మా ప్రభుత్వంపై రాహుల్‌‌కు లేఖ రాయడమా..కేటీఆర్‌‌‌‌పై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఫైర్

మా ప్రభుత్వంపై రాహుల్‌‌కు లేఖ రాయడమా..కేటీఆర్‌‌‌‌పై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఫైర్

హైదరాబాద్, వెలుగు: పదేండ్ల పాటు అధికారాన్ని అడ్డంపెట్టుకొని తెలంగాణ ప్రజల రక్తాన్ని, చెమటను తాగిన కేసీఆర్, కేటీఆర్‌‌‌‌లకు ఇప్పుడు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై మాట్లాడే అర్హత లేదని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తీవ్రస్థాయిలో విమర్శించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి బీఆర్‌‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాసిన లేఖపై మంత్రి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన కేటీఆర్‌‌కు ఒక బహిరంగ లేఖ ద్వారా గట్టి కౌంటర్ ఇచ్చారు.

‘‘తెలంగాణలో ఎండల తీవ్రత నుంచి ఉపశమనం పొందేందుకు మలేసియా వెళ్లి హాయిగా సేదతీరి వచ్చిన తర్వాత.. మీరు రాహుల్ గాంధీకి రాసిన లేఖను చూసి ఈ కౌంటర్ లేఖ రాస్తున్నాను’’ అని అడ్లూరి లక్ష్మణ్ పేర్కొన్నారు. కేటీఆర్ తన లేఖలో వాడిన పదజాలంపై మంత్రి తీవ్రంగా మండిపడ్డారు. ‘‘రాజ్యాంగం, నిరంకుశత్వం, ఫాసిస్టు విధానాలు వంటి పెద్ద పెద్ద పదాలను మీరు లేఖలో వాడారు. అధికారం కోల్పోయిన తర్వాతే మీకు ఈ పదాలన్నీ గుర్తొస్తున్నాయా?’’ అని మంత్రి అడ్లూరి ప్రశ్నించారు. బీఆర్ఎస్ వాటిని అమలు చేయడంతోనే ప్రజలు  ఆ పార్టీ నేతలను ఫామ్‌‌హౌస్‌‌కే పరిమితం చేశారని మంత్రి అడ్లూరి తన లేఖలో ఎద్దేవా చేశారు.