దొరికితే పని.. లేకుంటే పస్తులే !

దొరికితే పని.. లేకుంటే పస్తులే !
  • సిటీలోని కూలీలను పట్టించుకోని సర్కార్​
  • అడ్డాల వద్ద పని కోసం ఎదురుచూపులు
  • సిటీలో 180పైగా అడ్డాలు.. 50 వేలమందికి పైగా కూలీలు

హైదరాబాద్​, వెలుగు: సిటీలో లేబర్​అడ్డాలపై కూలీలు ఎక్కువయ్యారు.  కరోనా ఎఫెక్ట్ ​తగ్గుతుండగా వేలాదిమంది సొంతూళ్ల నుంచి పనుల కోసం పట్నానికి తిరిగొచ్చేశారు. పొద్దున్నే అడ్డాల వద్దకు పోయి పని కోసం ఎదురుచూస్తున్నరు. ఒక్కో అడ్డాపై 200 మంది వరకు కూలీలు ఉంటున్నారు.  పనులు చాలామందికి దొరకడం లేదు. దొరకని వాళ్లు నిరాశతో ఇండ్లకు వెళ్లిపోయి మరుసటి రోజు వచ్చి కూలి కోసం ఎదురుచూస్తున్నారు.  డైలీ రూ. 6 వందల నుంచి 8 వందల వరకు కూలి మాట్లాడుకుని తీసుకెళ్తున్నారు. లేబర్​కావాల్సిన వాళ్లు అడ్డాల వద్దకు వెళ్లి కూలీలను ఎంగేజ్​చేసుకుని తీస్కేళ్తుంటారు.  కొత్త ఇండ్లు, భవన నిర్మాణాల్లో మెటీరియల్​​మోసేందుకు, మేస్త్రీ,  పెయింటింగ్,​ సామగ్రి షిఫ్టింగ్, క్లీనింగ్, ఇసుక లారీల్లో లోడ్​నింపడం, ఇటుక మోయడం తదితర పనులకు లేబర్​ను తీసుకెళ్తుంటారు. సిటీలో దాదాపు 180పైగా లేబర్​అడ్డాలు ఉన్నాయి. దాదాపు 50వేల మందిపైగా లేబర్​ఉన్నట్లు అధికారుల అంచనా. అయితే అడ్డా కూలీల సంక్షేమానికి గతంలో జీహెచ్ఎంసీ లేబర్​రూమ్​లను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించింది. ఇప్పటికీ పూర్తిస్థాయిలో అమలు కావడం లేదు. 

సొంతూళ్ల నుంచి తిరిగొస్తుండగా..

సిటీ చుట్టుపక్కల జిల్లాలైన నల్లొండ, వరంగల్​, రంగారెడ్డి, మహబూబ్​నగర్​, మెదక్​ జిల్లాల నుంచే కాక నిజామాబాద్​, కరీంనగర్​ నుంచి కూలీ పనులు చేసుకునేందుకు కుటుంబాలతో సిటీకి వస్తారు.  కరోనా ఎఫెక్ట్​తో దాదాపు ఏడాదిన్నర పాటు సొంతూళ్లకు వెళ్లిన లేబర్​ఇప్పుడిప్పుడే వస్తుండగా అడ్డాలపై ఎక్కువగా ఉంటున్నారు. సిటీలో ఏదో ఒక పనిదొరుకుతుందని వచ్చిన వాళ్లు తిరిగి ఊళ్లకు పోలేక ఇక్కడే ఉండిపోతు న్నారు.  బస్తీల్లో, రోడ్ల పక్కన చిన్న పూరి గుడిసెలను అద్దెకు తీసుకుని ఉంటున్నారు.  పొద్దున అడ్డావద్దకు వెళ్తే  పని దొరికితే రోజు గడుస్తుందని, లేదంటే పస్తులు ఉండక తప్పదని చాలామంది కూలీలు ఆవేదనతో చెప్పారు. 

పొద్దుగాల వచ్చి ఎదురు చూస్తూ..

పొద్దుగాల అడ్డాల మీదకు పోయి పని కోసం ఎదురు చూస్తుంటారు. చిక్కడపల్లి, అంబర్​పేట్, కాచిగూడ, రామాంతపూర్, ఉప్పల్, బోడుప్పల్, బొగ్గుల కుంట, హయత్​నగర్, ఎల్​బీనగర్, ​కింగ్​కోఠి, అశోక్​నగర్​, హిమాయత్​నగర్​, సికింద్రాబాద్​, నాంపల్లి, సైదాబాద్​, ఓల్డ్​సిటీ, మియాపూర్, యూసుఫ్​గూడ, టోలిచౌకీ,  లంగర్​హౌజ్​, బోరబండ, మూసాపేట్​, కూకట్​పల్లి, హైటెక్​సిటీ, మెహిదీపట్నంలో  లేబర్​అడ్డాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతిరోజు వేలాదిమంది కూలీలు పనుల కోసం వచ్చి ఎదురు చూస్తుంటారు. 

లేబర్​రూమ్​లు ఎక్కడ..? 

సిటీలో అడ్డాలపై లేబర్లు ఎక్కువ కావడంతో ప్రతిరోజూ చాలా మందికి పని దొరకంలేదు. దొరికిన నాడు వచ్చిన పైసలతో కుటుంబాలను పోషించుకుంటున్నారు. అడ్డా కూలీల కూలీల సంక్షేమానికి బల్దియా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. అడ్డాలపై  లేబర్లు ఎదురు చూడకుండా సమీపంలో గదులను ఏర్పాటు చేస్తామని గతంలోనే అధికారులు చెప్పారు. ఆ హామీ ఇంత వరకు నెరవేరలేదని కూలీల నాయకులు  వాపోతున్నారు. పనులు దొరకని వాళ్లు నిరాశగా ఇంటికి వెళ్తున్నారు. కనీసం వాళ్ల కోసం రూ.5 భోజనం అయినా అడ్డాల వద్ద పెట్టాలని కోరుతున్నారు.

పార్టీలకు కార్యకర్తల్లాగా.. 

 అడ్డాల మీద కూలీలు పార్టీల కార్యకర్తల్లా కూడా పనికి పోతున్నరు. ధర్నాలు, నిరసనలు మీటింగ్​లకు డబ్బులిచ్చి నాయకులు తీసుకపోతున్నరు. పార్టీకి అనుకూలంగా జై కొట్టిస్తున్నరు. ఇందిరాపార్కు వద్ద ధర్నాల్లో పార్టీల తరఫున కనిపించే కార్యకర్తలంతా చాలావరకు అడ్డామీద కూలీలే.  గతేడాది బల్దియా ఎన్నికల్లో పది పదిహేను రోజులు తిండికి తిప్పలు రాలేదని డబ్బులు కూడా బాగానే ఇచ్చారని ఓ కూలీ చెప్పాడు.  ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికలు రావడంతో తమకు పని ఉంటదా? లేదా? అని పలువురు కూలీలు అడిగారు.

డైలీ దొరకట్లేదు

పట్నానికి వచ్చి ఎనిమిదేండ్లు అయింది. డైలీ పని దొరకడం కష్టంగా మారింది.  మా అడ్డా మీద  రెండొందల మంది కూలీలు ఉంటే రోజుకు యాభై మంది దాకా పనిదొరక్క తిరిగి ఇంటికి పోతున్నరు. మరుసటి రోజు మళ్లీ అడ్డా మీదకు వస్తున్నరు. 

‑ నాగరాజు మద్దెలబీడు, నారాయణపేట జిల్లా 

వంతులు వేసుకుని పనికి పోతున్నం

పొద్దున్నే అడ్డాకు వస్తున్నం. కూలీలు ఎక్కువగా ఉండడంతో పనికి తీసుకుపోయేటోళ్లు తక్కువ కూలి ఇస్తమని బేరమాడుతున్నరు. పనిదొరికితే చాలని ఎంత ఇచ్చినా పోతున్నం. దొరకనోళ్లకు మరుసటి రోజు అవకాశం ఇస్తున్నం. పనిలేని పరిస్థితి రావొద్దనుకుని వంతులు వేసుకుని పోతున్నం.

‑ నారాయణ, మహబూబాబాద్