సర్కారు బడుల్లో మిడ్ లైన్ పరీక్షలు  

సర్కారు బడుల్లో మిడ్ లైన్ పరీక్షలు  
  • 6 నుంచి 9వ తరగతి విద్యార్థులకు 20 నుంచి 30 దాకా 

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రంలోని ప్రభుత్వ బడుల్లో 6 నుంచి 9వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఈ నెల 20 నుంచి మిడ్ లైన్ టెస్టులు నిర్వహించనున్నారు. ‘లెర్నింగ్ ఇంప్రూవ్‌‌‌‌మెంట్ ప్రోగ్రామ్’ (లిప్)లో  భాగంగా విద్యార్థుల్లోని అభ్యసన లోపాలను గుర్తించి, వారి సామర్థ్యాలను మెరుగుపరచడమే లక్ష్యంగా ఈనెల 20 నుంచి 30 వరకు ఫిజికల్ మోడ్‌‌‌‌లో ఈ పరీక్షలు జరగనున్నాయి. సర్కారు, లోకల్ బాడీ స్కూళ్లతో పాటు తెలంగాణ మోడల్ స్కూల్స్, గురుకులాలు, కేజీబీవీలు, అర్బన్ రెసిడెన్షియల్ బడుల్లో చదివే విద్యార్థులందరికీ ఈ టెస్టులు వర్తిస్తాయని ఎస్​సీఈఆర్టీ  డైరెక్టర్ జి. రమేశ్ తెలిపారు.

ఈ మేరకు అన్ని జిల్లాల డీఈవోలకు ఉత్తర్వులు జారీ చేశారు. పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాల సాఫ్ట్ కాపీలను ఇప్పటికే డీఈవోల ఈ-మెయిల్స్‌‌‌‌కు పంపించామని, వాటిని ఆయా స్కూళ్ల హెడ్మాస్టర్లు, ప్రిన్సిపాళ్లకు తక్షణమే చేరవేయాలని సూచించారు. పరీక్షలు పూర్తయిన తర్వాత విద్యార్థుల ఫలితాలను డిసెంబర్ 10వ తేదీ లోగా ‘తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ యాప్’లో నమోదు చేయాల్సి ఉంటుంది. గత బేస్‌‌‌‌లైన్ టెస్ట్ ఫలితాలతో ప్రస్తుత మిడ్‌‌‌‌లైన్ ఫలితాలను సరిపోల్చి ప్రత్యేక బోధన అందించాలని ఆదేశించారు.