5 విమానాలకు బాంబు బెదిరింపులు..సెక్యూరిటీ అలర్ట్

5 విమానాలకు బాంబు బెదిరింపులు..సెక్యూరిటీ అలర్ట్
  • తనిఖీలు చేపట్టిన భద్రతా సిబ్బంది  

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ ఘటన జరిగిన నేపథ్యంలో తాజాగా ఎయిరిండియా, ఇండిగో విమానాలకు బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది. బుధవారం వారణాసికి వెళ్తున్న ఎయిరిండియా విమానంలో బాంబు ఉందంటూ బెదిరింపులు వచ్చాయని ఎయిరిండియా సంస్థ వెల్లడించింది. వెంటనే తాము బాంబ్ థ్రెట్​ అసెస్ మెంట్ కమిటీని అలర్ట్ చేశామని తెలిపింది. 

వారణాసిలో విమానం ల్యాండ్ అవగానే ప్యాసింజర్లను దింపామని, విమానాన్ని భద్రతా సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారని పేర్కొంది. తనిఖీలు పూర్తయి, అనుమతి వచ్చిన తర్వాత తిరిగి ఆ విమానాన్ని నడుపుతామని చెప్పింది. మరోవైపు ఇండిగో కంపెనీ విమానాల్లోనూ బాంబులు ఉన్నాయంటూ బుధవారం ఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్, తిరువనంతపురం ఎయిర్ పోర్టులకు బెదిరింపులు వచ్చాయి. 

దీంతో ఆయా విమానాల్లో సెక్యూరిటీ చెకింగ్స్ చేపట్టినట్టు ఆ సంస్థ వెల్లడించింది. అయితే, ఇప్పటివరకూ విమానాలకు బాంబు బెదిరింపులు ఈ–మెయిల్స్ ద్వారా వచ్చేవని.. ఇప్పుడు అలా కాకుండా డిజిటల్ మెసేజ్ ల రూపంలో వచ్చాయని ఎయిరిండియా వర్గాలు తెలిపాయి.