
కొత్తపల్లి, వెలుగు: విద్యార్థుల సంక్షేమం విషయంలో ప్రభుత్వం రాజీపడేది లేదని, గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులకు దొడ్డు బియ్యంతో వండి పెడితే చర్యలు తప్పవని ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ హెచ్చరించారు. కొత్తపల్లి మండలం చింతకుంటలోని ఎస్సీ బాలికల గురుకులాన్ని సోమవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థుల కోసం వండిన ఆహారాన్ని మంత్రి పరిశీలించారు. ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేస్తుండగా, దొడ్డు బియ్యం ఎందుకు పెడుతున్నారని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
15 రోజులుగా దొడ్డు బియ్యంతో అన్నం వండుతున్నారని ప్రిన్సిపాల్ లక్ష్మి.. మంత్రికి ఫిర్యాదు చేయగా డీఎస్వోతో ఫోన్‌లో మాట్లాడారు. పేద విద్యార్థులు చదువుకునే గురుకుల పాఠశాలకు దొడ్డు బియ్యం పంపిణీ చేయడమేంటని డీఎస్‌వోపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై సివిల్ సప్లయీస్ కమిషనర్ దేవేంద్ర సింగ్ చౌహన్తో మంత్రి ఫోన్‌లో మాట్లాడి రెండురోజుల్లో సమస్య పరిష్కరించాలని సూచించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.
ప్రతి రైతుకు సరిపడా యూరియా అందిస్తాం
జగిత్యాల రూరల్: రైతులకు సరిపడా యూరియా అందిస్తామని, ఎవరూ ఆందోళన చెందొద్దని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. జగిత్యాల కలెక్టరేట్‌లో అగ్రికల్చర్ ఆఫీసర్లు, వ్యవసాయ సహకార సంఘాలు, ఎస్సారెస్పీ అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూరియా సప్లై విషయంలో వ్యవసాయ శాఖ మంత్రి నాగేశ్వరరావుతో మాట్లాడినట్లు చెప్పారు. అనంతరం కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ రైతులకు సరిపడ ఎరువులు అందుబాటులో ఉన్నాయన్నారు.