సైనిక స్థావరాలే లక్ష్యం.. 15 ప్రాంతాలను టార్గెట్ చేసిన పాక్.. డ్రోన్లు, క్షిపణులను తిప్పికొట్టిన భారత్

సైనిక స్థావరాలే లక్ష్యం.. 15  ప్రాంతాలను టార్గెట్ చేసిన పాక్..  డ్రోన్లు, క్షిపణులను తిప్పికొట్టిన భారత్

= బదులుగా లహోర్ పై భారత్ అటాక్

= లాహోర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టం ధ్వంసం

= చైనా హెచ్ క్యూ9 వాడుతున్న పాక్

ఢిల్లీ/జైపూర్/అమృత్ సర్:  ఆపరేషన్ సిందూర్ కు జవాబు చెప్పేందుకు పాకిస్తాన్ చేసిన ప్రయత్నం విఫలమైంది. సైనిక స్థావరాలే లక్ష్యంగా దేశంలోని 15 నగరాలపై దాడులకు ఉపక్రమించగా భారత సైన్యం తిప్పికొట్టింది. పాకిస్తాన్ ప్రయోగించిన డ్రోన్లు, క్షిపణులను మన మిలిటరీ నిర్వీర్యం చేసింది. 

అవంతిపురా నుండి భుజ్ వరకు జరిగిన దాడులను అధునాతన యాంటీ-యూఏవీ, క్షిపణి రక్షణ వ్యవస్థలను ఉపయోగించి సమర్థవంతంగా తిప్పికొట్టారని, భారత గడ్డపై ఎటువంటి నష్టం లేదా ప్రాణనష్టం జరగకుండా చూశామని ఆర్మీ ప్రకటించింది.  ఎస్-400 వైమానిక రక్షణ వ్యవస్థ ద్వారా అన్ని డ్రోన్లు, క్షిపణులను నిర్వీర్యం చేసినట్టు తెలిపింది. 

పాక్ టార్గెట్ చేసిన ప్రాంతాలు ఇవే

  • అవంతిపుర
  • శ్రీనగర్
  • జమ్మూ
  • పఠాన్‌కోట్
  • అమృత్సర్
  • కపుర్తలా
  • జలంధర్
  • లూధియానా
  • ఆదంపూర్
  • భటిండా
  • చండీగఢ్
  • నల్
  • ఫలోడి
  • ఉత్తర్లై
  • భుజ్

చైనా హెచ్ క్యూ9 వాడుతున్న పాక్

చైనాకు చెందిన హెచ్‌క్యూ-9 రక్షణ వ్యవస్థలను ఉపయోగిస్తున్న పాకిస్థాన్‌.. భారత్‌లోని సరిహద్దు రాష్ట్రాల్లో డ్రోన్లు, క్షిపణి దాడులకు యత్నించింది. అవంతిపుర, శ్రీనగర్‌, జమ్మూ, పఠాన్‌కోట్‌, అమృత్‌సర్‌, కపుర్తలా, జలంధర్‌, అదామ్‌పుర్‌, భఠిండా, చండీగఢ్‌, నాల్‌, ఫలోడి, భుజ్‌ తదితర ప్రాంతాల్లోని సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకునేందుకు యత్నించింది. 

అయితే.. వీటిని ఇంటిగ్రేటెడ్‌ కౌంటర్‌ యూఏఎస్‌ గ్రిడ్‌, గగనతల రక్షణ వ్యవస్థలతో సమర్థంగా అడ్డుకున్నట్లు రక్షణశాఖ వెల్లడించింది. పాకిస్థాన్‌ దాడులకు రుజువుగా వీటి శకలాలను ఆయా ప్రాంతాల నుంచి సేకరిస్తున్నట్లు తెలిపింది.

లాహోర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టం ధ్వంసం

పాకిస్తాన్ కు భారత్ కూడా గట్టిగానే  జవాబు చెప్పింది. ప్రతీకార దాడులకు దిగింది.  పాకిస్థాన్‌లో వివిధ ప్రాంతాల్లో ఉన్న గగనతల రక్షణ రాడార్‌లు, వ్యవస్థలను లక్ష్యంగా చేసుకొని విరుచుకుపడింది. ఈ క్రమంలోనే లాహోర్‌లోని ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థ ధ్వంసం అయ్యిందని సమాచారం.  మరోవైపు నియంత్రణ రేఖ వెంట కాల్పుల విరమణ ఉల్లంఘిస్తూ పాకిస్థాన్‌ దాడులను ముమ్మరం చేసింది. జమ్మూ కశ్మీర్‌లోని రాజౌరీ, మెంధార్‌, పూంచ్‌, ఉరి, బారాముల్లా, కుప్వారా ప్రాంతాల్లో  మెర్టార్లు, భారీ ఫిరంగులతో దాడులుచేస్తోంది. దీనికి భారత్ దీటైన సమాధానం చెబుతోంది. 

ఎల్వోసీ వద్ద కాల్పులు

లైన్ ఆఫ్ కంట్రోల్ వెంబడి పాకిస్తాన్ కాల్పలు జరుపుతోంది.  జమ్మూ కాశ్మీర్‌లోని అనేక ప్రాంతాల్లో మోర్టార్లు, భారీ క్యాలిబర్ ఫిరంగిని మోహరించింది. పాక్ లక్ష్యంగా చేసుకున్న ప్రాంతాలలో కుప్వారా, బారాముల్లా, ఉరి, పూంచ్, మెంధార్, రాజౌరి ఉన్నాయి. పాకిస్తాన్ సైన్యానికి ఎల్వోసీ వద్ద దీటైన సమాధానం చెబుతున్నాయి భారత సేనలు.  

పాకిస్తాన్ కాల్పుల కారణంగా ముగ్గురు మహిళలు మరియు ఐదుగురు పిల్లలు సహా పదహారు అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఇక్కడ కూడా, పాకిస్తాన్ నుంచి మోర్టార్, ఆర్టిలరీ కాల్పులను ఆపడానికి భారతదేశం స్పందించింది.