- మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
జగిత్యాల టౌన్, వెలుగు: గురుకుల విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ఆదేశించారు. వెల్ఫేర్ వీక్‌లో భాగంగా గురువారం జగిత్యాల పట్టణంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కాలేజీని ఎమ్మెల్యే సంజయ్ కుమార్, కలెక్టర్ సత్యప్రసాద్‌తో కలిసి మంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా అల్పాహారం, భోజన నాణ్యతను స్వయంగా పరిశీలించి, విద్యార్థులతో కలిసి బ్రేక్ ఫాస్ట్ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా ప్రభుత్వం నిర్దేశించిన మెనూను పక్కాగా అమలు చేయాలన్నారు. వంటశాలల్లో పరిశుభ్రత పాటించాలని అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో మధుసూదన్, జిల్లా సంక్షేమ అధికారి రాజ్‌కుమార్ పాల్గొన్నారు.

