- మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్
జగిత్యాల రూరల్/పెగడపల్లి, వెలుగు: రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, రైతులు కష్టాల్లో ఉంటే ప్రతిపక్ష నాయకులు రాజకీయం చేయడం తగదని ఎస్సీ, ఎస్టీ, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. శుక్రవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డులో తడిసిన మక్కజొన్న, వరి ధాన్యాన్ని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌తో కలిసి మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఎవరూ ఆందోళన చెందొద్దని, తడిసిన ధాన్యం ప్రభుత్వం కొంటుందని హామీ ఇచ్చారు.
కేంద్ర ప్రభుత్వం ప్రతిఏటా పంటలకు మద్దతు ధర ప్రకటించి చేతులు దులుపుకుంటుందని ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను ఏనాడు పట్టించుకోలేదని, అప్పటి సీఎం కేసీఆర్ రైతులు వరి సాగు చేస్తే ఉరే అన్నారని గుర్తు చేశారు. అంతకుముందు పెగడపల్లి మండలం మద్దులపల్లి గ్రామంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా పశు వైద్య శిబిరాన్ని సందర్శించి శిబిరాన్ని మంత్రి ప్రారంభించారు. డీసీసీ అధ్యక్షుడు నందయ్య, జగిత్యాల మున్సిపల్ చైర్‌పర్సన్ సమిండ్ల వాణి, మార్కెట్ కమిటీ చైర్మన్లు బుర్ర రాములు గౌడ్, నారాయణరెడ్డి, సర్పంచ్ బలరాం రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
