ఆరావళి పర్వతాలకు మైనింగ్ ముప్పు.. గనుల తవ్వకం వల్ల మిగిలేది విధ్వంసమే

ఆరావళి పర్వతాలకు మైనింగ్ ముప్పు.. గనుల తవ్వకం వల్ల మిగిలేది విధ్వంసమే

దేశంలోనే అత్యంత ప్రాచీన పర్వత శ్రేణులలో ఆరావళి పర్వతాలు ఒకటి..ఉత్తర భారత దేశానికి సహజ రక్షణ కవచం. విచ్చలవిడి మైనింగ్ కారణంగా ఇప్పుడు ఆ పర్వతాల ఉనికి,చరిత్ర ప్రమాదంలో పడింది.  గుజరాత్ నుంచి రాజస్థాన్ మీదుగా ఢిల్లీ వరకు సుమారు 700 కిలోమీటర్ల మేర విస్తరించిన ఈ పర్వత శ్రేణిలో నిర్మాణ రంగానికి అవసరమైన రాళ్లు, ఖనిజాల కోసం జరుగుతున్న నిరంతర తవ్వకాలతో కొండలు క్రమంగా కరిగిపోతున్నాయి. గనుల తవ్వకాలు ఇలాగే కొనసాగితే ఉత్తర భారత దేశం ఎడారిలా మారే అవకాశం ఉందని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు పర్యావరణం, ప్రజల మనుగడపై తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు. 

ఆరావళి పర్వతాల్లో విచ్చలవిడి మైనింగ్ తో పర్యావరణం దెబ్బతిని నదులు ఎండిపోవడం, వ్యవసాయ భూములు బీడుగా మారడం, భూగర్భ జలాలు తగ్గిపోవడం వంటి సమస్యలు తీవ్రమయ్యాయని స్థానికులు గత కొంతకాలంగా స్థానికులు ఉద్యమాలు చేస్తున్నారు. ఆరావళి పర్వతాల్లో భారీఎత్తున గనుల తవ్వకాలతో రాజస్థాన్‌లోని అనేక గ్రామాల ప్రజలు జీవనోపాధిని కోల్పోతున్నారు. గనుల తవ్వకాలు, రాళ్ల నలగగొట్టే యంత్రాలతో ఎప్పుడూ దుమ్ము కమ్ముకుని ఉండటంతో ప్రజలు శ్వాసకోశ సంబంధిత వ్యాధులకు గురవుతున్నారు. సిలికోసిస్ వంటి ప్రాణాంతక వ్యాధులు పెరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

2024 చివర్లో  సుప్రీంకోర్టు ఆరావళి ప్రాంతంలో కొత్త మైనింగ్ లైసెన్సుల జారీపై నిషేధం విధించినప్పటికీ, అప్పటికే పరిస్థితి మరింత చేయి దాటిపోయిందని పర్యావరణవేత్తలు అంటున్నారు. అనేక గనులు చట్టబద్ధ పరిమితులను దాటి అక్రమ మైనింగ్ విస్తరించిందని వివిధ ఆడిట్ రిపోర్టులు చెబుతున్నాయి. 2025లో రాజస్థాన్‌లోని ఆరావళి ప్రాంతంలోనే వేల చదరపు కిలోమీటర్ల మేర మైనింగ్ కార్యకలాపాలు కొనసాగినట్టు ఓ న్యాయ నిపుణుల కమిటీ గుర్తించింది.

►ALSO READ | దీదీకి బిగ్ షాక్.. కీలక సమావేశానికి 60 మంది ఎమ్మెల్యేలు డుమ్మా..!

నిపుణుల అభిప్రాయం ప్రకారం..ఆరావళి పర్వతాలు థార్ ఎడారి నుంచి వచ్చే దుమ్ము తుఫాను, వడగాలులను అడ్డుకుని ఉత్తర భారత దేశానికి సహజ కవచంలా ఉన్నాయి.ఈ పర్వతాల క్షీణత ఇలాగే కొనసాగితే ఉత్తర భారతదేశంలో ఎడారిలా మారే ప్రమాదం ఉందంటున్నారు. గంగానది  మైదాన ప్రాంతాల్లో  వ్యవసాయంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

ఇప్పటికీ ఆరావళి పర్వాతాలు అనేక జీవజాతులకు అవాసంగా ఉన్నాయి. చిరుతపులులు, ఎలుగుబంట్లు, హైనాలు, జింకలు వంటి అరుదైన వన్యప్రాణులు జీవిస్తున్నాయి. అటు వన్య ప్రాణులను రక్షించేందుకు, ఇటు ఆరావళి పీఠ ప్రాంతంలో నివసించే గ్రామాలను రక్షించేందుకునేందుకు స్థానికులు ఉద్యమాలు చేస్తున్నారు. “గనుల తవ్వకం వల్ల మిగిలేది విధ్వంసమే” అని పర్యావరణ పరిరక్షణ కోసం పోరాటం కొనసాగిస్తున్నారు.