వరల్డ్ ఫుడ్ ఇండియా ఎక్స్​పోలో.. మిల్లెట్ మ్యాన్​ ఆఫ్​ తెలంగాణ

వరల్డ్ ఫుడ్ ఇండియా ఎక్స్​పోలో.. మిల్లెట్ మ్యాన్​ ఆఫ్​ తెలంగాణ

న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీలోని ప్రగతి మైదాన్ లో నిర్వహించిన వరల్డ్ ఫుడ్ ఇండియా–2023లో ‘మిల్లెట్ మ్యాన్ ఆఫ్ తెలంగాణ’ బీర్ శెట్టి పటేల్ స్పెషల్ అట్రాక్షన్​గా నిలిచారు. మిల్లెట్స్, వాటితో తయారు చేసిన ఫుడ్ అందరి దృష్టిని ఆకర్శించింది. మిల్లెట్స్ ప్రాధాన్యత తెలిపేలా ఫుడ్ ప్రాసెసింగ్ మినిస్ట్రీ ఈ నెల 3 నుంచి 5వ తేదీ దాకా ఈ ఎక్స్ పో నిర్వహించింది. మిల్లెట్స్ వెరైటీలు, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రాసెసింగ్ మిషనరీని ఇక్కడ ప్రదర్శించారు. ఇందులో భాగంగా సంగారెడ్డి జిల్లా గంగాపురానికి చెందిన బీర్ శెట్టి.. తన మిల్లెట్ ప్రొడక్ట్స్​తో స్టాల్ ఏర్పాటు చేశారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘‘భవానీ ఫుడ్ పేరిట మిల్లెట్ ప్రొడక్ట్స్ తయారు చేస్తున్న. ఢిల్లీ తెలంగాణ భవన్, ముంబైతో పాటు ఇతర రాష్ట్రాల్లో మంచి గిరాకీ ఉంది. మిల్లెట్స్ నా పొలంలోనే పండిస్తున్న. హైదరాబాద్ బీరంగూడలో మిల్లెట్ వ్యాల్యూ యాడిషన్, చిరుధాన్యాల ప్రాసెస్ యూనిట్​ను పెట్టాను. మిల్లెట్ సీడ్స్, విత్తనం నుండి భోజనం దాకా మహిళా సంఘాలకు, ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ, రైతు సంఘాలకు ట్రైనింగ్ ఇస్తున్నాను. 

రైతుల దగ్గర నుంచి బై బ్యాక్ కొంటున్న. వ్యాల్యూ యాడిషన్ తయారీ, మార్కెటింగ్ విధానాలపై అవగాహన కల్పిస్తున్న”అని బీర్​శెట్టి పటేల్ తెలిపారు. మిల్లెట్స్ ఉత్పత్తిలో 2008 నుంచి ఇప్పటి దాకా ఎనిమిది జాతీయ స్థాయి అవార్డులు పొందినట్లు తెలిపారు. ఫార్మర్ అవార్డు, బెస్ట్ మిల్లెట్ మిషనరీ అవార్డు, రైతు మిత్ర అవార్డు వంటి రాష్ట్ర స్థాయి పురస్కారాలు అందుకున్నట్లు వివరించారు. ప్రధానంగా మిల్లెట్స్ రంగంలో తాను చేస్తున్న కృషికి ‘‘మిల్లెట్ మ్యాన్ ఆఫ్ తెలంగాణ’’గా గుర్తింపు వచ్చిందన్నారు.