రంగంలోకి హైకమాండ్​.. 29, 30 తేదీల్లో జిల్లాల్లో బీజేపీ జాతీయ నేతల పర్యటన

రంగంలోకి  హైకమాండ్​.. 29, 30 తేదీల్లో జిల్లాల్లో బీజేపీ జాతీయ నేతల పర్యటన
  • త్వరలో మండలాలకు రాష్ట్ర నాయకులు
  • వచ్చే నెల 7న హైదరాబాద్​లో మిలియన్​ మార్చ్​
  • కేసీఆర్​ సర్కార్​ వైఫల్యాలపై పోరాటానికి ప్రణాళిక

హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ హైకమాండ్​ సీరియస్​గా తీసుకుంది. జనంలోకి వెళ్లి కేసీఆర్​ సర్కార్​ ఫెయిల్యూర్స్​ను ఎండగట్టాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా జిల్లాల్లో పర్యటనకు జాతీయ నాయకులు, మండలాల్లో పర్యటనకు రాష్ట్ర నేతలు సిద్ధమవుతున్నారు. వచ్చే నెల 7న హైదరాబాద్​లో మిలియన్​ మార్చ్​ నిర్వహించనున్నారు. ఆదివారం ఖమ్మం సభకు కేంద్ర హోంమంత్రి అమిత్  షా హాజరై పార్టీ కేడర్​లో జోష్ నింపారు. ఇదే ఉత్సాహంతో జనంలోకి వెళ్లాలని, ఎన్నికలకు క్యాడర్​ను సమాయత్తం చేయాలని నాయకులు భావిస్తున్నారు. మిలియన్ మార్చ్​ను సక్సెస్​ చేయడం, ఓటరు నమోదు ప్రక్రియ పరిశీలించడం.

వంటి పలు అంశాలపై స్థానిక నేతలతో చర్చించేందుకు మంగళ, బుధవారం రెండు రోజులపాటు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్​చార్జులు తరుణ్ చుగ్, సునీల్ బన్సల్, కేంద్ర  మాజీ మంత్రి, బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్​చార్జ్​ ప్రకాశ్ జవదేకర్, పార్టీ సంస్థాగత జాతీయ కార్యదర్శి, రాష్ట్ర సహ ఇన్​చార్జ్​  అరవింద్ మీనన్  తమకు కేటాయించిన జిల్లాల్లో పర్యటించనున్నారు. మొత్తం నలుగురు జాతీయ నేతలకు ఒక్కొక్కరికి రెండు ఉమ్మడి జిల్లాల బాధ్యతలను అప్పగించారు. మెదక్, ఖమ్మంకు సునీల్ బన్సల్.. ఆదిలాబాద్, నిజామాబాద్ కు అరవింద్ మీనన్.. కరీంనగర్, నల్గొండకు తరుణ్ చుగ్.. మహబూబ్ నగర్, వరంగల్​కు ప్రకాశ్ జవదేకర్  వెళ్లనున్నారు. 

ఈ నలుగురి టీంలో రాష్ట్రానికి చెందిన నలుగురు ముఖ్య నేతలు కూడా ఉంటారు. వీరిలో కిషన్ రెడ్డి, బండి సంజయ్, డీకే అరుణ, ఈటల రాజేందర్  ఉన్నారు.త్వరలో మండలాల్లో పర్యటనమోదీ సర్కార్​ చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించేందుకు త్వరలోనే మండలాల్లో బీజేపీ రాష్ట్ర నేతలు పర్యటించనున్నారు. తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధులు, ఇక్కడ అమలవుతున్న కేంద్ర సంక్షేమ పథకాలపై జిల్లా, మండల స్థాయిలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో ప్రజలకు వివరించనున్నారు. 

సోమవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన దీనిపై పార్టీ నేతలతో సమావేశం జరిగింది. ఇందులో నేతలు ఇంద్రసేనా రెడ్డి, చంద్రవదన్, మల్లారెడ్డితో పాటు పలు జిల్లాల నేతలు పాల్గొన్నారు. ఇటీవల హైదరాబాద్ ఆర్టీసీ కళా మందిర్ లో కిషన్ రెడ్డి ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మాదిరిగానే ఇక నుంచి జిల్లాల్లో, మండలాల్లో ఇవ్వాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. అయితే ఎప్పటి నుంచి ప్రజల్లోకి వెళ్లాలనేది రెండు, మూడు రోజుల్లో ఖరారు చేయనున్నారు.