ఖతార్లో కూలిన సైనిక హెలికాప్టర్.. ఏడుగురు మృతి.. వారిలో ముగ్గురు తుర్కియే పౌరులు

ఖతార్లో కూలిన సైనిక హెలికాప్టర్.. ఏడుగురు మృతి.. వారిలో ముగ్గురు తుర్కియే పౌరులు

దోహా: ఇరాన్​దాడులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఖతార్ లో మరో ఘోరం జరిగింది. ఆదివారం హెలికాప్టర్ ప్రమాదంలో ఏడుగురు మరణించారు. వీరిలో ముగ్గురు తుర్కియే పౌరులు కూడా ఉన్నారు. ఈ విషయాన్ని అక్కడి అధికారులు ధృవీకరించారు. మరణించిన వారిలో నలుగురు ఖతార్ సాయుధ దళాలకు చెందిన వారు కాగా, ఒకరు ఖతార్–టర్కీ జాయింట్ ఫోర్స్ అధికారి, మరో ఇద్దరు తుర్కియే రక్షణ సంస్థ ‘అసెల్సన్’కు చెందిన టెక్నీషియన్లు ఉన్నారు. ఈ ప్రమాదానికి సాంకేతిక లోపమే కారణమని ఖతార్, తుర్కియే రక్షణ మంత్రిత్వ శాఖలు వెల్లడించాయి. ఈ ప్రమాదం వెనుక ఎలాంటి శత్రు దేశాల దాడుల సంకేతాలు లేవని ప్రాథమికంగా నిర్ధారించాయి. 

ఖతార్​పై ఇరాన్ ​దాడులు

ఫిబ్రవరి 28 నుంచి ఇరాన్‌‌‌‌‌‌‌‌పై అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఖతార్‌‌‌‌‌‌‌‌పై ఇరాన్ ​దాడులు చేపడుతోంది. ఈ వారంలో ఖతార్‌‌‌‌‌‌‌‌లోని ప్రధాన సహజ వాయువు కేంద్రమైన ‘రాస్ లాఫాన్’ పారిశ్రామిక నగరంపై ఇరాన్ జరిపిన దాడులతో భారీ నష్టం వాటిల్లింది. ఇరాన్ దాడుల వల్ల ఖతార్ లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (ఎల్ఎన్​జీ) ఎగుమతి సామర్థ్యం 17% తగ్గిపోయింది. ఫలితంగా ఏడాదికి సుమారు 20 బిలియన్ డాలర్ల ఆదాయ నష్టం వాటిల్లిందని ఖతార్ ఎనర్జీ సీఈఓ సాద్ అల్-కాబీ తెలిపారు.