ప్రజా శ్రేయస్సే ధ్యేయంగా ముందుకెళ్లాలి

ప్రజా శ్రేయస్సే ధ్యేయంగా ముందుకెళ్లాలి

కెవాడియా: దేశ ఐక్యత విషయంలో బ్యూరోక్రాట్ల పాత్ర చాలా కీలకమని ప్రధాని మోడీ అన్నారు. సివిల్ సర్వెంట్స్ రాజ్యాంగ స్ఫూర్తి, దేశ ఐక్యతను కాపాడేలా సరైన నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. గుజరాత్, కెవాడియాలో నిర్వహించిన సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ 145వ జయంత్యుత్సవాల్లో మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సివిల్ సర్వెంట్స్ గురించి ఆయన పలు వ్యాఖ్యలు చేశారు.

‘ఇప్పుడు ప్రభుత్వంలో పని చేస్తున్న బ్యూరోక్రాట్లు పాలనపై బాగా ద‌ృష్టి పెడుతున్నారు. తక్కువ ప్రభుత్వ జోక్యంతో ఎక్కువ పాలన జరిగేలా చూస్తున్నారు. ప్రజలను ప్రభుత్వ పథకాలను స్వీకరించే వారిగానే చూడొద్దు. ‘జనతా జనార్దన’ అనే నినాదాన్ని ముందుకు తీసుకెళ్లాలి. బ్యూరోక్రాట్ల పాత్ర ప్రభుత్వంలో తక్కువగా, పాలనలో ఎక్కువగా ఉండాలి. పౌరుల జీవితాల్లో అధికారుల రోల్ చాలా తక్కువగా ఉండాలి. దేశ ప్రజలకు సేవ చేయడం అత్యుత్తమ విధి అని సర్దార్ సాహెబ్ అనేవారు. నేను కూడా అదే చెబుతున్నా. ప్రభుత్వ ఉద్యోగులు ఏ నిర్ణయం తీసుకున్నా.. అందులో జాతీయ దృక్పథం, దేశ ఐక్యత, సమగ్రతను బలోపేతం చేసే అంశాలు ఉండేలా చూసుకోవాలి. ఇదే మంత్రంగా ముందుకెళ్లాలి. మీరు పని చేసే చోటు చిన్నదైనా ప్రజా ఆసక్తులను మాత్రం దృష్టిలో పెట్టుకోవాలి’ అని మోడీ చెప్పారు.