ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో.. 3 జిల్లాలు టాప్

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో.. 3 జిల్లాలు టాప్
  • జనగామ, ఖమ్మం, యాదాద్రి భువనగిరిలో 70 శాతం  ప్రోగ్రెస్
  • రాష్ట్రవ్యాప్తంగా 3.69 లక్షల ఇండ్లకు సాంక్షన్ ​లెటర్స్​
  • వీటిలో ఇప్పటి వరకు 2.33 లక్షల ఇండ్లు గ్రౌండింగ్ 
  • 40% లోపు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఉన్న జిల్లాలపై గృహనిర్మాణ శాఖ 
  • స్పెషల్​ ఫోకస్.. పనులు స్పీడప్​ చేసేందుకు చర్యలు

హైదరాబాద్​, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో మూడు జిల్లాలు టాప్​లో ఉన్నాయి. 70 శాతం ప్రోగ్రెస్ తో జనగామ, ఖమ్మం, యాదాద్రి భువనగిరి జిల్లాలు తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. హైదరాబాద్​ మినహా అన్నీ జిల్లాల్లో కలిపి రాష్ట్ర ప్రభుత్వం 3.69 లక్షల ఇండ్లకు సాంక్షన్​ లెటర్స్​ అందజేసింది.  వీటిలో ఇప్పటి వరకు 2.33 లక్షల ఇండ్లు గ్రౌండింగ్ అయ్యాయి. 

హౌసింగ్​ ఆఫీసర్లు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ వారం వారం ఇండ్ల నిర్మాణ ప్రోగ్రెస్​ రిపోర్ట్​ రెడీ చేస్తూ ప్రభుత్వానికి నివేదిస్తున్నారు. నిర్మాణాలను బట్టి వివిధ స్థాయిల్లో ఇండ్లకు బిల్లులు చెల్లిస్తున్నారు. మరోవైపు రాష్ట్ర సగటు కంటే తక్కువగా 40 శాతం లోపు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఉన్న జిల్లాలపై గృహనిర్మాణ శాఖ స్పెషల్​ ఫోకస్ పెట్టింది. వెనుకబడిన జిల్లాల్లో పనులు స్పీడప్​చేసేలా ఆఫీసర్లకు ఆదేశాలిస్తున్నది. 

ఇప్పటి వరకు రూ.2,906 కోట్లు చెల్లింపు

ఇందిరమ్మ ఇండ్ల పథకం తొలిదశలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది 4.5 లక్షల ఇండ్లను నిర్మించాలని టార్గెట్​గా పెట్టుకుంది. 400 నుంచి 600 స్క్వేర్​ ఫీట్స్​ పరిధిలో నిర్మించుకున్న ఇంటికి రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేస్తున్నది.  ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తుల ఆధారంగా ఇప్పటివరకు 3.69 లక్షల ఇండ్లు కేటాయించగా.. వీటిలో 3.36 లక్షల మందికి ప్రభుత్వం ఇందిరమ్మ గృహ నిర్మాణ మంజూరు పత్రాలు అందజేసింది. 

కాగా, అన్ని జిల్లాల్లో కలిపి 2.33 లక్షల మంది లబ్ధిదారులు ఇండ్ల నిర్మాణ పనులు మొదలుపెట్టారు. వీటిలో 90,613 మంది బేస్​మెంట్​ లెవల్​, 41,212 మంది గోడల నిర్మాణం (రూఫ్​ లెవల్​), 37,400 మంది ఇండ్ల స్లాబ్​ నిర్మాణం కంప్లీట్​(రూఫ్​ కాస్ట్​), 620 మంది పూర్తిస్థాయిలో ఇంటి నిర్మాణం కంప్లీట్​ చేసినట్లుగా హౌసింగ్​ ఆఫీసర్లు ప్రకటించారు. ఆయా ఇంటి నిర్మాణాల ప్రకారం లబ్ధిదారులకు ఇప్పటివరకు రూ.2,906 కోట్ల బిల్లులు చెల్లించారు. 

ఏ జిల్లా పరిస్థితి ఏమిటి?

గృహనిర్మాణ శాఖ​తాజా రిపోర్ట్​ ప్రకారం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ రాష్ట్ర సగటు 46.03 శాతంగా ఉంది. ఇందులో జనగామ, ఖమ్మం, యాదాద్రి భువనగిరి జిల్లాలు 70 శాతానికి పైగా ప్రొగ్రెస్​ సాధించి టాప్​ త్రీలో నిలిచాయి. జనగామ జిల్లాలో 5,950 ఇండ్లకు గానూ 4,220.. ఖమ్మం జిల్లాలో 18,389 ఇండ్లకు 13,004.. యాదాద్రి భువనగిరి జిల్లాలో 9,707 ఇండ్లకు 6,825 ఇండ్ల నిర్మాణాలు ప్రారంభించి వివిధ దశల్లో ఉన్నాయి. 

అలాగే ములుగు జిల్లా 65 శాతం, మహబూబాబాద్ 62, నల్గొండ 56​, భద్రాద్రి కొత్తగూడెం 54, సిద్దిపేట 51, రంగారెడ్డి 50 శాతం ప్రొగ్రెస్​ సాధించినట్లు హౌజింగ్​ ఆఫీసర్లు తెలిపారు. కాగా, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో మేడ్చల్​ మల్కాజిగిరి జిల్లా చివరి స్థానంలో ఉంది. ఈ జిల్లాలో 3,500 ఇండ్లకు గానూ కేవలం 755 ఇండ్ల నిర్మాణాలు ప్రారంభించారు. ఈ జిల్లా ప్రోగ్రెస్​రిపోర్ట్​ 21.57 శాతం మాత్రమే.  

కింది నుంచి సూర్యాపేట జిల్లా 27, రాజన్న సిరిసిల్ల 33, పెద్దపల్లి 33, కుమ్రంభీం​ అసిఫాబాద్​ 36, వికారాబాద్​ 37, కామారెడ్డి 37, సంగారెడ్డి 38, ఆదిలాబాద్​ 38, నిర్మల్​ 39 శాతం ప్రొగ్రెస్​ సాధించి రెడ్​ జోన్​లో నిలిచాయి. ఇవీ గాక మిగిలిన అన్నీ జిల్లాలు కూడా 40 నుంచి 50 శాతం ప్రోగ్రెస్​ రిపోర్ట్​ సాధించి యెల్లో జోన్​లో ఉన్నాయ. 

నిర్మాణాలు వేగంగా చేపట్టేలా..!

ఇందిరమ్మ ఇండ్ల గృహనిర్మాణంలో కేవలం 40 శాతం ప్రొగ్రెస్​ ఉన్న జిల్లాలపై గృహనిర్మాణ శాఖ ఆఫీసర్లు స్పెషల్​ ఫోకస్​ పెట్టారు. ఇక్కడ ఇండ్ల నిర్మాణాలు స్టార్ట్​ చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఎంపీడీవోలు, తహసీల్దార్లు, గృహనిర్మాణ శాఖ ఏఈలు, పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలు జారీచేశారు. లోపం ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి మండలాల వారీగా గ్రామాల పంచాయతీ సెక్రటరీలతో మీటింగ్​లు ఏర్పాటు చేశారు. 

అలాగే ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులను కలిసి ఇండ్ల నిర్మాణం మొదలు పెట్టకపోతే వారి స్థానాల్లో అర్హులైన కొత్త వారికి  అవకాశం ఇస్తామని చెప్తున్నారు. వారంలోపు ఇంటి నిర్మాణాలకు ముగ్గులు పోసుకొని పునాదులు తవ్వాలని అంటున్నారు. ఇండ్ల నిర్మాణం కోసం ముందస్తుగా మహిళా సంఘాల నుంచి రూ.లక్ష చొప్పున లోన్లు కూడా అందిస్తున్నారు. పంచాయతీ కార్యదర్శులు, గృహనిర్మాణ శాఖ ఆఫీసర్లు తరుచుగా లబ్ధిదారులతో టచ్​లో ఉంటూ ఇళ్ల నిర్మాణాలు స్టార్ట్​ చేయడానికి అవసరమైన చేయూత అందిస్తున్నారు. 

ఇందిరమ్మ ఇండ్ల ప్రోగ్రెస్​పై ప్రత్యేక దృష్టి

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను వేగవంతం చేస్తున్నాం. గృహ నిర్మాణ శాఖ జిల్లా ప్రాజెక్ట్​ డైరెక్టర్లు(పీడీ) లతో ప్రతి మంగళవారం జూమ్​ మీటింగ్​ నిర్వహిస్తూ సమస్యలను తెలుసుకుంటున్నాం. క్షేత్రస్థాయిలో ఉన్న ఇండ్ల నిర్మాణ ప్రొగ్రెస్​ ప్రకారం స్టేజ్​ల వారీగా ప్రతీ వారం బిల్లులు చెల్లిస్తున్నాం. లబ్దిదారుల బ్యాంక్​ అకౌంట్లలోనే నేరుగా డబ్బులు జమ చేస్తూ మధ్య దళారి వ్యవస్థకు అడ్డుకట్ట వేసినం. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా రూ.2,906 కోట్ల బిల్లులు చెల్లించినం.

- చైతన్య కుమార్​, రాష్ట్ర హౌసింగ్​ కార్పొరేషన్ చీఫ్​ ఇంజినీర్