భారతదేశం ప్రస్తుతం అమెరికా, చైనా తర్వాత ప్రపంచంలో మూడో అతిపెద్ద వైమానిక మార్కెట్‌గా ఎదిగింది. 2023–-24 ఆర్థిక సంవత్సరంలో భారతీయ విమానాలు 37.6 కోట్ల ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేశాయి. గత దశాబ్దంలో ఈ రంగం సగటున 16 శాతం వార్షికవృద్ధి రేటు సాధించింది. 2014లో దేశంలో 74 విమానాశ్రయాలు మాత్రమే ఉండగా 2024 నాటికి వాటిసంఖ్య 157కి పెరిగింది. ప్రభుత్వం 2047 నాటికి ఈ సంఖ్యను 350–-400 వరకు పెంచే లక్ష్యంతో ఉంది.
ఇదే సమయంలో, దేశీయ వైమానిక ప్రయాణికుల సంఖ్య కూడా రెండింతలకు పైగా పెరిగింది. దీనికి ప్రధాన కారణాలు ప్రజల ఆదాయాల పెరుగుదల, తక్కువ ఖర్చుతో విమాన ప్రయాణాలు అందుబాటు కావడం. ప్రభుత్వం తీసుకొచ్చిన పలు విధానాలు కూడా ఈ అభివృద్ధికి తోడ్పడ్డాయి. వాటిలో ముఖ్యమైనది ‘ఉడే దేశ్ కా ఆమ్ నగరిక్ (ఉడాన్)’ పథకం.
ఇది ప్రాంతీయ అనుసంధానం పెంచడమే లక్ష్యంగా చిన్న పట్టణాలు, దూర ప్రాంతాలను ప్రధాన నగరాలతో కలిపే దిశగా ముందడుగు వేసింది. ఈ చర్యలు కేవలం విమాన ప్రయాణ సౌకర్యాలకే కాకుండా, ఆర్థికాభివృద్ధి, ఉపాధి సృష్టి, సామాజిక సమగ్రతలకు కూడా దోహదపడ్డాయి. దీంతో భారతదేశ అభివృద్ధిలో విమానయాన రంగం ఒక కీలక శక్తిగా నిలిచింది.
భారత ప్రభుత్వం సుస్థిర అభివృద్ధితోపాటు పర్యావరణ బాధ్యతపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టింది. దీని స్పష్టమైన ఉదాహరణగా ఢిల్లీ, ముంబై విమానాశ్రయాలు నిలుస్తాయి. ఈ రెండు విమానాశ్రయాలు ప్రపంచస్థాయి లెవల్ 4+ కార్బన్ అక్రిడిటేషన్ సర్టిఫికెట్‌ను పొందాయి. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కొత్త గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాల అభివృద్ధిలో పర్యావరణహిత దృక్పథాన్ని ప్రోత్సహిస్తోంది.
రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి, ఈ కొత్త విమానాశ్రయాల రూపకల్పనలోనే కార్బన్ న్యూట్రాలిటీ, నెట్ జీరో ఎమిషన్స్ సాధనకు ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రిత్వశాఖ సూచిస్తోంది. 2024 జులై 25 నాటికి, 2014 తర్వాత దేశవ్యాప్తంగా 12 గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాలు నిర్మితమై కార్యకలాపాలు ప్రారంభించాయి. అలాగే, భారత విమానాశ్రయ అధికారం 2014 నుంచి ఇప్పటివరకు 48 విమానాశ్రయాలు/ఎయిర్‌స్ట్రిప్‌లను నిర్మించింది.
ప్రభుత్వం తీసుకున్న ఈ సమన్వయ కృషి ఫలితంగా, ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు విమానాశ్రయాలు అంతర్జాతీయ స్థాయిలో ఎయిర్‌పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ నుంచి లెవల్ 4+ లేదా అంతకంటే ఉన్నత స్థాయి కార్బన్ అక్రిడిటేషన్ పొందాయి. ఈ గుర్తింపు, ఈ విమానాశ్రయాలు కార్బన్ ఉద్గారాల తగ్గింపు, పునరుత్పాదక శక్తి వినియోగం, పర్యావరణ సుస్థిరతను తమ కార్యకలాపాల మూల సూత్రాలుగా స్వీకరించినట్లు సూచిస్తుంది.
కార్బన్ మార్కెట్
ప్రతి పరిశ్రమ ఉత్పత్తి చేసే సమయంలో వాతావరణంలో కార్బన్‌డైఆక్సైడ్ విడుదల చేస్తుంది. ఈ ఉద్గారాలపై ధర విధించడం ద్వారా వాటిని నియంత్రించడం కార్బన్ మార్కెట్ ప్రధాన ఉద్దేశం. ఒక సంస్థ తన ఉద్గారాలను తగ్గిస్తే, అది కార్బన్ క్రెడిట్‌లు సంపాదిస్తుంది. ఉద్గారాలు ఎక్కువగా ఉన్న సంస్థలు ఈ క్రెడిట్‌లను కొనుగోలు చేయాలి. దీని ఫలితంగా మార్కెట్ విధానాల ద్వారా పర్యావరణ నియంత్రణ సాధ్యమవుతుంది. దీన్నే ‘కార్బన్ ప్రైసింగ్ మెకానిజం’ అంటారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 80కి పైగా దేశాలు కార్బన్ మార్కెట్ విధానాలను అమలు చేస్తున్నాయి. వరల్డ్ బ్యాంక్ ప్రకారం 2024 నాటికి గ్లోబల్ కార్బన్ ట్రేడింగ్ విలువ 100 బిలియన్ డాలర్లకు చేరుకుంది.
రెండు దశల్లో భారత్ కార్బన్ మార్కెట్
భారత్ కార్బన్ మార్కెట్‌ను రెండుదశల్లో అమలు చేస్తోంది. మొదటిది,. పెద్ద పరిశ్రమలు, విద్యుత్ ఉత్పత్తి, ఉక్కు, సిమెంట్, రసాయన రంగాలు తప్పనిసరిగా ఇందులో భాగం కావాలి. వీటిపై ఉద్గార పరిమితులు విధించి, వాటి ఆధారంగా ట్రేడింగ్ జరుగుతుంది. రెండోది.. చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, వ్యవసాయం, అటవీ, సేవారంగాలు స్వచ్ఛందంగా పాల్గొనవచ్చు.
ఇవి కార్బన్ క్రెడిట్‌లు ఉత్పత్తి చేసి గ్లోబల్ మార్కెట్లో అమ్ముకునే అవకాశం ఉంది. ఈ వ్యవస్థను బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ, గ్రిడ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా సమన్వయం చేస్తాయి. విమానాల ద్వారా వెలువడే ఈ ఉద్గారాలు పర్యావరణంపై ప్రభావం చూపుతాయి. ఇవి కేవలం గాలి కాలుష్యానికే కాకుండా గ్లోబల్ వార్మింగ్, వాతావరణ మార్పులకు ప్రధాన కారణాలుగా నిలుస్తాయి.
విమానాలు ఎగురుతున్నప్పుడు విడుదలయ్యే కార్బన్ డైఆక్సైడ్ నైట్రోజన్ ఆక్సైడ్లు వాతావరణంలో వేడి నిల్వను పెంచుతాయి. అలాగే, వాటి ఇంజిన్ల నుంచి వెలువడే ఆవిరి కారణంగా ఏర్పడే కంట్రెయిల్స్ ఆకాశంలో కనిపించే తెల్లని పొగరేఖలు. వాతావరణంలో వేడి నిల్వను మరింతగా పెంచి క్లైమేట్ చేంజ్‌ను తీవ్రతరం చేస్తాయి. దీని ఫలితంగా, స్థానిక గాలి నాణ్యత దెబ్బతింటుంది, ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. దీర్ఘకాలంలో పర్యావరణ సమతుల్యత దెబ్బతినే ప్రమాదం ఉంటుంది.
గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలను అరికట్టాలి
ప్రైవేట్ జెట్‌లు 2023 లో 19.5 మిలియన్ టన్నుల వరకు గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలను ఉత్పత్తి చేశాయి. ఇది దశాబ్దంతో పోల్చినప్పుడు 25 శాతం అధికంగా ఉంది. ఒక సాధారణ ప్రైవేట్ జెట్ ప్రతి సంవత్సరం 177 ప్యాసింజర్ కార్లు లేదా తొమ్మిది హెవీ-డ్యూటీ హైవే ట్రక్కుల కంటే ఎక్కువ గ్రీన్‌హౌస్ వాయువులను విడుదల చేస్తుంది. వీటిని అరికట్టే కీలకచర్యలు తీసుకోకపోతే, అంతర్జాతీయ వైమానిక రవాణా నుంచి ఉద్గారాలు 2050 నాటికి రెండింతలు లేదా మూడింతలు పెరిగి, 1,800 మిలియన్ టన్నులు వరకు చేరవచ్చని క్లైమేట్ యాక్షన్ ట్రాకర్ (2024) నివేదిక అంచనా వేస్తోంది.
ప్రైవేట్ జెట్ ప్రయాణాలపై లేదా గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలపై పన్ను విధించడం ద్వారా విమానయాన రంగంలో డీకార్బనైజేషన్ (కార్బన్ తగ్గింపు) కార్యక్రమాలకు గణనీయమైన ఆదాయం సమకూర్చుకోవచ్చు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు కరువుల నుంచి హీట్ వేవ్‌ల వరకు తీవ్రమైన వాతావరణ సంఘటనల సంక్షోభానికి దారితీశాయి. ఇది ఆహార అభద్రత, వన్యప్రాణుల ఆవాస నష్టం, అదృశ్యమయ్యే హిమానీనదాలు, సముద్ర మట్టాలు పెరగడం, అనేక ఇతర ప్రభావాలకు దారితీసింది. వాతావరణ మార్పుల ప్రభావం రోజురోజుకీ పెరుగుతోంది.
ఈ లోటును భర్తీ చేయడానికి లగ్జరీ ప్రయాణాలపై ప్రత్యేక పన్ను విధించడం ఒక మార్గం. అధిక ఉద్గారాలకు కారణమయ్యే వర్గం బాధ్యత వహించడమే కాకుండా, ఈ పన్ను ద్వారా వచ్చిన ఆదాయంతో పేద దేశాలకు వాతావరణ మార్పుల ప్రభావాన్ని ఎదుర్కొనే మౌలిక సదుపాయాలు, పర్యావరణ సంరక్షణ, విపత్తు సహాయ కార్యక్రమాలకు మద్దతు ఇవ్వవచ్చు.
ప్రైవేట్ జెట్ల కాలుష్యం
సాధారణ వాణిజ్య విమానాలతో పోలిస్తే ప్రైవేటు విమానయానం అధిక మొత్తంలో ఇంధనాన్ని వినియోగిస్తాయి. ప్రైవేటు జెట్ల ద్వారా అధిక మొత్తంలో కార్బన్‌డైఆక్సైడ్ విడుదలవుతుంది. ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆన్ క్లీన్ ట్రాన్స్‌పోర్టేషన్ (ఐసిసిటి) అధ్యయనం ప్రకారం భూమండలంలో వేడిని పెంచే గ్రీన్ హౌస్ వాయువులు ప్రపంచంలోని 55 శాతంలో కేవలం అమెరికా నుంచి మూడింట రెండు వంతులు ( దాదాపు 65%) అమెరికా విమానాశ్రయాల ప్రైవేట్ జెట్ విమానాల నుంచి వస్తున్నట్లుగా తెలియజేయడమైనది.
అమెరికా తరువాత ప్రైవేట్ జెట్ ఎయిర్వేస్లో యూరప్ రెండో స్థానంలో ఉంది. ప్రైవేట్ జెట్ ఇంధన వినియోగం, ఉద్గారాలపరంగా 20 అతిపెద్ద విమానాశ్రయాలలో 18 యునైటెడ్ స్టేట్స్ లోనే ఉన్నాయి. ప్రైవేట్ జెట్‌ల ద్వారా అధికంగా కార్బన్‌డైఆక్సైడ్ విడుదల చేస్తున్న దేశాలలో యునైటెడ్ కింగ్‌డమ్ (525.1 వేల టన్నులు), ఫ్రాన్స్ (464.6 వేల టన్నులు), కెనడా (361.4 వేల టన్నులు) ప్రధానంగా నిలిచాయి. మొత్తంగా ఈ అగ్ర 10 దేశాలు కలిపి ప్రపంచ ప్రైవేట్ జెట్ ఉద్గారాల్లో 70.7% వాటాను కలిగి ఉన్నాయని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి.
- చిట్టెడి కృష్ణారెడ్డి, అసోసియేట్ ప్రొఫెసర్, హెచ్‌సీయూ
