
- ఇంటికి రూ.5.04 లక్షలు ఇవ్వాలి..
- యువతకు 2 లక్షల సాయం చేయాలె..
- మిడ్ మానేరు నిర్వాసితుల డిమాండ్
- కొదురుపాకలో అఖిలపక్షం సభ
- బాధలు చెప్పుకున్న 13 ఊర్ల బాధితులు
- ఎవరబ్బ సొమ్మని చింతమడకలో ఇచ్చినవ్..ఇక్కడ ఎందుకివ్వవు: రేవంత్
- ఫాంహౌజ్ గుంజుకుంటం: సంజయ్
- ఉద్యమ నేతే.. ఇప్పుడు ద్రోహి: జీవన్‌రెడ్డి
- సీఎంను నిలదీయండి: కోదండరాం
- కేసీఆర్‌కు బుద్ధి చెప్పాల్సిందే: వివేక్
కరీంనగర్, వెలుగు: ముంపుతో సర్వం కోల్పోయిన తమను ఆదుకోవాలని, సీఎం కేసీఆర్ తమకిచ్చిన మాట నిలబెట్టుకోవాలని మిడ్‌మానేరు నిర్వాసితులు డిమాండ్ చేశారు. ఇంటి నిర్మాణం కోసం 5లక్షల 4 వేలు ఇవ్వాలని, 18 ఏళ్లు నిండిన వారికి రూ.2 లక్షల చొప్పున సాయం వెంటనే అందించాలని కోరారు. తెలంగాణ వచ్చినంక సమస్యలు తీరుతాయని సంబురపడ్డామని, ఇన్నేండ్లయినా పట్టించుకోవడం లేదేమని నిలదీశారు. ప్రభుత్వం దిగొచ్చేవరకు పోరాడుతామన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కొదురుపాకలో ముంపు గ్రామాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో శుక్రవారం బహిరంగ సభ జరిగింది. 13 గ్రామాల ప్రజలతోపాటు సమీప ప్రాంతాల జనం సభకు వచ్చారు. నిర్వాసితులకు మద్దతుగా అఖిలపక్ష నేతలు రేవంత్‌రెడ్డి, బండి సంజయ్, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, వివేక్‌వెంకటస్వామి, కోదండరాం, పొన్నం ప్రభాకర్, ఎల్.రమణ, చాడ వెంకటరెడ్డి, విమలక్క తదితరులు సభకు హాజరయ్యారు. తొలుత ముంపు గ్రామాల జనం తమ గోడు వెల్లబోసుకున్నారు. తర్వాత నేతలు మాట్లాడారు.
అడుక్కుంటే హక్కులు రావు, కొట్లాడి తెచ్చుకుంటేనే వస్తయన్న తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో పోరాడుతున్న మిడ్ మానేరు నిర్వాసితులను అభినందిస్తున్నామని రేవంత్ చెప్పారు. ఈ పోరాటానికి అండగా నిలవడానికి అన్ని పార్టీలు, ప్రజాసంఘాల నాయకులం వచ్చామన్నారు. ‘‘అగ్గిపెట్టెలో పట్టే చీరలు నేసి, ప్రపంచ ఖ్యాతి పొందిన సిరిసిల్లలో ఇసుక లారీల కింద దళితులు, గిరిజనులను పశువుల కంటే హీనంగా తొక్కుతుంటే.. మేమంతా నేరెళ్ల బాధితులకు అండగా వచ్చినం. తెలంగాణను నిండా ముంచి, మూటలు దంచుకుంటున్న కేసీఆర్ ను దంచి పొలిమేరలు దాటిస్తే ప్రజల కష్టాలు తీరుద్దామనుకున్నం. కానీ మళ్లోసారి గెలిచిండు. ప్రజల సెంటిమెంట్ వాడుకుంటూ ఓట్లు దండుకున్నకేసీఆర్ ముమ్మాటికీ తెలంగాణ ద్రోహి.”అని విమర్శించారు.
కష్టాలు పెరిగినయ్..
మిడ్ మానేరులో అత్తగారి ఊరు, మరో 12 గ్రామాలు మునిగిపోతున్నయని కేసీఆర్ ఇక్కడికి వచ్చారని.. ఆంధ్రా పాలకుల వల్ల మీకు న్యాయం జరగలేదని, తాను న్యాయం చేయిస్తానని చెప్పిండని రేవంత్ అన్నారు. ‘‘మీ మధ్య కూర్చొని. ఇక్కడే ఉంటం.. ఇక్కడే తింటం.. ఇక్కడే పంటం.. నష్ట పరిహారం ఇప్పిస్తాం.. స్వరాష్ట్రం వచ్చినంక మీ కష్టాలు తీరుస్తం అన్నడు. తెలంగాణ రాష్ట్రం వచ్చింది. మా కొదురుపాక అల్లుడు కేసీఆర్ సీఎం అయిండు, ఇగ మా కష్టాలు తీరుతాయని ఇక్కడోళ్లు ఆశపడ్డరు. అందరు హైదరాబాద్‌కు పోతె.. ‘శోభమ్మ సొంతూరొళ్లు, కష్టాలు తీర్చాలే.. స్థలాలు ఇచ్చినం, ఇండ్లు మరిచినం.. వీళ్లకు ఐదు లక్షల నాలుగు వేలు రూపాయలు ఇవ్వాలె’అన్నరు. 2017 డిసెంబర్ నాటికి 18 ఏళ్లు నిండినోళ్లకు రెండు లక్షల సాయం ఇస్తమన్నరు. ఈ మాటలు విని ఊర్లలో సంబురాలు చేసుకున్నరు. కానీ రోజులు, నెలలు పొయినయ్.. ఏండ్లు గడిచినయి.. ఏం రాలే. ఇదేందని రోడ్డు మీద వంటావార్పు చేస్తే.. ఆర్డీవోను పంపించి, కలెక్టర్తోటి మాట్లాడించి దీక్షలు ఉపసంహరించేలా చేసిండ్రు. కొద్దిరోజుల తర్వాత కలెక్టర్ ఆఫీసుకు పోతె.. పోలీసొళ్లతోటి అరెస్టు చేయించి, కొట్టించిండ్రు”అని గుర్తు చేశారు. రాష్ట్రం వచ్చాక ఏ వర్గం వారూ సంతోషంగా లేరన్నారు. ఉద్యమకారులపై కేసులు తొలగించలేదని, ఉద్యోగాలేవని అడిగిన వారిని పోలీస్ స్టేషన్లో పెట్టించారని విమర్శించారు.
ఉసురు తగులుతది
రాష్ట్రంల నీళ్లు, కరెంటు అనుకుంట కేసీఆర్ సెంటిమెంటు బాగా నేర్చుకున్నరని, మాటల్లో ముంచి డబ్బు మూటలు దంచుకుంటున్నడని రేవంత్ ఆరోపించారు. 30 వేల కోట్లతో నిర్మించాలనుకున్న ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును డిజైన్ మార్చారని, లక్షా 20 వేల కోట్లు పెట్టినా అది పూర్తయితదో లేదో తెలియని పరిస్థితి ఉందని చెప్పారు. కేసీఆర్‌కు మిడ్ మానేరులో ముంపునకు గురై కష్టాలు, కన్నీళ్లతో బతుకుతున్న వారి ఉసురు తగులుతుందని పేర్కొన్నారు. ఇక్కడ భూనిర్వాసితులను మోసం చేస్తున్నారని.. చింతమడకలో ఇంటికి పది లక్షల లెక్కన ఎవరి సొమ్మని ఇచ్చారని నిలదీశారు. మిడ్‌మానేరు ముంపు నిర్వాసితులని చెప్పి.. తన చుట్టాలకు పరిహారం ఇచ్చుకున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ దొంగల బండి అని, ఎవరి స్థాయిలో వాళ్లు దోచుకుంటున్నారని విమర్శించారు. వాళ్లను నమ్ముకుంటే లాభం లేదని చెప్పారు.
హైదరాబాద్‌లో ఆందోళన చేద్దాం
త్వరలో రాష్ట్రంలో బడ్జెట్ సమావేశాలు జరుగనున్నాయని, అప్పుడు ఇందిరా పార్కు దగ్గర ధర్నా చేపట్టాలని నిర్వాసితులకు రేవంత్ సూచించారు. తాను వచ్చి ధర్నాలో కూర్చుంటానని, దీక్ష చేస్తానని, ప్రభుత్వాన్ని కదిలిద్దామని చెప్పారు. ఈ రోజు నుంచే పాదయాత్రకు ప్రణాళిక వేయాలని పేర్కొన్నారు.
ఈటల పౌరుషం ఏమైంది?
‘బతికొచ్చినోన్ని కాదు, అడుక్కోచ్చినోన్ని కాదు.. కలబడ్డొన్ని కాదు. నిలబడ్డోన్ని అని ఈటల రాజేందర్ కడుపుల ఉన్నదంతా కక్కిండు. అవును నిజమే. ఉద్య మం జరిగేటపుడు కేటీఆర్ ఇక్కడ లేడు. అమెరికాలో బతికేటోడు. విమానంలో దిగుడుదిగుడే సిరిసిల్ల మహేందర్ అన్నకు వేటు వేసిండు. కేసీఆర్ తన కొడుక్కు టికెట్ ఇచ్చుకున్నడు. ఇప్పుడు ఈటలకు కేటీఆర్‌కో, కేసీఆర్ కో పంపకాల్లో ఏం తేడా వచ్చిందో.. మంత్రి ఈటల రాజేందర్ గురువారం మాట్లాడింది చూసి.. టీఆర్ఎస్ అగ్నిపర్వతం పేలేటట్టే ఉందనుకున్నం. టీఆర్ఎస్ కుండబద్దలైతది, కారు గాల్లో కలిసిపోతదని అనుకున్నం. కానీ రాత్రి కేటీఆర్ ఫోన్ చేయంగనే ఈటల తుస్సుమన్నడు. మధ్యాహ్నం మాట్లాడుతవ్.. రాత్రిపూట అలయ్ బలాయ్ చేసుకుంటవా. ఇదేనా కరీంనగర్ బిడ్డల పౌరుషం. ఇదేనా తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి. దీనిపై ఈటల రాజేందర్ సమాధానం చెప్పాలి.”అని రేవంత్ నిలదీశారు.
నిర్వాసితులపై నిర్లక్ష్యమెందుకు?: జీవన్‌రెడ్డి
కేసీఆర్ అధికారం రాకముందు ఉద్యమ నాయకుడిగా ఉండి, అధికారం వచ్చాక ఉద్యమ ద్రోహిగా మారాడని కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి విమర్శించారు. రాజ్యసభ ఎంపీగా ఉన్న సంతోష్‌రావు ఒక్కడే నిర్వాసితుడా, ఈ ప్రజలు కాదా అని ప్రశ్నించారు. భూసేకరణ చట్టం ప్రకారం నిర్వాసితులు అడిగే న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని, అసెంబ్లీ సమావేశాల్లో మిడ్ మానేరు అంశాన్ని లేవలెత్తుతానని చెప్పారు. నిర్వాసితుల పట్ల కేసీఆర్ సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. ఎంపీ సంతోష్‌రావు సోదరి సౌమ్యరావు పెళ్లయి అత్తగారి ఇంటికెళ్లినా, పుట్టిన ఊరిలో ఆమెకు హక్కు ఉందని పరిహారం ఇచ్చారని.. అలాగే మిడ్‌మానేరు ముంపు ఆడబిడ్డలందరికీ పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా వచ్చే అవకాశం ఉన్నా.. టీఆర్ఎస్ సర్కారు లొసుగులన్నీ బయటపడతాయనే డీపీఆర్‌లు బయటపెట్టడం లేదని ఆరోపించారు.
నియంత పాలన తెచ్చారని నన్ను నిలదీస్తున్నరు: కోదండరాం
తెలంగాణను కొట్లాడి ఏ విధంగా తెచ్చుకున్నామో అదే విధంగా నిర్వాసితులంతా ఒక్క తాటిపై ఉండి పోరాడాలని కోదండరాం పిలుపునిచ్చారు. నిర్వాసిత గ్రామాల్లో ఉపాధి లేక జనం పస్తులుండే కాలం వచ్చిందన్నారు. హెలికాప్టర్ మీంచి చూస్తే మిడ్ మానేరు నీళ్లే కనబడుతాయని.. కిందికి దిగితేనే ఇక్కడి వారి కన్నీళ్లు కనబడుతాయన్నారు. ఒకప్పుడు నలుగురికి పని కల్పించిన రైతులే నేడు కూలీలుగా మారిపోయారన్నారు. రాష్ట్రంలో జనమంతా నియంత పాలన ఎందుకు తెచ్చావని తనను నిలదీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిర్వాసితుల సభతోనైనా ప్రభుత్వం దిగిరావాలని, లేకపోతే పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సీఎం సిరిసిల్ల ప్రాంతానికి ఎప్పుడు వచ్చినా నిరసన తెలిపేందుకు నిర్వాసితులు సిద్ధంగా ఉండాలని సూచించారు.
ఫాంహౌస్ గుంజుకుంటం: బండి సంజయ్
మిడ్ మానేరు నిర్వాసితుల సమస్యలను సీఎం కేసీఆర్ పరిష్కరించకుంటే.. ప్రగతి భవన్, ఫాంహౌస్‌ను గుంజుకుంటామని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ వ్యాఖ్యానించారు. రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ నాయకులు ఎన్నో అక్రమ దందాలు చేస్తున్నారని, వారి అక్రమ సంపాదనలో ఒక్క శాతం ఇచ్చినా.. మిడ్ మానేరు నిర్వాసితుల సమస్యలు పరిష్కారం అవుతాయని కామెంట్ చేశారు. కేసీఆర్, కేటీఆర్, కవితలకు ఎవరో పిట్టకథలు నేర్పించారని, వాళ్లు ఎక్కడికెళ్లినా అవే కథలు చెప్తారని ఎగతాళి చేశారు. పార్టీల జెండాలు పక్కనపెట్టామని, నిర్వాసితుల సమస్యల పరిష్కారమే తమ ఎజెండా అని చెప్పారు. సీఎం కేసీఆర్ కు దమ్ముంటే హెలికాప్టర్లో కాకుండా.. రోడ్డు మార్గంలో మిడ్‌మానేరు సందర్శనకు రావాలని, ఆయన అత్తగారి ఊరి ప్రజలే ఆయనకు తగిన సమాధానం చెప్తారని పేర్కొన్నారు. మొన్నటి ఎంపీ ఎన్నికల్లో మిడ్ మానేరు నిర్వాసితులు టీఆర్ఎస్కు సరైన బుద్ధి చెప్పారన్నారు. ఇక్కడి నిర్వాసితుల కాలనీల్లో పరిశ్రమల స్థాపనకు టీఆర్ఎస్ సర్కారు ప్రతిపాదనలు పంపిస్తే.. కేంద్రం నుంచి తాను అనుమతులు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు.
నిర్వాసితులకు అండగా ఉంటం: వివేక్
సీఎం కేసీఆర్‌కు అధికారం, డబ్బు, గర్వం తలకెక్కాయని.. ఎక్కడికి వెళ్లినా అబద్ధాలు చెప్తూ కాలం వెళ్లదీస్తున్నారని బీజేపీ నేత, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. రాష్ట్రంలో నిర్మిస్తున్న ప్రాజెక్టుల్లో కమీషన్ల కోసం కాంట్రాక్టర్ మెగా కృష్ణారెడ్డి ఎలా చెబితే సీఎం అలా చేస్తున్నారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కమీషన్ల డబ్బులతోనే ఓట్లను కొని గెలుస్తానన్న భ్రమల్లో ఉన్నారని.. కానీ ప్రజలంతా సరైన సమయంలో బుద్దిచెప్తారని స్పష్టం చేశారు. భారీ వర్షంలో సభ జరుగుతుంటే ఎంత ఓపిగ్గా ఉన్నారో.. అదే సహనం, స్ఫూర్తితో సమస్యలు పరిష్కారమయ్యేంత వరకు పోరాడాలని, తాము వెంట నిలుస్తామని భరోసా ఇచ్చారు.
ఇంకెన్నాళ్లు తిరగాలె?
మాది రుద్రవరం గ్రామం. ఏడాది నుండి కలెక్టర్ ఆఫీస్ చుట్టూ చెప్పులు అరిగేటట్టు తిరుగుతున్న. అయినా ఆఫీసర్లు పట్టించుకుంట లేరు. ఇంకనైనా మా బాధలు ఎప్పుడు తీరుస్తరు. ఇప్పటికే నాకు చాతనైతలేదు. సర్కారు వెంబడే పరిహారం అందించి ఆదుకోవాలె..
– చింతకుంట ఎల్లవ్వ,
ముంపు బాధితురాలు