మిల్లర్లకు మరో చాన్స్.. టెండర్ ప్యాడీ బకాయిలు కట్టేందుకు అక్టోబర్ 31 వరకు గడువిచ్చిన సర్కార్

మిల్లర్లకు మరో చాన్స్.. టెండర్ ప్యాడీ బకాయిలు కట్టేందుకు అక్టోబర్ 31 వరకు గడువిచ్చిన సర్కార్
  • టన్నుకు రూ. 24,419తో పాటు 25 శాతం పెనాల్టీ, 12 శాతం వడ్డీ 
  • మూడు వాయిదాల్లో చెల్లించాలని ఆదేశాలు

యాదాద్రి/జనగామ, వెలుగు :  టెండర్​ప్యాడీ డబ్బు చెల్లింపులో మొండిగా వ్యవహరిస్తున్న మిల్లర్లకు సివిల్​సప్లై శాఖ ​మరో అవకాశం ఇచ్చింది. పెనాల్టీతో పాటు వడ్డీ కలిపి అక్టోబర్​ 31లోగా మూడు వాయిదాల్లో చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది.

పెండింగ్ లో 15.94 లక్షల టన్నుల వడ్ల డబ్బులు

2022-=23 యాసంగి సీజన్​లో సీఎంఆర్​కోసం రాష్ట్రంలోని 1,963 మిల్లులకు 38.01 లక్షల టన్నుల వడ్లను ప్రభుత్వం అప్పగించింది. ఏండ్లు గడిచినా మిల్లర్లు వడ్లు అప్పగించకపోవడంతో అప్పటి బీఆర్​ఎస్​ సర్కార్.. టెండర్లు పిలిచింది. ఈ ప్రక్రియలో పాల్గొన్న సంస్థలు క్వింటాల్​కు రూ. 1700 చొప్పునే కోట్​చేశాయి. రైతులకు చెల్లించిన డబ్బు కంటే తక్కువ కోట్ చేయడంతో ప్రభుత్వం ఆ టెండర్లను రద్దు చేసింది. 

2024 ఫిబ్రవరిలో మరోసారి టెండర్లు పిలిచింది. గతంలో పాల్గొన్న సంస్థలే క్వింటాల్​కు రూ. 2 వేల చొప్పున కోట్​ చేయడంతో ప్రభుత్వం ఓకే చెప్పింది. టెండర్లు దక్కించుకున్న సంస్థలు మిల్లుల నుంచి 18.95 లక్షల టన్నుల వడ్లు సేకరించి చివరకు చేతులెత్తేయగా.. మరో 19.05 లక్షల టన్నుల వడ్లు మిల్లుల్లోనే ఉండిపోయాయి. ఈ క్రమంలో టన్నుకు రూ. 24,419 చొప్పున ఆగస్ట్ 8 వరకు మొత్తం డబ్బులు చెల్లించాలని సివిల్ సప్లై డిపార్ట్ మెంట్ గడువు ఇచ్చింది. 

దీంతో మొత్తం 22 లక్షల టన్నుల వడ్లకు సంబంధించిన అమౌంట్​ప్రభుత్వానికి అందగా.. మరో 15.94 లక్షల టన్నుల వడ్ల డబ్బులు మిల్లర్ల వద్ద పెండింగ్ లో ఉన్నాయి. దీంతో ఓ వైపు సివిల్ సప్లై, మరో వైపు విజిలెన్స్, స్టేట్​టాస్క్​ఫోర్స్​ఆఫీసర్లు దాడులు చేస్తూ మిల్లర్లపై కేసులు నమోదు చేశారు.

25 శాతం పెనాల్టీ, 12 శాతం వడ్డీ

గడువు ముగిసినా కొందరు మిల్లర్లు డబ్బులు చెల్లించకపోవడంతో వారికి మరో అవకాశం ఇవ్వాలని సివిల్ సప్లై ఆఫీసర్లు నిర్ణయించారు. ఇందులో భాగంగా టన్నుకు రూ. 24,419, 25 శాతం పెనాల్టీతో పాటు 12 శాతం వడ్డీ కలుపుకొని మూడు వాయిదాల్లో చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. టన్నుకు రూ. 24,419 చొప్పున మొత్తం రూ. 3,892.38 కోట్లు రావాల్సి ఉంది. 

ఈ మొత్తానికి పెనాల్టీ, వడ్డీ అదనం. పెనాల్టీ, వడ్డీ కలిపి మొత్తం బకాయిలో 50 శాతాన్ని ఈ నెల 31లోగా, మరో 25 శాతాన్ని సెప్టెంబర్​ 30లోగా, మిగిలిన మొత్తాన్ని అక్టోబర్​ 31లోగా చెల్లించాలని ఆదేశాల్లో పేర్కొంది. అక్టోబర్ 31లోగా మొత్తం డబ్బులు చెల్లించకపోతే మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని సివిల్​సప్లై ఆఫీసర్లు హెచ్చరించారు. క్రిమినల్​ కేసులు నమోదు చేయడంతో పాటు రెవెన్యూ రికవరీ యాక్ట్​ నమోదు చేస్తామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.