- చిరు ధాన్యాలతో రకరకాల వంటలు
కుమ్రంభీం జిల్లా: సంపూర్ణ ఆరోగ్యంపై అవగాహన కోసం చిరుధాన్యాల ఆహార పండుగ నిర్వహించారు. కాగజ్నగర్లోని సర్ సిల్క్ పార్క్ లో చిరుధాన్యాల నిర్వహించిన ఆహార పండుగ కార్యక్రమంలో గర్భిణీలు, బాలింతలు, తల్లులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వ్యాధి నిరోధకశక్తిని పెంపొందించి సంపూర్ణ ఆరోగ్యాన్ని కలిగించే చిరు ధాన్యాలతో ఎన్ని రకాల వంటలు చేసుకోవచ్చో తెలియజేసేలా వంటలు తయారు చేశారు.
బియ్యం, గోధుమలు కాకుండా మన పూర్వీకుల వలే కేవలం కొర్రలు, అండు కొర్రలు, సామెలు, ఊదలు, అరికెలతో గంజి, అంబలి, అన్నంతోపాటు.. కిచిడి, పలావ్, బిర్యానీ, పకోడి, కొర్రల ఇడ్లి, రాగులతో పకోడీ, రాగి లడ్డూ, రాగి జావ, సామలతో పాయసం, సామల పెరుగన్నం, కొర్రల పులి హోర, కొర్రల కిచిడి లాంటి వంటలు చేశారు. మన పూర్వీకులంతా కొర్రలు, అండు కొర్రలు, అరికెలు, సామెలు, ఊదలతోనే వంటలు చేసుకుని తినడం వల్ల జీవితాంతం ఎలాంటి రోగాలు లేకుండా సంపూర్ణ ఆరోగ్యంతో జీవించారని విపులంగా తెలియజేశారు.
సంపూర్ణ ఆరోగ్యం కావాలంటే.. ప్రతి ఒక్కరూ తమ రోజువారి ఆహారంలో చిరు ధాన్యాలను ఒక భాగం చేసుకుంటే చాలా మంచిదని.. తయారీ విధానం తెలుసుకుంటే వీటి రుచికి సాటి రాదని తెలియజేశారు. కనీసం ఒక్కపూటైనా చిరు ధాన్యాలతో వంట చేసుకుని తిని అలవాటు చేసుకోవాలని సూచించారు.
