మధ్యప్రదేశ్‌ బోర్డర్‌‌లో టెన్షన్‌

మధ్యప్రదేశ్‌ బోర్డర్‌‌లో టెన్షన్‌
  • పోలీసులపై రాళ్లు రువ్విన వలస కూలీలు
  • రాష్ట్రంలోకి రానివ్వడం లేదని ఆరోపణలు

భోపాల్‌: మహారాష్ట్ర – మధ్యప్రదేశ్‌ బోర్డర్‌‌లో టెన్షన్‌ నెలకొంది. తమను రాష్ట్రంలోకి రానివడం లేదని, కనీసం తిండి కూడా అందించడం లేదని నేషనల్‌ హైవే 3పైన వలస కూలీలు ఆందోళనకు దిగారు. అక్కడి పోలీసులపై రాళ్లు రువ్వారు. కూలీలు పెద్ద ఎత్తున గుమిగూడిన వీడియోలు, ఫొటోలు లోకల్‌ మీడియాలో ప్రసారమయ్యాయి. “ చిన్న పిల్లలతో మేం ఇక్కడకు వచ్చాం. మహారాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని ఇక్కడ వరకు పంపించింది. కానీ ఎంపీ ప్రభుత్వం మాకు సాయం చేయడం లేదు. తిండి కూడా ఇవ్వడం లేదు. రాత్రి నుంచి ఇక్కడే పడి ఉన్నాం” అని పుణె నుంచి వచ్చిన శైలేష్​ త్రిపాఠి అనే వ్యక్తి చెప్పారు. దీనిపై కలెక్టర్‌‌ అమిత్‌ తోమర్‌‌ స్పందించారు. బస్సులు వెళ్లిపోయిన తర్వాత కొంత మంది వలస కూలీలు ఇక్కడికి చేరుకున్నారని, వారిని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. వలస కూలీలు పోలీసులపై రాళ్లు విసిరి గొడవ చేశారని, వాళ్లతో మాట్లాడి ట్రాన్స్‌పోర్ట్‌ ఏర్పాటు చేస్తామని నచ్చజెప్పామని అన్నారు. బయట రాష్ట్రాల నుంచి వస్తున్న కూలీలకు అన్ని సౌకర్యాలు కప్పిస్తున్నామని అధికారులు చెప్పారు. ఈ నెల 3న కూడా మహారాష్ట్ర – మధ్యప్రదేశ్‌ సరిహద్దుల్లో కొంత మంది వలస కూలీలు పోలీసులపై దాడికి దిగారు.