ప్రభుత్వ గోడౌన్లలో మిల్లర్ల వడ్లు..  ఖాళీగా లేని గోడౌన్లు.. రైతులకు తప్పని బాధలు

ప్రభుత్వ గోడౌన్లలో మిల్లర్ల వడ్లు..  ఖాళీగా లేని గోడౌన్లు.. రైతులకు తప్పని బాధలు

 

  • వానాకాలం సన్న వడ్లు కొని గోడౌన్లలో నిల్వ చేసిన మిల్లర్లు
  •     యాసంగి వడ్ల బస్తాలు నిల్వ చేద్దామంటే అన్నీ  ఫుల్‌‌‌‌
  •     వడ్ల కొనుగోళ్లను స్పీడప్‌‌‌‌ చేయాలని ఇటీవల మంత్రి గంగుల ఆదేశం
  •     ప్రభుత్వ గోడౌన్లలో వడ్లు నిల్వ చేయాలని ఆర్డర్స్‌‌‌‌
  •     ఖాళీగా లేని గోడౌన్లు.. రైతులకు తప్పని బాధలు


 జయశంకర్‌‌‌‌ భూపాలపల్లి, వెలుగు:  రాష్ట్రంలో 330 వ్యవసాయ అనుబంధ గోడౌన్లు ఉన్నాయి.  వీటి కెపాసిటీ 17.07 లక్షల మెట్రిక్‌‌‌‌ టన్నులు. రైతులు తమ పంట ఉత్పత్తులు నిల్వ చేసుకునేందుకు నాబార్డు సహకారంతో  వ్యవసాయ శాఖ నిధుల ద్వారా వేల కోట్లు ఖర్చు చేసి వీటిని నిర్మించారు.  కానీ వీటిని రైతులకు ఇవ్వట్లేదు.  కనీసం ప్రభుత్వం కొన్న యాసంగి వడ్ల బస్తాలను నిల్వ చేయడానికి కూడా ఇవి అక్కరకు రావట్లేదు. వడ్ల కొనుగోళ్లను స్పీడప్‌‌‌‌ చేయాలని ఇటీవల సివిల్‌‌‌‌ సప్లై శాఖ మంత్రి గంగుల కమలాకర్‌‌‌‌ ఆదేశించారు.  రాష్ట్రస్థాయిలో సివిల్‌‌‌‌ సప్లై, మార్కెటింగ్‌‌‌‌ శాఖ ఆఫీసర్లతో పాటు ఆయా జిల్లాల కలెక్టర్లు, జాయింట్‌‌‌‌ కలెక్టర్లు, అడిషనల్‌‌‌‌ కలెక్టర్లతో  వీడియో కాన్ఫరెన్స్‌‌‌‌ నిర్వహించి మరీ ఆదేశించారు.  వడ్ల బస్తాలను దింపుకోవడంలో  రైస్‌‌‌‌ మిల్లుల వద్ద లేటవుతోందని, దీనివల్ల రైతులకు నష్టం జరగడంతో పాటు సర్కారుపై విమర్శలు వస్తున్నాయని మంత్రి తెలిపారు. ఈ సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం కొన్న వడ్లను వెంటనే గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ గోడౌన్లలో ,  రైతు వేదికల్లో నిల్వ చేయాలని ఆర్డర్స్‌‌‌‌ పాస్‌‌‌‌  చేశారు. ఇది జరిగి వారం రోజులు అవుతున్నా గోడౌన్లకు వడ్ల బస్తాలు పంపించడం లేదు. అవి ఖాళీగా లేవని ఆఫీసర్లు 
చెబ్తున్నారు.

ప్రభుత్వ గోడౌన్ల పై  మిల్లర్ల పెత్తనం

ప్రభుత్వ గోడౌన్లలో మెజారిటీ గోడౌన్లు రైస్‌‌‌‌ మిల్లర్ల చేతుల్లోనే ఉన్నాయి.  వానాకాలంలో  పండిన సన్న వడ్లను కొని ఈ గోడౌన్లలో మిల్లర్లు నిల్వ చేసుకున్నారు.  ఇటీవల రాష్ట్రంలోని ఆయా జిల్లాలోని పలు గోడౌన్లను ‘వీ6 వెలుగు’  రిపోర్టర్లు పరిశీలించగా ఈ విషయం బయటపడింది.  తమ లాభార్జన కోసం కొన్న సన్న వడ్లను ఇక్కడ నిల్వ చేసుకొని రేట్లు పెరిగిన తర్వాత బియ్యంగా మార్చి అమ్ముకునే  ఏర్పాట్లు చేసుకున్నారు.  వీరికి వ్యవసాయ మార్కెటింగ్‌‌‌‌ శాఖ ఆఫీసర్లు తమ వంతు సహకారం అందిస్తున్నారు. రైతుల సంక్షేమం కోసం కట్టిన ప్రభుత్వ గోడౌన్లు రైస్‌‌‌‌ మిల్లర్ల సొంతానికి ఉపయోగపడుతున్నాయి. 

కొనుగోళ్ల ముందు ఖాళీ చేయకపోవడంతో..

వాస్తవంగా అయితే యాసంగి వడ్ల కొనుగోళ్లు ప్రారంభమయ్యే  టైమ్​కు ప్రభుత్వ గోడౌన్లన్నీంటిని సర్కారే ఖాళీ చేయించాలి. అకాల వర్షాలు, వడగల్ల వానలతో తడిసిన వడ్ల బస్తాలను ప్రభుత్వం కొంటుందని ప్రచారం చేసుకుంటూ వస్తోంది. అలా తడిసిన వడ్ల బస్తాలను వెంటనే బాయిల్డ్‌‌‌‌ రైస్‌‌‌‌ మిల్లులకు పంపించవచ్చని  వ్యవసాయ రంగ నిపుణులు  చెబ్తున్నారు. తడ్వకుండా 17 శాతం తేమ లోపు ఉన్న వడ్ల బస్తాలను కొని వెంటనే వాటిని గోడౌన్లలో భద్రపరిస్తే వానలు తగ్గిన తర్వాత రైస్‌‌‌‌ మిల్లులకు పంపించే వీలుంటుందని అంటున్నారు. ఇలా చేస్తే మిల్లుల వద్ద తరుగు తీయడం వంటి సమస్యలు కూడా తగ్గించవచ్చంటున్నారు. సీజన్‌‌‌‌కు ముందుగానే ఆయా జిల్లాల కలెక్టర్లు, జేసీలు గోడౌన్ల విషయంపై సమీక్షించి చర్యలు తీసుకుంటే సరిపోతుందని రైతులు అంటున్నారు. గతంలో ఇలాంటి సమస్యలే వచ్చినప్పుడు గోడౌన్లు సరిపోక పోతే ప్రభుత్వ స్కూళ్లలో కూడా వడ్ల బస్తాలను నిల్వ చేసిన విషయాలను రైతులు గుర్తుచేస్తున్నారు. 

రైస్‌‌‌‌ మిల్లుల దగ్గర వెయిటింగ్‌‌‌‌

ప్రభుత్వ వడ్ల కొనుగోలు కేంద్రాల్లో రోజుకు సుమారు ఐదారు లారీల వడ్ల బస్తాలను సర్కారు కొంటోంది. రైస్‌‌‌‌ మిల్లులకు మాత్రం రెండు, మూడు రోజులకొక లారీ సరుకు పోతోంది. అలా పోయిన లారీలు, డీసీఎం వ్యాన్లు, ట్రాక్టర్లు రైస్‌‌‌‌ మిల్లు దగ్గరే మూడు, నాలుగు రోజుల పాటు వెయిటింగ్‌‌‌‌లో ఉంటున్నాయి. వడ్ల బస్తాలు అన్​ లోడ్​ కాకుండా అలాగే అక్కడే క్యూలో ఉంటున్నాయి. దీంతో ఒక రోజు కిరాయి సర్కారు భరిస్తుంటే ఇతర రెండు, మూడు రోజుల కిరాయిలను రైతులే భరిస్తున్నారు. బస్తాకు 20, 30 చొప్పున అదనంగా వసూలు చేసుకొని లారీ కిరాయి కింద డబ్బులు కడ్తున్నారు. వెహికిల్స్‌‌‌‌ అన్నీ మిల్లుల దగ్గరే వెయిటింగ్‌‌‌‌లో ఉండడంతో లారీల కోసం రైతులు రోడ్డెక్కి ధర్నాలు, రాస్తారోకోలు చేయాల్సిన పరిస్థితి దాపురించింది.

భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లిలో  నిర్మించిన ఆధునిక వ్యవసాయ మార్కెట్ గోడౌన్​ ఇది.  2014‒-15లో నాబార్డ్​ నిధులు..   కోటి 50 లక్షల రూపాయలతో   నిర్మించారు.  దీని కెపాసిటీ 2500 మెట్రిక్ టన్నులు కాగా 2018లో నిర్మాణం పూర్తయ్యింది.  ప్రస్తుతం ఈ గోడౌన్​ ఖాళీగా లేదు.  మొగుళ్లపల్లి గ్రామ శివారులోని సువర్ణ  ఇండస్ట్రీస్ మిల్లుకు రెండు నెలల నుంచి లీజుకు ఇచ్చినట్లు సంబంధిత మార్కెట్ శాఖ ఆఫీసర్లు చెప్పారు. నెలకు రూ.40,273 చొప్పున ఇండస్ట్రీస్ వాళ్లు  మార్కెటింగ్ శాఖకు చెల్లిస్తున్నారు.   ప్రస్తుతం మిల్లర్‌‌‌‌ వడ్ల బస్తాలతో ఈ గోడౌన్‌‌‌‌ నిండిపోయింది.
 హనుమకొండ జిల్లా శాయంపేటలోని మార్కెటింగ్‌‌‌‌ శాఖ గోడౌన్‌‌‌‌ ఇది. ఇక్కడ 10 వేల వరకు వడ్ల బస్తాలు నిల్వ  చేయవచ్చు. ప్రతీ యేటా వానాకాలం, యాసంగి ప్రభుత్వ వడ్ల కొనుగోళ్ల సెంటర్‌‌‌‌ను ఇక్కడే నిర్వహిస్తారు. గతంలో ప్రభుత్వం ద్వారా వడ్లను కొఈన్న తర్వాత బస్తాలను కాంటా వేసి వాటిని ఇదే గోడౌన్‌‌‌‌లో నిల్వ చేసేవారు.  సీజన్‌‌‌‌ అంతా అయిపోయిన తర్వాత రైస్‌‌‌‌ మిల్లులకు వడ్ల బస్తాలను పంపేవాళ్లు. ఇప్పుడు ఈ గోడౌన్‌‌‌‌లో ఓ రైస్‌‌‌‌ మిల్లర్‌‌‌‌కు చెందిన వడ్ల బస్తాలు నిల్వ చేసి ఉన్నాయి. ఇదే కాకుండా పక్కనే ఉన్న మరో గోడౌన్‌‌‌‌ కలిపి రెండింటిని ఆయన రెంట్​తీసుకొని తన సొంత వడ్ల బస్తాలు నిల్వ చేసుకున్నారు.  దీంతో ఈ సెంటర్‌‌‌‌లో  కొన్న వడ్ల బస్తాలను రైస్‌‌‌‌ మిల్లుకు పంపించాలంటే వారానికి పైగా టైం పడుతోంది.

కోట్లు ఖర్చు చేసి కట్టి ఖాళీగా ఉంచిన్రు

ఏటూరునాగారంలో రూ.4.5 కోట్లతో కట్టిన రెండు గోడౌన్లు 8 నెలలుగా ఖాళీగా ఉంచుతున్నరు.. కోట్లు ఖర్చు చేసి కట్టిన గోడౌన్లలో కనీసం సర్కారు కొన్న వడ్ల బస్తాలను అయినా నింపవచ్చు. కానీ  ఆఫీసర్లు ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. గవర్నమెంట్‌‌‌‌ ఆఫీసర్లు స్థానికంగా లేకపోవడంతో  ఈ గోడౌన్లను ఎవరూ పట్టించుకుంటలేరు.
 ‒ గడబోయిన శ్రీకాంత్,  రాంనగర్ రైతు,  ములుగు జిల్లా