అమ్మపాడే జోలపాటే.. ఆరోగ్యానికి తొలిమెట్టు

అమ్మపాడే జోలపాటే..  ఆరోగ్యానికి తొలిమెట్టు
  • నూనెతో మాలిష్.. జోలపాడుతూ  ఊయల ఉపితే పిల్లల్లో చురుకైన మెదడు
  • ఖరీదైన ట్రీట్‌‌మెంట్ల కంటే ఇంట్లో చిట్కాలే చిన్నారుల ఎదుగుదలకు బెస్ట్
  • చైల్డ్​ కేర్‌‌‌‌లో పాత పద్ధతులే భేష్.. ఇంటర్నేషనల్ స్టడీలో వెల్లడి
  • తెలంగాణ సహా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో అధ్యయనం

హైదరాబాద్, వెలుగు: అప్పుడే పుట్టిన  పసికందుకు  నువ్వుల నూనె  పట్టించి, గట్టిగా మర్దన చేసి తలంటుపోస్తుంటే ‘అయ్యయ్యో..’ అనుకుంటాం. చిన్నారులను ఉయ్యాలలో వేసి ఊపుతూ ఉండాలని, చందమామను చూపిస్తూ గోరుముద్దలు తినిపించాలని, ఏడాది వయసు వచ్చేదాకా తల్లి పక్కనే పడుకోబెట్టుకోవాలని పెద్దలు చెప్తుంటే చాదస్తం అనుకుంటాం. కానీ పిల్లల సంరక్షణలో అమ్మమ్మల కాలం నుంచి అనాదిగా వస్తున్న పాత పద్ధతులే నూటికి నూరుపాళ్లు కరెక్ట్ అని ఓ ఇంటర్నేషనల్ స్టడీ తేల్చింది. 

నువ్వుల నూనెతో మాలిష్ చేయడం, ఊయల ఉపుతూ జోల పాడడం లాంటి చర్యలు పిల్లల మెదడు ఎదుగుదలకు, శారీరక వికాసానికి  టానిక్‌‌లా పనిచేస్తాయని ‘బ్రిటిష్​ మెడికల్​ జర్నల్​(జీఎంజే) పీడియాట్రిక్స్ ఓపెన్’  స్పష్టంచేసింది. 

 మేరకు తన జర్నల్‌‌లో ఈ స్టడీ రిపోర్ట్‌‌ను పబ్లిష్​ చేసింది. దేశంలో ప్రతి ఎనిమిది మంది పిల్లల్లో ఒకరి మెదడు ఎదుగుదల సరిగ్గా లేదని ఆందోళన చెందుతున్న సమయంలో ఈ స్టడీ కొత్త ఆశలు రేకెత్తుస్తున్నది. బిడ్డ పుట్టిన మొదటి వెయ్యి రోజులు వాళ్ల ఎదుగుదలకు మన పాత పద్ధతులే అద్భుతంగా పనిచేస్తాయని ఈ రీసెర్చ్ స్పష్టం చేసింది.

మన రాష్ట్ర పద్ధతులు కూడా..

ఈ స్టడీలో తెలంగాణ నుంచి 11 మంది పాల్గొన్నారు. నువ్వుల నూనెతో మాలిష్ చేయడం, సున్నిపిండితో నలుగు పెట్టడం, ఉయ్యాలలో లాలిపాటలతో నిద్రపుచ్చడంలాంటివి  మన దగ్గర ఎక్కువగా ఉన్నాయని, ఇవే పిల్లలను ఆరోగ్యంగా, చురుగ్గా ఉంచుతున్నాయని రీసెర్చర్లు తేల్చారు. స్టడీ ప్రకారం...  0  నుంచి 3 నెలలప్పుడు నూనెలతో మాలిష్ చేసి, కళ్లలోకి చూస్తూ మాట్లాడాలి. 

4 నుంచి 6 నెలలప్పుడు బోర్లా పడుకోబెట్టి, పాటలు పాడుతూ ఆడించాలి. 7 నుంచి 9 నెలలప్పుడు చేతి వేళ్లతో మెత్తటి ఆహారం తినిపిస్తూ, దాగుడుమూతలు ఆడాలి. 10 నుంచి12 నెలలప్పుడు పాకడానికి, నిలబడటానికి సాయం చేస్తూ, ఇంట్లో వస్తువులతో ఆడుకోనివ్వాలి. ఈ సింపుల్ పనులే పిల్లల ఎదుగుదలకు గట్టి పునాది 
వేస్తాయని స్టడీ తేల్చింది.

మాలిష్​.. జోలపాట వెనుక సైన్స్​ ఇదీ..

నూనెతో మాలిష్​ చేయడం, నలుగు పెట్టడం, ఊయలలో వేసి ఊపడం, జోల పాడడం, బోర్లా పడుకోబెట్టడం, చేతితో తినిపించడం వెనుక ఉన్న సైన్స్​పై పరిశోధకులు స్టడీ చేశారు. ఆ తర్వాత.. సైంటిస్టులు చెప్పే ‘ఎర్లీ ఇంటర్వెన్షన్ (ఈఐ)’ పద్ధతులతో మన సంప్రదాయ పద్ధతులను పోల్చి చూశారు. పిల్లల మెదడు షార్ప్​గా పనిచేయాలంటే వాళ్లలో తాకడం (టచ్), వినడం (సౌండ్), చూడడం (సైట్) లాంటి సెన్సెరీస్​ యాక్టివ్ గా ఉండాలి. 

మన నూనె మాలిష్ ‘టచ్ థెరపీ’కి, అమ్మ పాడే జోలపాట ‘ఆడిటరీ స్టిమ్యులేషన్’కు, బోర్లా పడుకోబెట్టడం ‘గ్రాస్ మోటార్ స్కిల్స్’కు, దాగుడుమూతల ఆట ‘కాగ్నిటివ్ డెవలప్‌‌మెంట్‌‌’కు పర్ఫెక్ట్‌‌గా సరిపోయిందని సైంటిఫిక్‌‌గా నిర్ధారించారు.  ఈ స్టడీ కోసం రీసెర్చర్లు తెలంగాణ, కర్నాటక, రాజస్తాన్, యూపీ, కేరళ, గుజరాత్, బెంగాల్‌‌ రాష్ట్రాలకు చెందిన 121 మంది తల్లులు, అమ్మమ్మలు, నానమ్మలతో మాట్లాడారు. పిల్లల సంరక్షణకు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు.

పాత పద్ధతులు బెటరే.. కానీ డాక్టర్ మాటే ఫైనల్

మొత్తం మీద మన అమ్మమ్మల పెంపకం మూఢనమ్మకం కాదు, దాని వెనుక పక్కా సైన్స్ ఉందని ఈ స్టడీ తేల్చింది. పైసా ఖర్చు లేకుండా...  ప్రేమతో చేసే మన పాత పద్ధతులే ఖరీదైన థెరపీలతో సమానమని గుర్తించింది. 

అయితే.. ఈ పద్ధతులు పిల్లల సాధారణ ఎదుగుదలకు పనిచేస్తాయని, కానీ ఏదైనా సీరియస్ ఆరోగ్య సమస్య ఉన్నా, ఎదుగుదల సరిగ్గా లేకపోయినా వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాల్సిందేనని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మన సంప్రదాయ జ్ఞానానికి, ఆధునిక వైద్యాన్ని జోడిస్తేనే పిల్లల భవిష్యత్తుకు తిరుగుండదని భరోసా ఇస్తున్నారు.