కేసీఆర్‌వి ఏకపక్ష నిర్ణయాలు..హైకోర్టులో కౌంటర్‌‌ దాఖలు చేసిన ప్రభుత్వం

కేసీఆర్‌వి ఏకపక్ష నిర్ణయాలు..హైకోర్టులో కౌంటర్‌‌ దాఖలు చేసిన ప్రభుత్వం
  • కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చడానికి కాళేశ్వరం అంచనా విలువ పెంపు
  • అక్రమాలను జస్టిస్‌ ఘోష్‌ కమిషన్‌ నిర్ధారించింది
  • హైకోర్టులో కౌంటర్‌‌ దాఖలు చేసిన రాష్ట్ర సర్కారు
  • సీబీఐ దర్యాప్తు అనంతరం నేరం రుజువు అవుతుంది 
  • కేసీఆర్‌ పిటిషన్‌ను కొట్టివేయాలని విజ్ఞప్తి

హైదరాబాద్, వెలుగు:కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల స్థలం ఎంపిక, నిర్మాణం, డిజైన్‌ ఖరారు, నిర్వహణలో 
నాటి సీఎం కేసీఆర్​ ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారని హైకోర్టుకు రాష్ట్ర సర్కారు తెలిపింది. ప్రాజెక్టు నిర్మాణంలో కేసీఆర్‌‌ అక్రమాలను జస్టిస్‌ ఘోష్‌ కమిషన్‌ నిర్ధారించిందని వెల్లడించింది. కాంట్రాక్టర్లకు ప్రయోజనం కల్పించడానికి ప్రాజెక్టుల అంచనా విలువను పెంచారని, మంత్రి మండలి ఆమోదం లేకుండానే పరిపాలనా పరమైన అనుమతులు మంజూరు చేశారని కమిషన్‌ వెల్లడించిందని పేర్కొన్నది. బ్యారేజీల నిర్మాణానికి సంబంధించి సీబీఐ దర్యాప్తు అనంతరం నేరం వెలుగులోకి వస్తుందని తెలిపింది. జస్టిస్‌ ఘోష్‌ కమిషన్‌ నివేదికను సవాల్‌ చేస్తూ కేసీఆర్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో బుధవారం కౌంటర్‌‌ 
దాఖలు చేసింది. ప్రభుత్వం తరఫున నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్‌ బొజ్జా కౌంటర్‌‌ దాఖలు చేశారు.

కేసీఆర్​ అక్రమాలను కమిషన్‌‌‌‌ నిర్ధారించిందని 

పేర్కొన్నారు. ఆయన  ఏకపక్ష నిర్ణయాలతో ప్రభుత్వ ఖజానాకు రూ.7,500 కోట్ల నష్టం వాటిల్లిందని, కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చడానికి అంచనాలను పెంచారని కమిషన్‌‌‌‌ తేల్చిందని రాష్ట్ర ప్రభుత్వం తెల చెప్పింది. ఇది సమిష్టి నిర్ణయమంటూ కేసీఆర్‌‌‌‌ బాధ్యతల నుంచి తప్పించుకోలేరని పేర్కొన్నది.  ప్రాజెక్టు నిర్మాణానికి మంత్రి మండలి ఆమోదం తీసుకోలేదని వెల్లడించింది. ప్రజాప్రయోజనాల్లో భాగమైన మౌలిక సదుపాయాలు, ఆర్థిక, పరిపాలనాపరమైన లోపాలకు సంబంధించి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అడ్డుకోడానికే పిటిషన్‌‌‌‌ ద్వారా కేసీఆర్‌‌‌‌ వ్యర్థ ప్రయత్నం చేస్తున్నారని కోర్టుకు తెలియజేసింది. 

రాజ్యాంగం ప్రకారమే కమిషన్‌‌‌‌

రాజ్యాంగం ప్రకారమే కాళేశ్వరంపై విచారణ కమిషన్‌‌‌‌ ఏర్పాటు చేశామని, చట్టప్రకారం విచారణ జరిగిందని ప్రభుత్వం వెల్లడించింది. సాక్షుల క్రాస్‌‌‌‌ ఎగ్జామినేషన్‌‌‌‌కు అవకాశం కల్పించాలంటూ విచారణ సమయంలో అడగకుండా ఇప్పుడు అభ్యంతరం చెప్పడం సరికాదని పేర్కొన్నది. అలాగే, విచారణకు  స్వచ్ఛందంగా హాజరయ్యారని తెలిపింది. కమిషన్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ఎంక్వైరీస్‌‌‌‌ చట్టంలోని సెక్షన్‌‌‌‌ 8ఏ, సీ కింద నోటీసులకు సంబంధించిన హక్కులను వదులుకొని, ఇప్పుడు వాటిని సవాలు చేయడానికి వీల్లేదని పేర్కొన్నది. విచారణకు కేసీఆర్‌‌‌‌‌‌‌‌ స్వయంగా హాజరవడంతోపాటు ఆయన కమిషన్‌‌‌‌ నుంచి అన్ని పత్రాలు పొంది.. ఇప్పుడు సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా విచారణ జరిగిందనడం చెల్లదని తెలిపింది. కేసీఆర్‌‌‌‌ అభ్యర్థన మేరకు ఇన్‌‌‌‌కెమెరా ప్రొసీడింగ్స్‌‌‌‌ చేపట్టిందని, ఇప్పుడు వాదన వినిపించే అవకాశం ఇవ్వలేదని మాట్లాడుతున్నారని పేర్కొన్నది.   

ప్రజాప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని కమిషన్‌‌‌‌ను ఏర్పాటు చేయాల్సి వచ్చిందని తెలిపింది. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్‌‌‌‌ కుంగిపోవడం, నేషనల్‌‌‌‌ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్‌‌‌‌డీఎస్‌‌‌‌ఏ) ప్రాథమిక నివేదిక ప్రకారం ప్లానింగ్, డిజైనింగ్, నిర్మాణ, నిర్వహణలో లోపాలున్నాయని చెప్పడంతో కమిషన్‌‌‌‌తో విచారణకు ఆదేశించినట్లు తెలిపింది. జస్టిస్‌‌‌‌ ఘోష్‌‌‌‌ కమిషన్‌‌‌‌ చట్టప్రకారం విచారణ చేపట్టిందని, బ్యారేజీల నిర్మాణంలో పాల్గొన్నవారిని విచారించి, ప్రభుత్వ రికార్డులు, సాక్ష్యాలను పరిశీలించిన మీదట నివేదిక సమర్పించిందని వెల్లడించింది. స్థలం ఎంపిక నుంచి డిజైన్‌‌‌‌ ఖరారు, కాంట్రాక్ట్‌‌‌‌ల అప్పగింత, అమలు, నిర్వహణ కేసీఆర్‌‌‌‌ సీఎంగా ఉన్నపుడే జరిగినందున  ఆయన తప్పించుకోలేరని పేర్కొన్నది. రాజకీయ వ్యూహంలో భాగంగా విచారణ అనడానికి ఎలాంటి ఆధారాలు చూపలేదని తెలిపింది. ప్రభుత్వం జీవో ద్వారా ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికను తొక్కిపెట్టి బ్యారేజీల నిర్మాణాన్ని చేపట్టారని పేర్కొన్నది. నిపుణుల కమిటీ నివేదికను పక్కనపెట్టడం వల్ల రాష్ట్ర ఖజానాపై రూ.7,500 కోట్ల భారంపడిందని వెల్లడించింది.

బాధ్యులను గుర్తించిన కమిషన్‌‌‌‌

బ్యారేజీల నిర్మాణంలో అక్రమాలకు, రాష్ట్ర ఖజానాకు నష్టం వాటిల్లేలా నిర్ణయాలు తీసుకున్న బాధ్యులను కమిషన్‌‌‌‌ గుర్తించిందని కౌంటర్‌‌‌‌‌‌‌‌లో ప్రభుత్వం వెల్లడించింది.  కేసీఆర్, హరీశ్‌‌‌‌రావుతోపాటు రాజకీయ నేతలు, ఐఏఎస్‌‌‌‌లు, కాంట్రాక్టర్లలో బాధ్యులను వెల్లడించిందని తెలిపింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి మంత్రి మండలి ఆమోదం పొందినప్పుడే సమిష్టి బాధ్యత అవుతుందని, ఇక్కడ కేసీఆర్‌‌‌‌ కేబినెట్‌‌‌‌ ఆమోదం లేకుండా ఏకపక్షంగా అనుమతులు మంజూరు చేశారని కమిషన్‌‌‌‌ నిర్ధారించిందని పేర్కొన్నది.   

నిర్మాణంలో కాంట్రాక్టర్ల ఎంపిక, అంచనా సవరణలు, షరతుల సడలింపులు దురుద్దేశపూరితంగా జరిగాయని తెలిపింది. అంచనా విలువ రూ.1,942.48 కోట్లు పెంచడం వల్ల కాంట్రాక్టర్లకు రూ.612.51 కోట్ల అక్రమ ప్రయోజనం కలిగిందని చెప్పింది.  కమిషన్‌‌‌‌ ఏర్పాటులో పేర్కొన్న విధి విధానాల ప్రకారమే విచారణ జరిగిందని వెల్లడించింది. లోపాలతోపాటు బాధ్యులను గుర్తించి.. నిజ నిర్ధారణ నివేదికను సమర్పించడమే కమిషన్‌‌‌‌ బాధ్యత అని పేర్కొన్నది. రాష్ట్రానికి తీవ్ర నష్టం కలిగించిన అంశాలపై కమిషన్‌‌‌‌ సిఫారసులు ప్రభుత్వానికి ముఖ్యమని, అందువల్ల కమిషన్‌‌‌‌ నివేదికను సమర్పించిందని తెలిపింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి నిష్పాక్షికంగా విచారణ జరిపి ఆధారాలతో సహా నివేదిక సమర్పిస్తే.. రాజకీయంగా కేసీఆర్‌‌‌‌ ప్రతిష్ఠను దెబ్బతీయడానికేనని ఆరోపించడం చెల్లదని పేర్కొన్నది. కేసీఆర్‌‌‌‌ పిటిషన్‌‌‌‌ను కొట్టివేసి.. స్టేను ఎత్తివేయాలని కోరింది.