350 కిలోమీటర్లు సైకిల్ తొక్కి చనిపోయిన వలస కార్మికుడు

350 కిలోమీటర్లు సైకిల్ తొక్కి చనిపోయిన వలస కార్మికుడు

లాక్డౌన్ వల్ల చాలామంది ఎక్కడెక్కడో చిక్కకుపోయారు. దానివల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వలస కార్మికుల బాధలు అయితే వర్ణణాతీతం. చేయడానికి పనుల్లేక, తినడానికి తిండిలేక, పస్తులుండలేక నానాయాతన పడుతున్నారు. ఊరుగాని ఊళ్లో కష్టాలు పడే బదులు సొంత ఊరికి వెళ్లడం మంచిదని భావిస్తున్న వలస కార్మికులు సొంత ఊళ్ల బాటపట్టారు. లాక్డౌన్ వల్ల వాహనాలు లేకపోవడంతో ఎలా వీలైతే అలా ప్రయాణిస్తున్నారు. కొంతమంది నడిచి వెళ్తే, మరికొంత సైకిళ్ల మీద వెళ్తున్నారు.

అలా మహారాష్ట్ర నుండి సైకిల్‌పై ఉత్తరప్రదేశ్‌కు వెళుతున్న ఒక వలస కార్మికుడు మధ్యప్రదేశ్‌లోని బార్వానీలో మరణించాడు. తబారక్ అన్సారీ అనే యాభై ఏళ్ల వ్యక్తి మరో పది మంది కార్మికులతో కలిసి మహారాష్ట్రలోని భివాండి నుండి రెండు రోజుల క్రితం బయలుదేరారు. వీరంతా భివాండిలోని పవర్ లూమ్ యూనిట్‌లో పనిచేసేవారు. అయితే లాక్డౌన్ వల్ల వారు ఉద్యోగాలు కొల్పోయారు. దాంతో చేసేదేమీ లేక సొంతూరికి బయలుదేరారు.

‘మేం అందరం భివాండిలోని పవర్ లూమ్ యూనిట్లో ఉద్యోగాలు కోల్పోయాము. అక్కడ ఉండటానికి మా దగ్గర డబ్బులు లేవు. అంతేకాకుండా తినడానికి తిండి కూడా లేదు. అందుకే మేం మా సొంతూరు మహారాజ్ గంజ్ తిరిగి వెళ్ళాలని నిర్ణయించుకున్నాం. అందరం కలిసి సైకిళ్ల మీద బయలుదేరాం. దాదాపు 350 కిలోమీటర్ల ప్రయాణం చేసి బార్వానీ చేరుకునేసరికి తబారక్ అకస్మాత్తుగా మైకం వచ్చి సైకిల్ మీద నుంచి కింద పడ్డాడు’ అని బృందంలోని రమేష్ కుమార్ గోండ్ అనే కార్మికుడు తెలిపాడు.

తబారక్ డీహైడ్రేషన్‌తో పాటు అధిక అలసట మరియు సన్ స్ట్రోక్ వల్ల మరణించాడని పోలీసులు తెలిపారు. అయితే, పోస్ట్‌మార్టం నివేదిక వచ్చిన తర్వాతే మరణానికి అసలు కారణం తెలుస్తుందని ఒక అధికారి తెలిపారు.

మహారాష్ట్ర సరిహద్దుకు ఆనుకొని ఉన్న బార్వానీలో గత 10 రోజులలో ఇలాంటి సంఘటనలు మరో రెండు జరిగాయి. ఏప్రిల్ 28న అంతర్రాష్ట్ర చెక్‌పోస్ట్ దాటుతూ 45 ఏళ్ల బలిరామ్ మరణించాడు. అతను ఆస్తమా పేషంట్. ఏప్రిల్ 21న ఉత్తరప్రదేశ్ లోని శ్రావస్తిలోని తన ఇంటికి తిరిగి వెళుతున్న వకీల్ అనే వ్యక్తి బార్డర్ వద్ద మరణించాడు.

అనేక సడలింపులను ఇస్తూ కేంద్రప్రభుత్వం లాక్డౌన్ ను మే 17 వరకు పొడిగించింది. లాక్డౌన్ పొడిగించిన నేపథ్యంలో వలస కూలీలను ఆయా రాష్ట్రాలకు తరలించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది.

For More News..

నదిలో శవమై తేలిన చీఫ్ ఎడిటర్

పాక్ కాల్పుల ఉల్లంఘన.. ఇద్దరు భారత సైనికులు మృతి

గ్యాస్ సిలిండర్ల స్టోర్‌హౌస్‌లో పేలుడు