
- క్వాలిటీ ఫుడ్ అందించాలి
- ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్
హైదరాబాద్, వెలుగు: ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ గురుకులాల్లో మౌలిక వసతులను మెరుగు పరుస్తున్నట్టు ఆ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ప్రకటించారు. గురుకులాల్లో పిల్లల చదువు, క్వాలిటీ ఫుడ్ అందించే విషయంలో రాజీ పడబోమని ఆయన స్పష్టం చేశారు. సోమవారం సెక్రటేరియెట్ లో సీఎస్ రామకృష్ణారావుతో కలిసి ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ శాఖ ల సెక్రటరీలు, మూడు గురుకులాల సెక్రటరీలతో మంత్రి లక్ష్మణ్ రివ్యూ చేపట్టారు. డైట్ కాస్మోటిక్ చార్జీలు పెంచామని మంత్రి గుర్తు చేశారు.
రాష్ర్ట ప్రభుత్వం అమలు చేస్తున్న పలు స్కీమ్ లకు నిధులు ఇచ్చి కేంద్రం ఆదుకోవాల్సిన అవసరం ఉందని, ఇందుకు సంబంధించి సమగ్ర నివేదిక రెడీ చేశామని, త్వరలో ఢిల్లీ వెళ్లి కేంద్రానికి అందచేస్తామని మంత్రి తెలిపారు. గత పాలకులు ఢిల్లీ వెళ్లి నిధులు కోరకుండా నిర్లక్ష్యం చేశారని, దీంతో నిధులు రాక పలు స్కీమ్ లు అమలు కాలేదని చెప్పారు.