ఎస్సీ గురుకుల హాస్టళ్లలో క్వాలిటీ రైస్ .. అల్యూమినియం పాత్రలకు బదులు స్టీల్ గిన్నెలు: అడ్లూరి లక్ష్మణ్

ఎస్సీ గురుకుల హాస్టళ్లలో క్వాలిటీ రైస్ .. అల్యూమినియం పాత్రలకు బదులు స్టీల్ గిన్నెలు: అడ్లూరి లక్ష్మణ్
  • ప్రిన్సిపాల్స్, జోనల్ ఆఫీసర్లతో మీటింగ్​లో మంత్రి ఆదేశాలు 

హైదరాబాద్, వెలుగు: ఎస్సీ గురుకుల హాస్టళ్లలో విద్యార్థులకు నాణ్యమైన, ఫైన్ రకం బియ్యంతో భోజనం అందించేందుకు చర్యలు తీసుకుంటామని ఎస్సీ అభివృద్ధి, గిరిజన సంక్షేమ శాఖల మంత్రి అడ్లూరి లక్ష్మణ్ వెల్లడించారు. హాస్టళ్లలో ఇకపై అల్యూమినియం పాత్రలకు బదులుగా స్టీల్ పాత్రలలో వంటలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇందుకు అయ్యే ఖర్చులను అంచనా వేసి నివేదిక సమర్పించాలని సూచించారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారి గురుకుల ప్రిన్సిపాల్స్, జోనల్ ఆఫీసర్లు, ఆర్సీవోలతో మంత్రి లక్ష్మణ్ జూబ్లీహిల్స్ ఎంసీహెచ్ఆర్డీలో బుధవారం సమావేశమయ్యారు.

 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో విద్యార్థులు డార్మెటరీల్లోనే పాఠాలు విని, అక్కడే తిన్న ఘటనలు విన్నప్పుడు ఎంతో బాధ కలిగిందన్నారు. ఇకపై హాస్టళ్లను స్వయంగా పర్యటించి, సమస్యలను నేరుగా తెలుసుకుంటానని మంత్రి చెప్పారు. ఎస్సీ గురుకులాల్లో ప్రతి హాస్టల్‌‌‌‌కు15 రోజులకొకసారి స్థానిక పీహెచ్ సీ నుంచి డాక్టర్ల టీమ్ వచ్చి టెస్టులు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. సబ్జెక్టుల వారీగా వెనుకబడిన స్టూడెంట్లను గుర్తించి వారిపై ప్రత్యేక శ్రద్ద పెట్టాలని చెప్పారు. గురుకులాలకు డిమాండ్ భారీగా ఉందని, అడ్మిషన్లు పూర్తయినా ఇప్పటికీ సీట్ల కోసం తన వద్దకు వస్తున్నారని తెలిపారు.