోగ్య సమస్యలు పెరిగిపోయాయి. ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా.. హాస్పిటల్‌‌కి వెళ్లి, ఓపీ చూపించుకుంటే రూ.300 ఖర్చు అవుతుంది. టెస్టులు, మెడిసిన్స్​కు అదనంగా పెట్టాల్సి వస్తుంది. 

అప్పులవుతుంటే తలసరి ఆదాయం ఎలా పెరుగుతుంది?

రాష్ట్ర తలసరి ఆదాయం రూ.3.08 లక్షలు అని రాష్ట్ర సర్కార్ తన నివేదికల్లో పేర్కొంది. అయితే వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. సగటున నెలకు ఒకరికి వస్తున్న ఆదాయం రూ.25 వేలు అని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. అంత మొత్తంలో ఆదాయం వస్తే అప్పులు ఎందుకు చేస్తామని మధ్య తరగతి కుటుంబాలు ప్రశ్నిస్తున్నాయి. ఖర్చులు పెరగడంతో వచ్చే జీతం సరిపోక, నెలాఖరు నాటికి అప్పులపైనే ఆధారపడాల్సి వస్తుందని అంటున్నారు. కొంతమంది క్రెడిట్ కార్డులు వాడుతూ రొటేట్ చేస్తున్నారు. వస్తున్న జీతానికి అదనంగా 50 శాతం అప్పులు చేసేలా ఖర్చులు పెరిగాయని వాపోతున్నారు.