హైదరాబాద్, వెలుగు: గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టల్స్‌లో పనిచేస్తున్న డైలీ వేజ్ వర్కర్లకు తగ్గించిన వేతనాలను తిరిగి చెల్లిస్తామని ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ హామీ ఇచ్చారు. విద్యార్థుల సౌకర్యం కోసం సమ్మెను విరమించాలని కార్మికులకు విజ్ఞప్తి చేశారు. దీంతో గత 41 రోజులుగా చేస్తున్న సమ్మెను తాత్కాలికంగా విరమించి విధుల్లో చేరుతున్నట్లు కార్మిక సంఘాలు ప్రకటించాయి.
డైలీ వేజ్, పీఎంహెచ్ వర్కర్లకు వేతనాలు తగ్గిస్తూ ఇచ్చిన జీవో 64, 527 అమలు నిలిపివేత, వర్కర్లకు టైం స్కేల్ ఇవ్వడంతో పాటు పీఎంహెచ్ వర్కర్లకు జీవో 60 ప్రకారం వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 12 నుంచి గిరిజన సంక్షేమ శాఖలో పనిచేస్తున్న వర్కర్లు సమ్మె చేస్తున్నారు. దీంతో మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి జోక్యంతో బుధ, గురువారాల్లో సెక్రటేరియెట్‌లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ను తన కార్యాలయంలో కార్మిక సంఘాల ప్రతినిధులు కలిసి, చర్చలు జరిపారు.
తగ్గించిన వేతనాలను తిరిగి చెల్లిస్తామని, దీని కోసం ఇప్పటికే ఆర్థిక శాఖ మంత్రి, అధికారులతో చర్చించామని మంత్రి వెల్లడించారు. టైంస్కేల్ సమస్యపై చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. ఈ సమావేశంలో గిరిజన సంక్షేమ శాఖ అడిషనల్ డైరెక్టర్ సర్వేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, రాష్ట్ర జేఏసీ నాయకులు బి.మధు, మాడె పాపారావు, కె.బ్రహ్మచారి, లక్ష్మణ్, జలంధర్, బి.నాగేశ్వరరావు, వీరులాల్, శ్రీను, నాగలక్ష్మి, సౌందర్య, నాగలక్ష్మి, శంకర్, రమేశ్, సురేందర్, భరత్, రామ్, జి.మోహన్, స్వామి, ముత్తమ్మ, సరళ, మోహన్, సుబ్బారావు, రవి, రాజేందర్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
