- సీఎంతో చర్చించాక నిర్ణయం: మంత్రి వాకిటి శ్రీహరి
- మత్స్యకారుల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
- రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా మత్స్య శాఖను తీర్చిదిద్దుతామని వెల్లడి
- వరల్డ్ ఆక్వాకల్చర్ ఇండియా-2025 కాన్ఫరెన్స్ కు హాజరు
హైదరాబాద్, వెలుగు: మధ్యాహ్న భోజనం పథకంలో చేపల వంటకాలను చేర్చేందుకు యోచిస్తున్నామని రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. సీఎంతో చర్చించి.. ఈ ప్రతిపాదనపై నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. మత్స్యకారుల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం అంకితభావంతో పనిచేస్తోందని, తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో మత్స్య శాఖ కీలక పాత్ర పోషించేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. మంగళవారం నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు (ఎన్ఎఫ్డీబీ) ఆధ్వర్యంలో హైదరాబాద్ హెచ్ఐసీసీ నోవాటెల్‌లో నిర్వహించిన వరల్డ్ ఆక్వాకల్చర్ ఇండియా–2025 కాన్ఫరెన్స్ కు మంత్రి చీఫ్‌గెస్ట్‌గా హాజరై మత్స్యశాఖ రూపొందించిన ప్రచార గీతాన్ని విడుదల చేశారు.
సమావేశంలో మత్స్య సంపద అభివృద్ధి, మత్స్యకారుల ఆర్థిక పురోగతి అంశాలపై చర్చలు జరిగాయి. ఆక్వా కల్చర్ షోలో ఏర్పాటు చేసిన స్టాళ్లను మంత్రి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మత్స్యకారుల కుటుంబానికి చెందిన వ్యక్తిగా ఈ కాన్ఫరెన్స్‌లో పాల్గొనడం గర్వకారణంగా ఉందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటి వరకు ముదిరాజ్ సామాజికవర్గానికి మత్స్యశాఖ లభించలేదని, తొలి సారి కాంగ్రెస్ ప్రభుత్వంలో తనకు అవకాశం కల్పించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. గతంలో నిర్వీర్య స్థితికి చేరిన మత్స్యశాఖను పునరుద్ధరించే దిశగా కృషి ప్రారంభించామని మంత్రి చెప్పారు.
నీటి వనరులు రాష్ట్రానికి వరం..
గోదావరి, కృష్ణా నదులతో పాటు గొలుసు కట్టు చెరువులు రాష్ట్రానికి అమూల్యమైన వరమని మంత్రి పేర్కొన్నారు. ఇవి మత్స్య సంపద అభివృద్ధికి దోహద పడుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలోని 26 వేల నీటి వనరులలో చేప పిల్లల పంపిణీ కార్యక్రమం జరుగుతోందని, ఇప్పటివరకు 84 కోట్ల చేప పిల్లలు, 10 కోట్ల రొయ్య పిల్లలు విడుదల చేసినట్టు తెలిపారు. అలాగే, రాష్ట్రంలో చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలను విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్, తెలంగాణ ఫిషరీస్ డైరెక్టర్ నిఖిల, ఎన్ఎఫ్డీబీ సీఈఓ బెహరా, జాయింట్ సెక్రటరీ నీతు కుమారి, ఐకార్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ జయ్‌కృష్ణ, పీవీఎన్ఆర్ వెటర్నరీ యూనివర్సిటీ వీసీ జ్ఞానప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.
