రిటైర్డ్ ఉద్యోగులకు అందాల్సిన బకాయిలు ప్రభుత్వం అందజేయకపోవడంతో వారు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ఉద్యోగులు రిటైరై 18 నెలల అవుతున్నా బెనిఫిట్స్ రాక, తమ కుటుంబ అవసరాలు తీరక మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఈ మధ్య కాలంలో హన్మకొండ పోలీస్ స్టేషన్ రైటర్ బాలకృష్ణ మానసిక వేదనతో హార్ట్ స్ట్రోక్ వచ్చి మరణించాడు. ఇదే మండలంలో పైడిపల్లి హైస్కూల్లో పనిచేసి రిటైర్ అయిన జూనియర్ అసిస్టెంట్ బి లక్ష్మణ్ బ్రెయిన్ స్ట్రోక్‌తో, మహబూబ్ నగర్ జిల్లా గండేడు మండలానికి చెందిన విశ్రాంతి ఉపాధ్యాయుడు కుడుముల కొండయ్య తీవ్ర అనారోగ్యానికి గురై వైద్య ఖర్చులు భరించలేక చనిపోవడం జరిగింది. మిత్రులారా గుండెకు స్టంట్ వేసుకోవాలి డబ్బులు అప్పివ్వండి అని కొత్తగూడెం ఐటిఐలో సూపరింటెండెంట్‌గా పనిచేసి రిటైర్ అయిన శ్రీనివాసరావు ఉద్యోగ జేఏసీ నాయకులను వేడుకొంటున్నాడు. ఎంతోమంది రిటైర్డ్ఉద్యోగులు అనారోగ్యంపాలై బెనిఫిట్స్ అందక వ్యధతో మనోవేదన చెందుతున్నారు.
ప్రభుత్వపాలన సక్రమంగా నిర్వహించాలంటే ఉద్యోగుల పాత్ర ఎంతో కీలకం. ప్రభుత్వ పథకాలు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, విద్య, వైద్యం, రాష్ట్రంలోని వివిధ డిపార్ట్మెంట్లలో పథకాలు ప్రజలకు అందాలంటే ఉద్యోగులు సక్రమంగా పనిచేయాల్సి ఉంటుంది. ఉద్యోగులకు చెల్లించాల్సిన జీతభత్యాలు, ఇతరత్రా ప్రయోజనాలను సకాలంలో చెల్లించాలి. అట్లా చెల్లించడం ద్వారా ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఉత్సాహంతో తమ విధులు నిర్వహిస్తారు. ఉద్యోగులు సక్రమంగా పనిచేసినప్పుడు ప్రభుత్వానికి మంచిపేరు వస్తుంది.
గత ప్రభుత్వ నిర్వాకమే ఇది
గత బీఆర్ఎస్ ప్రభుత్వం రిటైర్మెంట్ వయస్సును 58 సంవత్సరాల నుంచి 61 సంవత్సరాలకు పెంచారు. ఉద్యోగ విరమణ వయస్సు 61 సంవత్సరాలు మార్చి 2024 నుంచి ప్రారంభం అయింది. గత ప్రభుత్వం సైతం వేతనాలు, ఉద్యోగులకు బకాయిలు సకాలంలో చెల్లించలేదు. ప్రతి సంవత్సరం రాష్ట్రవ్యాప్తంగా 9,000 మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు రిటైర్ అవుతున్నారు. 2024 మార్చి నుంచి సెప్టెంబర్ 2025 వరకు దాదాపుగా 12 వేల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు రిటైర్ అయ్యారు. రిటైర్ అయిన ఉద్యోగులకు రావలసిన పదవీ విరమణ ప్రయోజనాలైన గ్రాట్యుటీ, కమ్యుటేషన్, ఈ.ఎల్. హాఫ్-పే లీవ్ ఎన్కాష్మెంట్ లీవ్స్, జీపీఎఫ్, టీ.ఎస్.జీ.ఎల్.ఐ, జిఐఎస్, పీఆర్సి ఎరియర్స్, సర్వీసులో ఉన్నప్పుడు చేసుకున్న సరెండర్ లీవ్స్ తదితర బిల్లుల మొత్తం రిటైర్ అయిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు చెల్లించాల్సి ఉన్నది. వారి హోదా, సర్వీస్ ఆధారంగా వారు నిల్వ చేసుకున్న జీపీఎఫ్ నిల్వలు దాదాపుగా రూ.35 లక్షల నుంచి రూ.75 లక్షల వరకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావాల్సి ఉన్నవి. ఇందులో గ్రాట్యుటీ తప్ప మిగతా సొమ్ము ఉద్యోగులు దాచుకున్నదే. ఉద్యోగులు పదవీ విరమణ తరువాత శేష జీవితాన్ని ప్రశాంతంగా గడపాలని కోరుకుంటారు. ఉద్యోగం చేసినంత కాలం ఉద్యోగులు తాము దాచుకున్న సొమ్ములు అందుతాయని ప్రభుత్వ నుంచి గ్రాట్యుటీ లభిస్తుందని ఆశిస్తారు. పిల్లల చదువులు, పెళ్లిళ్లు, సొంత ఇంటి నిర్మాణం, చేసిన అప్పులు తీర్చడం ఇలా ఎన్నో ప్రణాళికలు వేసుకొని ఉంటారు.
పెరుగుతున్న రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు
ఉద్యోగి పదవీ విరమణ చేసినరోజునే ఆయనకు ఇవ్వవలసిన ఆర్థిక ప్రయోజనాలను అందించి, శాలువాతో సత్కరించి ప్రభుత్వ వాహనంలో ఇంటికి పంపిస్తామని గత ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ, అప్పటినుంచి ఇప్పటివరకు ఆ విధానం అమలుకావడం లేదు. మార్చి 2024 నుంచి ప్రతినెల రిటైర్డ్ ఉద్యోగులు పెరుగుతుండడం వలన బకాయిలు పెరిగిపోతున్నాయి. గత జూన్‌లో ప్రకటించిన డీ.ఏ. ఎరియర్స్‌ను ఏప్రిల్ 2024 నుంచి ఆగస్టు 2025 వరకు రిటైర్ అయినవారికి 28 వాయిదాలలో చెల్లించాల్సిన వాయిదాలను కూడా చెల్లించలేకపోతున్నారు. గత ఏప్రిల్ 2025 నుంచి రిటైర్ అయినవారికి కేవలం నెలవారి పెన్షన్ మాత్రమే చెల్లిస్తున్నారు. రిటైర్మెంట్ అయినవారికి వెంటనే వారికి రావలసిన ప్రయోజనాలు, పెండింగ్ బకాయిలు చెల్లించాలని ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ప్రభుత్వంతో చర్చలు జరిపారు.
రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించాలి
ఆర్థికశాఖ మంత్రివర్యులు భట్టి విక్రమార్క మే నుంచి ప్రతి నెల రూ.700 కోట్లు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. కానీ, ఇప్పటివరకు రెండుసార్లు మాత్రమే ఒక నెల రూ.300 కోట్లు, ఇంకో నెల రూ. 280 కోట్లు విడుదలచేసి మళ్లీ విడుదల చేయకుండా ప్రభుత్వం తాను ఇచ్చిన హామీనే అమలుపరచడం లేదు. తమ బకాయిలను నెల నెలా చెల్లించక పోవడంవలన కొంతమంది ఉద్యోగులు విసిగిపోయి హైకోర్టును ఆశ్రయించగా వారికి ఆరు, కొంతమందికి పది వారాలలో చెల్లించాలని ఆదేశించింది. అయితే, కోర్టు ఆదేశాల ప్రకారం చెల్లించకపోవడం వలన చాలామంది కోర్టు ధిక్కార కేసులు వేసినా ప్రభుత్వం స్పందించడం లేదు. రిటైర్అయిన ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నింటిని త్వరగా చెల్లించి పెన్షనర్ల జీవితాలను, వారి కుటుంబాలను కాపాడతారని 12 వేల మంది రిటైర్మెంట్ అయిన పెన్షనర్లు ఆశతో జీవిస్తున్నారు. తమ కుటుంబాలను ప్రభుత్వం కాపాడాలని ఆశతో ఎదురుచూస్తున్నారు.
హామీ అమలు కోసం ఎదురుచూపులు
గత ప్రభుత్వం రిటైర్మెంట్ వయసును 58 నుంచి 61 సంవత్సరాలకు పెంచిన పరిణామాన్ని ఈ ప్రభుత్వం భరించాల్సి వస్తుందని రిటైర్డ్ ఉద్యోగులుగా మాకూ తెలుసు. ఈ ప్రభుత్వానికి ఏర్పడిన ఆర్థిక సమస్యలు కూడా తెలుసు. కానీ రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ ఆగిపోతే రిటైర్డ్ ఉద్యోగుల బతుకులు ఎంత ఆగమైతున్నాయో ఈ ప్రభుత్వం అర్థం చేసుకొని న్యాయం చేయాలని రిటైర్డ్ ఉద్యోగులు కోరుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లింపుతోబాటు, బకాయిలను చెల్లిస్తామని తెలిపారు. పీఆర్సీ అమలు చేస్తామని ఇచ్చిన హామీలను అమలుచేయాలని ఉద్యోగులు కోరుతున్నారు. ఉద్యోగుల కాంట్రిబ్యూషన్ తో అన్ని రకాల జబ్బులకు అన్ని ఆసుపత్రుల్లో వైద్యం అందించేవిధంగా హెల్త్ కార్డులు జారీచేసి ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరిస్తాం అని కూడా హామీలు ఇచ్చారు. ప్రభుత్వాన్ని కొత్తగా గొంతెమ్మ కోరికలు కోరడం లేదు. ఇచ్చిన హామీలను అమలు చేయాలని మాత్రమే కోరుతున్నాం.
- కడారి భోగేశ్వర్,
ప్రధాన కార్యదర్శి,
రిటైర్డ్ ఎంప్లాయీస్ (బెనిఫిట్స్) సాధన కమిటీ
